29, డిసెంబర్ 2010, బుధవారం

తల్లి రుణం తీర్చుకున్న తనయ.
















దేవుడి గుండె బండయ్యింది .
ఆ తల్లి 'అండ' కొండెక్కింది !



ఈ తల్లి నిండుకుండైంది .
తనే కొడుకయ్యింది !


తొణకకుండా ..వణకకుండా
ఓ కొత్త ఒరవడికి 'తొలి' అడుగైంది .



మనకి తెలియదు కానీ ..
ఆ తల్లి గుండె కరిగి ..
కన్నీరై కురిసే ఉంటది ..
ఈ కూతురు కాళ్ళు కడిగేందుకు !!

25, డిసెంబర్ 2010, శనివారం

సిటీ లైఫ్





 పక్కింట్లో పసి పిల్లోడి కేరింత ..
మా ఊరి పెరటి తోట లో కోయిల పాటలా ....!
వాడి బుగ్గలు పుణికి ముద్దు చేయగలనా ..?!
మనుషుల మనసుల్లో ...
గోడలు కట్టేసుకున్న ఈ కాంక్రీట్ జంగిల్లో..
మా పక్కింటోల్లు ,ఎప్పటికీ...
'అపరచితులే' ..ఎన్నేలయినా!


ఆకాశం లో ...వెన్నెల చందమామ !
ఆకాశ హర్మ్యాం లో ఉన్నా ..
పొందలేనేమో మా 'పల్లె' పంచిన అనుభూతిని ..!
కొబ్బరాకుల సందుల్లోంచి జారి ముద్దాడే వెన్నెల హాయిని !!
మనిషి గా ఎదిగిపోతున్నా ..
నా మనసే "మరుగుజ్జు "అవుతుంది , చిత్రం గా ... !

11, డిసెంబర్ 2010, శనివారం

చిన్నప్పటి స్నేహితురాలు ..




నా చిన్నప్పుడు .....
ఆమె వెండి మువ్వల పట్టీల
చప్పుడు ..నాకు వేకువ ఝామున ..
మేలుకొలుపు'!
ఆమె నవ్వు -మా ఊరి గోదారి అలల పాట !



పట్టు పరికిణీ కట్టిన 'పాలనురుగు' తను!
మా శెట్టి కొట్టులోకొచ్చిన కొత్త రంగు రిబ్బన్సు
కి ,బొట్టు బిల్లలకి మా ఊరి ' మోడల్ 'తను .



మా పిల్ల బ్యాచ్ కి 'రైలింజన్'తను .
మా కొత్త ఆలోచనలకి ,
అవిడియాలకి 'సెర్చ్ ఇంజిన్ ' తను.



నాకు దొరికిన చిలక్కొట్టిన
జాంపండు కి 'వాటా దారు 'తను .
నాకు పరీక్షల్లో వచ్చిన పాస్ మార్కులకి..
"దిక్కు -దారి "తను .



నేను బడి కి వెళ్ళేటపుడు 'మిత్రురాలు' తనే!
బడి నుండి వొచ్చాక....
తను మా అమ్మ ఒడిలో వాలి ...
గారాలు పోతున్నపుడు నా 'శత్రువు' తనే!!
ఇప్పుడు ...


పోయినా సంక్రాంతి పండక్కి కి నేను
ఊరెల్లినపుడు..మా ఊరొచ్చిన 'పుట్టింటి ఆడపడుచు'తను !
ఈ 'పెద్ద పండక్కి' వరకట్న పిచాశానికి బలై...
పెద్దల్లో కలిసిపోయిన 'నిండు ముత్తైదువ' తను!!
నాకు మాత్రం ...
ఎప్పటికీ జ్ఞాపకాల పుటల్లో ..
అపురూపం గా దాచుకునే ' నెమలికన్ను'తను.

30, నవంబర్ 2010, మంగళవారం

కాలేజ్ లవ్ !



నవ యవ్వన కళాశాల ...


రెండు జెడల సీత ...నెమలి నడకల్ని నేర్చి కొత్త అడుగులేస్తుంది !
నూనూగు మీసాల కోడె కుర్రోడికి ...లేలేత కొమ్ములు మొలక లేస్తాయి !!




సీత ... 'సిరిమల్లె 'అవుతుంది !
కోడె కుర్రోడు ... 'గండు తుమ్మెద' వుతాడు !!

కళాశాల ఓ " బృందావనం " !!

ఈ వలపుల దారిలో మలుపులెన్నో !
తలపుల జల్లుల్లో 'మైమరపు' లెన్నో !!

కవ్వింతలెన్నో ...!
ప్రణయ కలహాలు ఎన్నో ...!!

ఆ "కమ్మని కల" కాలం తో కదులుతుంది!
ఆ కదిలే కాలం ఓ కథకి 'సాక్షి 'అవుతుంది !!




చివరికి ,ఆ ప్రణయ గాధ కన్నీరైందో ....?!
పన్నీరై కురిసిందో ?!
కదిలే కాలాన్ని అడిగితే .....
ఓ" కమ్మని వ్యధ" ని కథలు కథలు గా చెబుతుంది !!


నోట్ : అయ్యో ..రామా !
మన అబ్దుల్ కలామ్ గారు" కలలు" కనమన్నది .......
ఈ" కలల్ని" కాదు ఫ్రెండ్స్ !!

27, నవంబర్ 2010, శనివారం

సోనియమ్మ 'ఆట '!

మా చిన్నపుడు మేము ఎంతో ఇష్టంగా గా ఆడే ఆట 'దాగుడు మూతలు' .

దాగుడు మూతలు అంటే..మామూలు గా కళ్ళకి గంతలు కట్టుకుని ఆడే ఆట కాదు .

మేము ఆడే ఆట విధానంబెట్టిదనగా ..,మేము 'ముద్దాయిగా 'నిలబెట్టిన ఒకతను ఓ చోట నిలబడి గట్టిగా కళ్ళుమూసుకుని...ఒకటినుండి పది వరకూ అంకెలు లెక్కపెట్టాలన్న మాట ! ఈ లోపు మిగిలిన పిల్లలమంతా ..ఆ మనిషికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో దాక్కోవాలి .ఆలా దాక్కున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కనిపెట్టాలి (అలా జట్టులో చివరి మనిషి వరకూ దొరకాలి ) .

ఒక వేళ ఈ ఆట మద్యలో జట్టు లో ఎవరైనా ఆ 'వెదికే మనిషి' చూడకుండా వెనకనుండి వచ్చి "ఎస్" అని గట్టిగా అరుస్తూ ఆ మనిషిని ని ముట్టుకుంటే మళ్లీ ఆ మొదటి వ్యక్తే మళ్లీ మొదటినుండి ఆట ఆడాలి . అంటే ..చివరికంటా ఎవరికీ చిక్కకుండా అందరిని అవుట్ చెయ్యాలన్న మాట ! అలా చివరికంటా కనిపెట్టగలిగితే ...ఆ ఆటలో మొట్ట మొదట దొరికిన మనిషి 'ముద్దాయి' . అలా దొరికిన ముద్దాయి చేత ఇరవై గుంజీలు తీయించి ,మళ్లీ కొత్త ఆటని మొదలు పెట్టేవాళ్ళం .

ఇలా సాగేది మా ఆట!కొంచెం కష్టమే !ఎక్కువ సార్లు మనం ముద్దాయిగా దొరకుండా ఉండాలంటే ..మనకి ఒక అనుకూల వర్గం ఒకటి ఉండాలి .ఆ వెదికే వాడు మనవాడు అయితే .. పొరపాటున మనం ముందు కనిపించినా 'తూచ్ 'అన్నమాట ! పేరు కి అటే గానీ, ఆ ఆట ఎప్పుడూ కక్ష సాధింపు దిశ గానే జరిగేది . ఏక పక్షం గానే సాగేది . దీనంతటికి మూల 'సూత్రధారి ' మా తో కలిసి ఉంటూ ,మా తోనే గొడవలు పడే 'దుర్గ '.వయసులో మా కంటే కొంచెం చిన్నదే అయినా ,ఆలోచనల్లో మాత్రం ఆపిల్ల దేశముదురు !వాళ్ళ ఇంటి లో నుండి తెచ్చిన నువ్వుపప్పు జీడి లని ,మామిడి తాండ్ర లాంటి చిరు తిళ్ళు చూపించి ..మా జట్టులోని సగం మంది ని తనవైపుకే లాక్కోనేసేది .అందువలన తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె 'పెత్తందారీ తనాన్ని' భరించాల్సివచ్చేది.

మొదట ఆట తనే మొదలు పెట్టేది ,ఆనక తనకి గిట్టని పిల్లల్ని తనే ఒక ఆట ఆడించేది . ప్రతీ ఆట లోనూ తనకి ప్రతికూలం గా ఉండే ఆటగాళ్ళని 'ముద్దాయి' లు గా చేసి గుంజీలు తీయించి ,మూడు చెరువుల నీళ్ళు తాగించేది .ఆ రకం గా వాళ్ళ మీద కక్ష తీర్చుకునేది .ఈ ఆటలో ..చిరుతిళ్ళు కి అలవాటు పడ్డవాళ్ళని ,కాస్తో కూస్తో అమాయకుల్ని తనకి అనుకూలం గా వాడు కుంటూ తన మాట లెక్కచేయని వాళ్ళ ఆట కట్టించేది.తనకి నచ్చినట్టు రూల్సు మార్చి దబాయించి మరీ తన ఆధిపత్యాన్ని నిలుపుకునేది ..అందరూ తను చెప్పినట్టే వినాలనే పంతం దుర్గది! .ఆ ఆధిపత్య ధోరణి ఆమె వయసుతో పాటే పెరిగి పెద్దదయ్యింది . తను పెద్దయ్యాక ఓ నాయకురలవుతుందేమో అనుకునేవాన్ని నేను !కానీ పెళ్లై అత్తారింటికి వెళ్లి తల్లైంది .

చాల రోజుల తరువాత నాకు దుర్గ గుర్తుకొచ్చింది -అది కూడా అఖిల భారత కాంగ్రేస్ కమిటీ అధ్యక్షురాలు సోనియమ్మ దయవల్లే!గత కొద్ది రోజులుగా దేశం లో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని చూస్తే ..మా దుర్గ కి ఆ అమ్మి కి ఏవో దగ్గరి పోలికలు ఉన్నాయనిపించింది నాకు .

దేశ రాజకీయాలలో ఎక్కడైనా ,ఎప్పుడైనా వాళ్ళ పార్టీ కి గానీ,వాళ్ళ కుటుంబ వారసత్వానికి గానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినపుడు ఆమె అవలంబిస్తున్న తీరు ఆమెలోని 'ఆధిపత్య ధోరణికి 'అద్దం పడుతుంది.

"ఈ ఆధిపత్య ధోరణి అనేది ఇవాల్టి విషయం కాదని" ..కొద్దో గొప్పో రాజకీయ పరిజ్ఞానం ఉన్న మా పెద నాన్న గారు చెప్పినపుడు నాకు కొంచెం పరిస్థితి అర్ధమైంది . "ఈ గాంధీ కుటుంబీకులకి 'దేశాధికారం' తమ చేతులు దాటిపోవడం ఇష్టం ఉండదట !తమ అధికారాన్ని ,ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం ఏమి చెయ్యడానికైనా వెనకాడరట . ఆమె 'అత్తమ్మ' ఇందిరమ్మ హయాం లో ఈ 'హవా 'బాగా నడిచిందట !ఆమె అమలుపరిచిన "ఎమర్జన్సీ " ఆమెకి ఓ మాయని మచ్చ గా మిగిలిపోయింది !"

ఇందిరమ్మ గురుంచి మా పెదనాన్న గారు చెప్పిన మాటలేమో గానీ..,సోనియమ్మ విషయం లో మాత్రం ఈ 'హవా' నూటికి నూరు పాళ్ళు నిజమనిపిస్తుంది నాకు .మొన్న మన రాష్ట్రం లో జరిగిన' రాజకీయనాటకాన్ని' ఎంతో రసవత్తకరంగా రక్తి కట్టించినపటికి అసలు నిజం అతి సామాన్య మానవుడికి కూడా అర్ధమైపోయింది .సోనియా ఏక పక్ష నిర్ణయం వల్లే రోశయ్యగారు 'పదవీ విరమణ' చెయ్యడం ,కొత్త ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ గారు భాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నది ఇట్టే తెలిసిపోతుంది . ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకు ఉన్న వ్యక్తిగత కారణాలు ఏమైనప్పటికీ ..ఈ డిల్లీ పెద్దలకి తెలుగు ప్రజానీకం పట్ల ,వారి మనోభావాల పట్ల కొంచెమైనా గౌరవం లేదన్న విషయం మాత్రం తేటతెల్లమవుతుంది .ప్రజలు ఎంతో నమ్మకం తో ఎన్నుకున్న నాయకుల ప్రమేయం కొంచెమైన లేకుండా (మాట్లాడే స్వేచ్చ ఇవ్వకుండా ..అనడం సబబు ) సోనియగారు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తెలుగు ప్రజల్ని అవమాన పరచడమే . ఇలాంటి అవమానాల్ని చవిచూడటం వల్లే తారకరామారావు గారు "తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం " అన్న నినాదం తో ఓ పార్టీని స్థాపించి ,విదేశాలలో తెలుగు మహా సభలు పెట్టి తెలుగు జాతి 'ఆత్మ గౌరవాన్ని' అంతర్జాతీయం గా వెలుగెత్తి చాటారు .బిడ్డ ఆకలి ..తల్లి కి తెలుస్తుంది!ఓ తెలుగు వాడి ఆత్మఘోష ఆత్మాభిమానం ఉన్న తెలుగు వాడికే తెలుస్తుంది . అందుకే మన తెలుగు వాళ్ళకి చుర కత్తి లాంటి తెలుగోడే నాయకత్వం వహించాలి -వెన్నెముక లేని కీలుబొమ్మ లు కాదు !

రాష్ట్రాల్లో 'అధికారమే' ఆ పార్టీ ప్రధాన అజెండా గా నడుచుకునే ఈ డిల్లీ నాయకత్వం ,ప్రజల మనోభావాల గురుంచి ..వాళ్ళ కష్ట ,నష్టాల గురుంచి ఆలోచిస్తుంది అనుకోవడం అవివేకం !వాళ్ళకి కావలసిందల్లా ..వాళ్ళు చెప్పినట్టు వినే కీలుబోమ్మల్లాంటి 'స్థానిక నాయకులు 'మాత్రమే !

ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే .. ఇప్పుడున్న నాయకుల్లో కాస్తో కూస్తో ఆత్మాభిమానం ఉన్న రోశయ్య గారు ఆ 'కీలుబొమ్మ' పనిని సక్రమంగా నిర్వర్తించలేకే ..రాజీనామా చేసారా ?!లేక ..అధిష్టానమే తమ ప్రతికూల వర్గీయులకి 'చెక్' పెట్టడానికి ..అదే సామాజిక (ప్రత్యర్ధి సామాజిక వర్గం )వర్గానికి ,ప్రాంతానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ని చేసారా అనేది దైవ రహస్యం !ఈయన గారైనా ..తారక రామారావు గారి లా ,రాజశేఖరుడు లా తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని జగతికి వెలుగెత్తి చాటేలా పరిపాలిస్తాడో.. లేకుంటే, 'అమ్మ భజన 'చేస్తూ కీలుబొమ్మాలానే మిగిలిపోతారా అనేది ప్రస్తుత ప్రశ్న?! ఏది ఏమైనా ..ఈ 'కుర్చీలాట' చిన్న పిల్లల 'బొమ్మలాట 'లా అయిపోవడం మన ఆంధ్రరాష్ట్ర దురదృష్టం !సంవత్సరానికి ఒకరు చొప్పున కొత్తగా కుర్చీ ఎక్కిన సి .ఏం లు ,ఆ కుర్చీలో కుదురుకోవడానికే కొన్ని రోజులు గడిచిపోతాయి ..ఇంక రాష్ట్ర అభివృద్ధి గురుంచి ,సంక్షేమం గురుంచి ఆలోచించే సమయం ఎక్కడిది ?!

ఎంతైనా మా 'దుర్గ' నే నయం !తను మా ఆటలో కొన్ని రూల్సుని మార్చేది గానీ ..ఈ సోనియమ్మ లా మొత్తం 'ఆట' నే మార్చేది కాదు !!

21, నవంబర్ 2010, ఆదివారం

అభిమాన సంఘాలు !




"ఒరేయ్ ..ఆడేం పార్టీ?"

"మన పార్టీనేరా..క్రిష్ణా పార్టీ .."

వేసవి సెలవుల కి మా ఊరోచ్చిన మా చిన్నమ్మ కొడుకు శీను ని మా జట్టు కుర్రోల్లకి పరిచయం చేసేవాడ్ని . "మరి ఆడో ..? "మాకు కాస్తంత దూరం లో నిలబడి నేల చూపులు చూస్తున్నమా మావయ్య కొడుకు యోగి గాడి గురుంచి కాస్తంత డౌటు గానే అడిగేవారు మా జట్టు వాళ్ళు . "మరే ..మరే ఆడు చిరంజీ{చిరంజీవి } పార్టీ రా .." నేను నీళ్ళు నమిలేవాడ్ని. "యోగ్గాడు మన ఆటలో వొద్దు .శీను గాడ్ని రమ్మను . " అనేసి ఆటల్లో నిమగ్నమై పోయేవాళ్ళు . యోగ్గాడు మాత్రం ముఖం మాడ్చుకుని ఓ మూలన కూచునేవాడు. వాళ్ళ ఊరికి వెళ్తే నా పరిస్థితి కూడా అంతే !ఎందుకంటే...వాళ్ళ ఊళ్ళో వాడి జట్టు కుర్రాల్లంత 'చిరంజీ 'పార్టీ మరి !
ఆ వయసులో ..ఆ పార్టీలు తప్ప ..ఓట్లు కోసం ,కోట్ల కోసం కొన్ని 'రాజకీయ పార్టీలు' ఉంటాయని ..నోటు తీసుకుని ఓటు వేసే జనాలు ఉంటారని మాకు నిజ్జం గా తెలీదు !
ఆ రోజుల్లో 'ఓట్లు ఎలక్షనంటే' మా స్కూలికి సెలవని మాత్రమే తెలుసు మాకు !
ఆ ఎలక్షన్ల లాగే ..మనోళ్ళకి కూడా ఎలక్షన్లు ఉంటే మనోడే నేగ్గేస్తాడు కదరా ..అని ఒకడంటే ,లేదు మావోడే నెగ్గుతాడని ఇంకొకడు ,అలా ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకునేవాళ్ళం .
ఒక్కోసారి కొట్టుకోడానికి కూడా రెడీ అయిపోయేవాళ్ళం .అది "చిన్నతనం " !

జనవరి పస్టుకి మా అభిమాన హీరోల్ల గ్రీటింగులనే కొనుకున్నేవాళ్ళం .ఎవరైనా మా 'ఎగస్పార్టీ ' హీరో గ్రీటింగు ఇస్తే ,అది వాళ్ళు చూడకుండా చించేసేవాళ్ళం.అంతటి అభిమానం(?)(దీనిని దురాభిమానం అనాలేమో :) ఉండేది మా లో !
ఆ అభిమానం మా వయసు తో పాటే కొంచెం పెద్దదవుతూ ..వచ్చింది .కానీ కొట్టుకోవడం ,తిట్టుకోవడాలు మాత్రం తగ్గినై .
కొన్ని రోజులకి ..మాలో కొంతమంది క్రిష్ణ ముసలాడైపోతున్నాడని ,మహేసు ఫ్యాన్సు కి మారిపోతే ,ఇంకొందరు వేరే హీరో ఫ్యాన్సుకి మారిపోయారు .చిరంజీ ఫ్యాన్సు లో కొంతమంది పవన్ కళ్యాణు వచ్చాక అటువైపు జారిపోయారు .
అలాగే ..బాలకృష్ణ ఫ్యాన్సు కొంతమంది ..నాగార్జున ఫ్యాన్సు ఇంకొంతమంది .
నేను మాత్రం 'చంటి' సినిమా చూసాక వేంకటేశు ఫ్యాన్సుకి మారిపోయాను .
మాది అసలే కోనసీమ కదా ..అభిమానాలు ,ఆప్యాయతలు కొంచెం ఎక్కువే !కానీ సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు మారిపోతాయి అంతే!:)

మాకు కొంచెం వయసొచ్చాక .. బజారు లో కి అడుగుపెట్టాక ఎవరికీ నచ్చిన' అభిమాన సంఘాల్లో'వాళ్ళు జాయినైపోయాము.ఆ అభిమానసంఘాల నేపధ్యం లో మా హీరోల పుట్టిన రోజులకి మాకు చేతనైనంత 'సమాజ సేవ' చేసే వాళ్ళం !మా అభిమానం ఈ రకం గా నైనా ఉపయోగపడుతున్నందుకు ..చాలా సంతోచించేవాన్ని నేను . మా అభిమాన హీరో సినిమా రిలీజు రోజైతే మాత్రం ..'ధియేటర్ 'లో హంగామా మొత్తం మా ఫ్యాన్స్ అసోషియేషన్ వాళ్ళదే !
ధియేటర్ మొత్తం రంగు రంగుల జండాల తో అలంకరించేవాళ్ళం."బెనిపిట్ "షో సినిమా టిక్కెట్లన్నీ మా చేతిలోనే ..! తెలిసిన వాళ్ళు మమ్మల్ని టిక్కెట్లు కోసం బ్రతిమాలుతుంటే ..తెగ కటింగులు యిచ్చెసేవాళ్ళం. 'వందరోజుల 'రోజుల పండగల్ని ఘనం గా చేసి ..'సితార' పేపరులో మా అసోషియేషన్ పేరు ,మా పేర్లు చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం .అలా ఆ రోజుల్లో మా 'హవా' సాఫీగా సరదాగా నడిచిపోయింది .

రోజులు గడిచే కొద్దీ ..మా జట్టు లో కొంత మందిమి "బ్రతుకుతెరువు "కోసం నగర బాటలు పట్టాం!మిగిలిని వాళ్ళు ఊరిలోనే స్థిరపడిపోయారు .మా అభిమాన సంఘాలు పోయినా ..ఆ స్థానం ఇంకో కొత్త 'అభిమాన సంఘాలు' పుట్టుకొచ్చాయి .సినిమా హీరోలు కూడా పెరిగారు కదా !
మొన్నొక రోజు మా ఊరు నుండి మా చిన్న నాటి స్నేహితుడు సుబ్రహ్మణ్యం పోను చేసి "ఒరేయ్ !మొన్న మన గడియారం స్థంబం సెంటరు లో పెద్ద గొడవైపోయిందిరా.."అన్నాడు .'ఎందుకురా?!' అని ఆరా తీస్తే ..ఒక 'అభిమాన హీరో' కటౌట్ కి ఎవరో మట్టి కొట్టారట..ఆ కోపం తో వీళ్ళు అవతలి వాళ్ళ
'అభిమాన హీరో' సినిమా వాల్ పోస్టర్లు అన్నీ చించేసారట!ఎంత పిచ్చితనం !మేం చిన్నతనం లో ఏదో తెలియక కొట్టుకునేవాళ్ళం . కానీ వీళ్ళకి వయసొచ్చాక..జ్ఞానం తెలిసాక కూడా ఈ 'చిల్లర' పనులేమిటో?!వీళ్ళ పుట్టినరోజులు మానుకుని ఆ డబ్బులు తో ,వాళ్ళ అభిమాన హీరో ల పుట్టిన రోజులకి జెండాలు కొని 'పండగ' చేసే పిచ్చి జనాలు ఉన్నారు మా ఊళ్ళో !
ఈ అభిమానులు ఇలా కొట్టుకు చస్తున్నపుడైనా సదరు అభిమాన హీరోలు "మేమంతా ఒకటే ..మా కోసం మీరు కొట్టుకోవద్దు "అని చిన్న స్టేట్ మెంట్ ఇస్తే చాలా వరకు గొడవలు తగ్గొచ్చు .కానీ వాళ్ళకి ఇదంతా 'చిన్న విషయం' !

సరే ,ఆ సినీ అభిమానుల సంగతి కొంచెం పక్కన పెడితే ... నేను ఈ మద్య కొత్తగా చూసినవి(నేను చూడటం కొత్త తప్ప .ఇవి పాతవే ) "రాజకీయ అభిమాన సంఘాలు "!
ముఖ్యం గా హైదరాబాద్ లో ఐతే గల్లీకో నాయకుడు తయారై .చుట్టూ వందమంది తో ఓ 'అభిమాన సంఘాన్ని' పెట్టుకోవడం ..వాళ్ళ తో ఊరేగింపుగా వెళ్లి ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆర్భాటం గా చేరిపోవడం ఒక ఫ్యాషను అయిపొయింది .ఆ అభిమానుల్లో ఆ అభిమానం ఎక్కడినుండి పొంగుకోస్తుందో ..ఆ నాయకులకి ,ఆ అభిమానులకే తెలియాలి మరి !

నాకు మాత్రం ఒక్కటి అనిపించింది -ఈ రాజకీయ అభిమాన సంఘాలతో పోల్చుకుంటే ,ఏమీ ఆశించకుండా గుండె నిండా నిండైన ప్రేమని నింపుకునే ఈ 'సినీ అభిమానులు''వెయ్యి రెట్లు బెటర్ అని !కానీ ఆ అభిమానం కొంచెం శ్రుతి మించకుండా ఉంటే మంచిది .
హీరోలూ!ఈ పిచ్చి అభిమానులని కొంచెం గమనిస్తూ ఉండండీ ...వాళ్ళకి అదే పదివేలు !

13, నవంబర్ 2010, శనివారం

మన 'బొట్టు' చెరిగిపోతుందా?!



మా నాయనమ్మ పేరు సీతా మహాలక్ష్మి .నేను పుట్టకముందే చనిపోయింది ఆవిడ.
నాకు ఆవిడ ని చూసే భాగ్యం లేదు కానీ ..ఆవిడ 'సౌభాగ్యం' గురుంచి మా ఊరి జనాలు గొప్ప గా చెబుతుంటే ..ఇప్పటికీ విని మురిసిపోతాను .
'పిల్లోడా!నీవు మీ నానమ్మ ని చూడలేదు గానీ..మహా తల్లీ !రూపాయి కాసంత బొట్టు ఎట్టుకుని..తలనిండా పూలు ఎట్టుకుని సాక్షాత్తూ..సీతమ్మ తల్లీ లా కళ కళ్ళాడతా తిరిగేదనుకో ..."అంటూ మా నాయనమ్మ ని కళ్ళ తో చుసిన వాళ్ళు కళ్ళని ఇంతలేసి చేసి చెబుతుంటే ..నా మనసుకి చాలా భాదైపోయేది. ఆ మహా తల్లి ని నేను ఎందుకు చూడలేక పోయానా..అని !
నా చిన్నతనం లో మా ఇంట్లో ఉండే ఒక్క బ్లాక్ &వైటు పోటో కూడా చెద పట్టేసి పాడై..నాకు ఉహ తెలిసే సరికి ఆమె రూపం నా మెదడు లో నిక్షిప్తమైపోకుండానే మాయమైపోయింది .

టివి ల్లో ఏ ఎమ్.ఎస్ .సుబ్బలక్ష్మి గార్నో .సుష్మ స్వరాజ్ గార్నో చూసినప్పుడల్లా ,రూపాయి కాసంత బొట్టు తో అచ్చం మా నాయనమ్మ ఇలానే వెలుగుపొతూ ఉండేదేమో అనుకోవడం తప్ప ,వేరే భాగ్యం లేకుండా పోయింది నాకు!
ఆడవాళ్ళ కి బొట్టు ఎంత అందాన్ని ఇస్తుందో ..ఆ మహా తల్లుల ముఖారవిందాల్నిచూస్తూనే అర్ధమౌతుంది .
మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం గా మెరిసే 'బొట్టు' కి మన జీవన సరళి లో ఒక ప్రత్యెక స్థానం !
రాజు ల కాలం లో ..యుద్దానికి వెళ్ళేటప్పుడు' వీర తిలకం' దిద్ది సాగనంపెవారట !
బొట్టు అలంకారమే కాదు..ఒక భరోసా కూడా!
భక్తుడు కుంకుమ నుదుటన దిద్దినా..భార్య తిలకం దిద్దినా ...వీరుడి కి వీర తిలకం దిద్దినా ..ఆ 'బొట్టు' ఓ చల్లని చెయ్యి మనకి చేదోడు గా ఉన్నదన్న ధైర్యాన్ని ఇస్తుంది !
మా అమ్మ కూడా పొద్దు పొద్దున్నే నిద్ర లేచి ,నుదుటున రూపాయ కాసంత కాకపోయినా ..పావలా బిల్లంత తిలకం దిద్ది ఆపై కుంకుమ అద్ది ..అచ్చం లక్షి దేవి లా మెరిసిపోతుంది .
నా కంటే ముందే నిద్ర లేచి 'సూర్య బింబాన్ని' నుదుటున అలంకరించుకునే అమ్మని బొట్టు లేకుండా చూడటం ..నా చిన్న తనం నుండి ఇప్పటికీ వరకూ ఒక్కసారి కూడా తటస్థ పడలేధంటే ..అతిశయోక్తి కాదు .ఇప్పటికీ ప్రతి రోజు అంతే శ్రద్దగా భక్తి గా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంది అమ్మ .
మా అమ్మ ఒక్కరే కాదు.. కొన్ని సంత్సరాల క్రితం నాటి 'అమ్మలు' అందరూ అంతే ..ఎంతో భక్తి శ్రద్దలతో 'తిలక ధారణ' చేస్తారు .
కానీ ఈ మద్య కాలం లో కొంత మంది 'అమ్మల' కి మాత్రం బొట్టు ఒక అలంకారం మాత్రమే ...
ఈ కాలం అమ్మాయిలకైతే ...బొట్టు ఒక 'ఎబ్బెట్టు'!
మొన్నీ మద్యనే మా ఊళ్ళో కొంత మంది ఆడవాళ్లు 'మత మార్పిడి' పేరిట నుదుటన బొట్టు ని నిర్ధాక్షిణ్యం గా చెరిపేసుకున్నారు.

ఇలాగే సాగితే ...
కాలక్రమం లో భరత మాత నుదుట పైన మన సౌభాగ్యపు 'బొట్టు' చెరిగిపోతుందా?
మన తరువాత తరాల పిల్లలకి మన సాంప్రదాయక బొట్టు,పాఠ్య పుస్తకాలలో ఒక 'చరిత్ర పాఠం' గానే మిగిలిపోతుందా ?!ఏమో !

9, అక్టోబర్ 2010, శనివారం

శాటిస్ఫేక్షన్!



నా గొంతుకలో పొలమారినప్పుడల్లా...
నాలో చిన్న శాటిస్ఫేక్షన్!
నా కోసం ఎవరో ..
ఎక్కడో అలోచిస్తున్నారన్న 'పిచ్చిఅలోచన '!

నిజం తెలీక కాదు ..
సైన్సు ఎరుగక కాదు ...
ఈ అభాగ్య నగరం లో ఒంటరితనం తో అలమటించే
నా చిన్ని హృదయానికి
ఈ 'పిచ్చి ఆలోచనే' ఓ పెద్ద 'ఓదార్పు' మరి !

నిజం చెప్పొద్దూ ...
ఒక్కోసారి ..
మనల్ని మనం మోసం చేసుకోవడం లో కూడా..
"ఆనందం"ఉంటుంది సుమీ !

7, అక్టోబర్ 2010, గురువారం

బస్టాపు




ఉదయాన్నే ..బస్టాపు -
'గండుతుమ్మెదల' 
పహారా చుట్టూ....
'సీతాకోకచిలుకలు'
వాలిన చెట్టు !



(కాలేజీ పిల్లల తో కళ కళ్ళాడుతున్న బస్టాపు ని చూశాక..)

5, అక్టోబర్ 2010, మంగళవారం

ఫస్టు ఎయిడ్


బాపు గారి బొమ్మ ని ఎడిట్ చేసినందుకు ..పెద్ద మనసు తో క్షమించాలి .


ఆటలో గాయానికి
అమ్మ 'టీపొడి' కట్టు !

మా అమ్మ..
మా "ప్యామిలీ డాక్టర్ "!!

1, అక్టోబర్ 2010, శుక్రవారం

బొట్టు

.
బొట్టు ..

ఉదయాన్నే..
సూరీడు కంటే ముందే ..

మా అమ్మ నుదుటి మీద
ఎర్రగా ఉదయిస్తుంది !

సోకు



మా మందార చెట్టుకి
సోకెక్కువ!

తెల్లగా తెల్లారకముందే ..
తల నిండుగా పూలని
సింగారించుకుంటుంది!!

29, సెప్టెంబర్ 2010, బుధవారం

కొత్తబట్టలు



మా అన్నయ్య కురచ బట్టల్ని
సైజు చేయించింది అమ్మ !

రేపటి పండక్కి ..
నాకు 'కొత్త బట్టలు' రెడీ :) !!

వెన్నముద్ద



మన చిన్నప్పుడు...
ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన
చల్లని 'వెన్నముద్ద' ...చందమామ :) !

మహా రాజు


నెత్తిన కీరిటం ..
రాజ్యాలు ఎటుపోయాయో... పాపం ?!

మోత




కాలక్రమం లో...
గాడిద 'బరువుని'
మనిషి కి ట్రాన్సఫర్ చేసింది ..విధి!

పండగ








పువ్వుకి
పండగొచ్చింది ..

వాన లో ..
తలంటు పోసుకుంది !

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

కడుపు మంట


ఐదు నక్షత్రాల అంగడి లోనైనా ..
రోడ్డు పక్క ధాబా లోనైనా ..
గుభాళించదేం ..మా అమ్మ పెట్టే 'పోపు'తాలింపు?!

ఈ అ'భాగ్య ' నగరాల్లో .....
కోట్లు కుమ్మరించినా దొరకనిది అమ్మ ప్రేమే కాదు ..సుమీ!
కమ్మని అమ్మ చేతి వంట కూడా !!

(ఓ బ్యాచిలర్ 'కడుపుమంట' )

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

దోబూచులాట



నా హృదయం గాయం చేసి ..
మళ్లీ వెన్నెల పూసి ..
చెలీ !ఎన్నాళ్ళిలా..?!

నా మది లో ఆశలు రేపి ..
కొత్తగా లోకం చూపి ..పొమ్మంటే ఎలా ?!

సఖి !
నీ తడి తడి పెదవుల 'తొలి జ్ఞాపకం ' ఎప్పటికీ తడి ఆరిపోదు ..
నీ గల గల నవ్వుల 'కమ్మని రాగం 'ఎన్నటి కీ నా మదిని విడిపోదు ..

ఏమిటో చిత్రం గా ..ఒక్కోసారి ..
చావైనా..బ్రతుకైనా నా తోనే అంటావు ..నా కలలో సైతం తోడుంటావు .
ఆ కమ్మని కలలో హరివిల్లు తెచ్చుకుని పొదరిల్లు కట్టుకుంటాను .
ఆ కలల పొదరింట్లో కి నిన్ను రమ్మంటే ...
మళ్లీ 'కెరియర్ 'అంటావు .. నా కమ్మని కలల్నివిసిరేసి దూరం పారిపోతావు.

ఆశల రెక్కల్ని నీ వీపు కి కట్టుకుని ఎక్కడికో ఎగిరిపోతూ ..
నన్ను కన్నీటి కడలి లోకి తోచేస్తావు.
"నా బ్రతుకింతేనని" .. నా గుండె గాయానికి కన్నీటి మందు పూస్తుంటే ...
మళ్లీ మరుమల్లె లా వచ్చి నీ 'మానస సరోవరం' లో ముంచెత్తుతావు -మరుజన్మలోనైనా నన్ను వీడిపోనంటావు !!

ఎందుకిలా ?!
ఓ సారి వరమిస్తావు .. మరుక్షణమే నిరసిస్తావు .
అసలు దీనిని ఏమంటావు ..ప్రేమంటావా ?!
లేక ,చివరికి -'సరదాకి 'అని చెప్పి పొమ్మంటావా ?!

(ఎక్కువ పీల్ అవ్వకండి ..ప్లీజ్ ! )

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

మా పాలవెల్లి

వినాయక చవితి !
"నాన్నోయ్ !నాలుగు యాప్లిస్ కాయలు (ఆపిల్స్ ),నాలుగు బత్తాకాయలు ,ఆరు మొక్క జొన్న పొత్తులు ,రెండు ఎలక్కాయలు(వెలగపండు )...."నా లిస్టు ఇంకా పూర్తి కాకుండానే నాన్న మద్యలో అడ్డు తగిలి "అన్నీ తెస్తాలేరా "అనేసి కర్రల సంచి ని హీరో సైకిలు హ్యాండిలు కి తగిలించి పండగ సరంజామా తీసుకు రావడానికి బజారు కి బయలుదేరేవారు.
ఆయన సైకిలు వెనకాలే వీది మలుపు వరకూ పరుగెత్తి ..."నాన్నోయ్ !సాయంత్రం వచ్చేటప్పుడు కొత్త 'పాలిల్లు '(పాల వెల్లి) కూడా తీసుకురా !"అని మెల్లగా చెప్పేవాన్ని .గట్టిగా చెబితే ఎవరైనా విని అమ్మ తో చెప్పేస్తారని నా భయం !
నా కొత్త పాలిల్లు కోరిక కి మొదటి అడ్డుపుల్ల ఆవిడే మరి!
అమ్మ నాకంటే కూడా భలే తెలివైంది .నేను వీధి లోంచి ఇంట్లో కి రాగానే "ఓయ్ చిన్నా!అటక మీద ఉన్న పాలిల్లు దించుకుని శుబ్రం చేసుకో " అనేది ."లేదమ్మా !కొత్త పాలిల్లు తీసుకు రమ్మని నాన్న తో చెప్పాను .ఇంక పాతది ఎందుకు ?"అన్నాను ధీమాగా !
"దాని సంగతి తరువాత ముందు దీని సంగతి చూడు "అని ఆర్డరేసేది అమ్మ .
ఆవిడ బాధ భరించలేక అటక మీద ఉన్న పాత పాలవెల్లి దించి ,దానికి ఉన్న ఎండిపోయిన మావిడాకుల్ని తుంచి .బూజు దులిపి ఓ మూలన పెట్టేవాడిని .ఊళ్ళో అందరి పాలవెల్లు ల కంటే నాది నెం .వన్ గా ఉండాలని నా ఫీలింగు !
నాన్న కి లిస్టు చెప్పినా నా ప్రయత్నం లో నేను ఉందామని ...పక్క ఇంటి వాళ్ళ పెరటి చెట్ల మీద ఒక కన్నేసి ఉంచేవాడిని.వాళ్ళ పెరటి నిండా నారింజ ,బత్తాయి ,జామ, రాంబాల కాయలు (సీతా పలాలు లెండి ) చెట్లు !
వాళ్ళు మద్యాహ్నం నిద్రకి ఉపక్రమించగానే గోడ దూకి నా పని కానిచ్చేసేవాడిని.ఆ పెరట్లో నాలాంటి వాళ్ళు చాలా మందే ఉండేవారు .
మా ఇంటి ఎదురుగా ఉండే చెరువు లోని కలువ పువ్వుల్ని కోసుకొచ్చేవాడిని.
సాయంత్రం అయ్యేసరికి పండగ సామాన్లని తీసుకొచ్చేవారు నాన్న -నా కొత్త "పాలిల్లు" తప్ప !నా కంటే ముందే అమ్మ నాన్న తో మాట్లాడి నా కొత్త పాలిల్లు కి స్కెచ్ గీసేసిందని అప్పుడే నాకు అర్దమయ్యేది .నాకు కన్నీళ్ళు ఆగేవి కావు ...నులకమంచం లో పడి వెక్కి వెక్కి ఎడ్చేసేవాడిని.ఆ రాత్రి కి అన్నం తినేవాడ్ని కాదు .
అయినా తప్పదు కదా ..ఉదయాన్నే లేచి నా బూజు పట్టిన పాలవెల్లి ని మా రామాలయం ఎదురుగా ఉండే బావి దగ్గరకి తీసుకుపోయి నీటు గా కడిగేవాన్ని!మా ఊళ్ళో అందరి "పాలిల్లు "లు అక్కడికే తీసుకొచ్చి కడిగేవారు.కొత్త పాల వెల్లులు తెచ్చుకున్న కుర్రోళ్ళు కొంచెం హొయలు పోతుంటే ... .నా మనసుకి ఎక్కడో చివుక్కుమనేది .దీనంతటికి కారణమైన మా అమ్మ మీద కోపం వచ్చేది .
నేను మూతి ముడుచుకుని కూచుంటే అమ్మ దానికి పసుపు రాసి ..కుంకం బొట్లు పెట్టి "చూడరా ..మనది కూడా కొత్త పాలిల్లే "అనేది .
నాన్న దానిని వీది అరుగు మీద పురుకోస తో వెళ్లాడ కట్టి మామిడాకులు గుచ్చేవారు .నేను కాసేపటికి కోపం తగ్గి నాన్న తీసుకొచ్చిన కర్రల సంచి విప్పదీసి చూసేవాడ్ని ...నేను చెప్పిన వాటిలో సగమే తెచ్చేవారు అయన .మళ్లీ యుద్ధం ప్రకటించేవాడిని .ప్రతి సంవత్సరం ఇదే తంతు !
మా పాలవెల్లి లో కొంచెం ఖరీదైన ఆపిల్స్ .దానిమ్మ కాయలు ఉండేవి కావు .పాలవెల్లి కి నాన్న తెచ్చిన పండ్లు కాయలు .పూలు కట్టేసాక దానిని అత్తారబత్తం గా తీసుకుపోయి దేవుడు గదిలో వెళ్లాడ కట్టి "వినాయకుణ్ణి "పెట్టి పూజ చేసేవారు .
నా పుస్తకాలు తెచ్చి పసుపుతో ఓం అని రాసి దేవుడి కి దణ్ణం పెట్టుకోమనేవారు .నేను అస్సలు దణ్ణం పెట్టుకునేవాన్ని కాదు.
అందుకేనేమో సరిగా నాకు చదువు అబ్బలేదు .సాయంత్రం అవగానే నేను వద్దని మొత్తుకుంటున్నా దేవుడు దగ్గరి అక్షింతలు నా తల మీద వేసేది అమ్మ -కొడుకు చంద్రున్ని చూసి నీలాపనిందలు తెచ్చుకోకుండా!అమ్మకి నేనంటే ఎంత ప్రేమో!

ఇదంతా ఒక ఎత్తు అయితే ..తొమ్మిది రోజులు అయ్యాక ఇంకో గొడవ !నాన్న తెచ్చిన వినాయకుడు బొమ్మని పత్రి తో పాటు కాలువలో కలిపేస్తుంటే...ఏడ్చి నానా యాగీ చేసేవాడిని .ముద్దుగా బొద్దుగా ఉండే వినాయకుడి ని ..వదులుకోవడానికి నా మనసు అస్సలు ఒప్పుకొనేది కాదు . అప్పుడు అంతే..ఇప్పుడు కూడా ఇంతే !
ఇప్పుడు ఈ భాగ్య నగరం లో పెద్ద పెద్ద వినాయక విగ్రహాల్ని హుస్సేన్ సాగర్ మురికి నీటి లో కలిపేస్తుంటే మనసుకి ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది .
అప్పుడు ఎంత ఏడ్చి మొత్తుకుంటూ పండగ చేసినా కలిగిన అనందం ..ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాల మద్య ..పెద్ద హడావిడి ల మద్య పండగ చేసుకుంటున్నా కలగడం లేదు .కాలం మారిపోయింది .ఇప్పుడు పండుగలు పండగ లా ఉండటం లేదు.

*మిత్రులందరికీ "వినాయక చవితి "శుభాకాంక్షలు .

26, ఆగస్టు 2010, గురువారం

అక్షరం



అక్షరం !

నాకు అక్షరం తో అనుబంధం ఎప్పుడు మొదలైందో తెలీదు..
మా అమ్మ ఒడి లో ఊగుతూ జోగుతూ ఓనమాలు దిద్దినపుడనుకుంటా!
ఉహ తెలియని వయసులో ...
పాపం !అక్షరాన్ని నేను పట్టించుకోకపోయినా ,తను నన్ను పట్టించుకుంది -అమ్మలా !

అప్పుడు -నా చిన్నప్పుడు అల్లరి గా ,ఒంకర టింకరగా ..తనని నేను కెలికి అలికేసినపుడు ..
తను ఫీలవలేదు..అమ్మ తో నా బుగ్గ మీద మురిపం గా 'ముద్దు 'మార్కు లేయించింది .
బళ్ళో మేస్టారు బెత్తం తో నన్ను బెదిరించినపుడు ..అంతా 'తన 'వల్లే అని అలిగి ఓ మూలకి విసిరేసినపుడైనా తన కి కోపం రాలేదు ...అడిగితే మళ్లీ ఆప్యాయం గా తన అక్కున చేర్చుకుంది .

అంతేనా ?!

తనని చిత్తు కాగితాల మీద చిందర వందరగా జల్లేసి ..నా పని అయిపోయాక ఉండ చుట్టి 'డస్ట్టు బిన్ను' లోకి నొక్కేసినా ..కిక్కురు మనలేదు!
నా అర్ధ సంవత్సర పరీక్షల్లోనూ..ఆఖరి 'గండం' లోనూ నా" అక్షరం " పస్టు క్లాసులో పాసై పోయేది ..తన కోసం కాదు- నా కోసం !!
అయినా నాన్న కి నేను చెప్పేవాడిని కాదు ..అతని కళ్ళల్లో మెరుపు కి ఆ అక్షరమే కారణమని !
నేనెంత స్వార్ధపరున్ని?!

అన్నాళ్ళు అక్షరం తో సహా జీవనం చేసిన నేను ,సహవాసం చెయ్యాలనిపించింది మాత్రం..
మా తెలుగు మాస్టారు గొంతులో పరవశం తో తను పధ్యమై ..గధ్యమై కురిసినపుడే కదా !

ఓ చల్లని సాయంత్రం ...
నా మనసులో ని మాట బయటపెట్టాను - తను చిన్ని 'కవిత' యై నవ్వింది .
అరె ! అక్షరం లో అంతటి అందం నేనెప్పుడు చూడనేలేదు .

అప్పుడు -నా చిన్నప్పుడు నా ప్రియ మిత్రుడు నన్ను విడిచి అనంత తీరాలకి వెళ్లిపోయినపుడు..
ఆనాడు నా డైరీ లో కన్నీటి వరదై కురిసి "కన్నీటి జ్ఞాపకమై " నిలిచి పోయింది కూడా ఈ అక్షరమే !!.
నేనెప్పుడు అక్షరం లో ఇంతటి 'ఆర్ధ్రత' ఉంటుందనుకోలేదు !!

అక్షరం కేవలం అక్షరమే కాదు ..అనంత మానవ కోటి బరువు భాద్యతలని భుజానికెత్తుకున్న ఐరావతం !
అయిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నా...'నీ తో నేను ఉన్నానంటూ' ఆలింగనం చేసుకునే 'ఆత్మీయ బంధం '.
చివరికి ..నేను విరచించిన ఈ అక్షరమే ..నన్ను నేను త్యజించి అదృశ్యమైపోతున్నపుడు కూడా ..
నా ఆత్మని తనలో బందించి జన హృదయాలలో కథ యై ,కవితై 'నన్ను 'నిత్యం బ్రతికిస్తూనే ఉంటుంది .


రూపు మారినా భావం మారని ఈ అక్షరం కేవలం అక్షరమే కాదు ..అనంతం !
అంతే లేని మానవకోటి అనంత భావాలకి 'ప్రతి రూపం '.

21, ఆగస్టు 2010, శనివారం

మా మంచి చందమామ !



నిన్న మా ఆఫీసు లో కొంచెం పని ఉండి,బాగా లేటయిపోయింది.రాత్రి ఒంటి గంట దాటేసింది .
ఆ టైం లో నా రూమ్ కి వెళ్దామంటే..నా చేతి లో బండి(బైకు) లేదు.
"ఈ రాత్రి కి ఇక్కడే పడుకుని..తెల్లార గట్టే లేచి వెళ్ళిపొండి "అని చిన్న సలహా ఇచ్చాడు మా వాచ్ మెన్ .
నాకు ప్లేసు మారితే అంత తొందరగా నిద్ర పట్టదు.
మెల్లగా మెయిన్ రోడ్డు మీదకి వచ్చాను ..మా ఆఫీసు ఉండేది మూసాపేట లో ..నేను వెళ్ళాల్సింది హౌషింగ్ బోర్డు కాలనీ లోని తొమ్మిదో ఫేజ్ .
ఎంత రాత్రైనా కూకట్ పల్లి జే.ఎన్.టి.యు వరకూ ఎలాగో వెళ్లిపోవచ్చు గానీ,అక్కణ్ణించి నేను ఉండే తొమ్మిదో ఫేజ్ కి వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే..,
సెకండు షో సినిమా వదిలేవరకు ఆటో లు ఉంటాయి గానీ ,ఆ తరువాతే... ఆటో లు ఉన్నా వాటికీ రెక్కలు వచ్చేస్తాయి .
ఆ రెక్కల గుర్రాలలో వెళ్ళే ఆర్ధిక స్తోమత అందరికి ఉండదు కదా !
నా లాంటి గుమస్తా గిరి చేసే వాళ్ళకి మరీ కష్టం !
అయినా సరే రూమ్ కి వెళ్ళిపోవాలని గట్టి నిర్ణయం తీసేసుకున్నాను .(నేనెప్పుడు గట్టి నిర్ణయాలే తీసుకుంటాను .కానీ అవి టైం ని బట్టి మెత్తబడి పోతాయి .)

ఎలాగైతేనేం .. ఆ హైవే రోడ్డు మీద ఒక అరగంట పాటు నిలబడి ఎదురు చూస్తే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వస్తున్న సెవెన్ షీటర్ ఆటో ఒకటి దైవం లా వచ్చి ఆగితే దర్జాగా ఎక్కేసి జె.ఎన్.టి.యు దగ్గర దిగిపోయాను .
పోనిలే... చాలా దూరం వచ్చేసాను అనుకుని ,మా రూమ్ వైపు వెళ్ళే హై -టెక్ సిటీ కి వెళ్ళే రోడ్డు లో నిలబడ్డాను .
రోడ్డు కి ఒక పక్కగా ఆటో లు పెట్టుకుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు ముగ్గురు ఆటో వాళ్ళు "వాడే వస్తాడ్లే"అన్నట్టు నా వైపు కాస్తంత గీర గా చూసే సరికి నాకు వళ్ళు మండిపోయింది .
వీళ్ళే కదా పగలంతా "ఎక్కడికి పోవాలి సార్ "అంటూ మన వెనకాలే పడి తెగ గౌరవించేస్తారు!?
సర్లే ,పోనివ్వమని నాలో అహాన్ని చంపుకుని 'నైంత్ ఫేజ్ కి వస్తారండి "అన్నాను .
"ఎనబై అవుద్ది "నిర్లక్ష్యం గా ఒక చూపు విసిరాడు ఒక అటో వాడు .పగలైతే అయిదు ,రాత్రైతే ఎనబయ్యా ?!
ఇంక వాళ్ళని బ్రతిమాలదలుచుకోలేదు .
."ధైర్యే సాహసే లక్ష్మి "అని మనసు లో అనుకుని ,గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చివదిలి మెల్లగా 'పాదయాత్ర' మొదలు పెట్టాను .

వర్షం లో తడిసిన రోడ్డు ,విద్యుద్దీపాల వెలుగులో నల్ల త్రాచు లా మెరుస్తూ మెలికలు తిరిగి సాగిపోతుంది .నేను అడుగులో అడుగు వేసుకుంటూ ..జాగ్రత్త గా నా గమ్యం వైపు వెళ్తుంటే.. .రైతు బజారు దాటాక ఓ గల్లీ లోంచి నల్ల కుక్క బుల్లెట్ లా దూసుకొచ్చింది .
నేను ఏమాత్రం తొట్రుపాటు పడకుండా అక్కడే కట్టెలా నిలబడిపోయాను .ఇవన్నీఇంతక ముందు మనకి అలవాటే అవడం మూలానా .. కొంచెం ధైర్యం గానే నిలబడ్డాను .కాసేపు మొరిగి దాని దారిన అది వెళ్ళిపోయింది .

ఇక్కడో చిన్న చిట్కా చెబుతాను . కుక్కలు మన వెంట పడినప్పుడు పరుగులు పెట్టకూడదు ,అలాగని తిరగబడ కూడదు .కాసేపు అలాగే నిలబడి దాని కళ్ళల్లో కి తీక్షణం గా చూస్తే చాలు !కొంచెం దూరం మన వెనకాలే మొరుగుతూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది .అదే పిచ్చి కుక్క అయితే మాత్రం ..నేను చెప్పినట్టు చేస్తే మన జీవితం కుక్కలు చింపిన విస్తరి అయిపోతుంది .
నా చిట్కా ఉపయోగించుకున్న వాళ్ళకి అలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే మాత్రం దానికి నేను మాత్రం భాద్యుడిని కాదని ముందే విన్నవించుకుంటున్నాను .

అదిసరే గానీ..ఇక అసలు సంగతి కి వస్తాను. నేను ఎలాగోలా ... ఆ కుక్క బారినుండి తప్పించుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ .మలేషియా టౌన్ షిప్ సర్కిల్ లో కి వచ్చి "హమ్మయ్య "అని ఊపిరి పీల్చుకున్నాను .
అంతే!టక్కుమని కరెంటు పోయింది .ఒక్కసారే ..నా గుండె జారిపోయింది . "ఇదేమి పరీక్ష భగవంతుడా !"అనుకొని కాసేపు ఆ సర్కిల్లోనే నిలబడిపోయాను .
దూరం గా కుక్కల అరుపులు తప్ప ఇంకేమి అలికిడి లేదు.ఆ సర్కిల్ నుండి వెడమ వైపు కి తిరిగి కొంచెం దూరం వెళ్తే మా రూమ్ వస్తుంది.
కానీ రోడ్డుకి ఇరు పక్కలా ఉన్న చెట్లు ,ఆ చీకట్లో జడలు విరబోసుకున్న రాక్షసుల్లా కనిపించేసరికి నా అడుగు ముందుకి పడలేదు.
ఇంతలో మొన్న ఏదో పేపర్లో నేను చదివిన "వంద రూపాయల కోసం హత్య "వార్త గుర్తుకొచ్చి చెమటలు పట్టేసాయి .
ఈ చీకట్లో ఎవరైనా ఎటాక్ చేస్తే ?!.
అప్పుడే నాకు అరుంధతి సినిమా లో అఘోర గుర్తుకొచ్చాడు .వెదవ మనసు ఊరికే ఉండదు కదా !రకరకాల ఆలోచనలు !!
అక్కడ నిలబడలేను ..ముందుకి కదలలేను!!

ఇంతలో ఆ చెట్ల మధ్యలోంచి సన్నని వెలుగు రేఖలు నేల మీద పరుచుకున్నాయి .నేను ఆకాశం వైపు చూసాను .
వెన్నముద్ద లాంటి చందమామ మబ్బు చాటునుండి వస్తూ నవ్వుతూ పలకరించాడు.నాకెందుకో కొంచెం దైర్యం అనిపించింది .
క్రమ క్రమం గా ఆ చుట్టూ పరిసరాలు వెన్నెల వెలుగు తో నిండిపోయాయి .నేను ఇంటికి వెళ్ళే వరకూ మబ్బు చాటుకి వెళ్లోద్దని చందమామని బ్రతిమాలుకుని దైర్యం గా అడుగు ముందుకి వేసాను .
ఆయన్ని చూస్తూనే అడుగులు వేస్తుంటే నాకు అసలు బయమే అనిపించలేదు .తను (చందమామ )నా పక్కనే ఉన్నాడన్న భావన నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది .ఇంత మంచి స్నేహితుడ్ని ఇంత కాలం నేను ఎందుకు మిస్సైపోయాను ?!.నేను రూం కి వెళ్ళిపోయాక ,ఆయనకి థాంక్స్ చెబుదామని ఆకాశం లో కి చూస్తే అయన నవ్వుతూ మబ్బు చాటుకి వెళ్ళిపోతున్నాడు .
నాకు ,మా మరదలు పిల్ల నాతో ఎప్పుడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి "నా మనసు బాలేనపుడు చందమామ తో కబుర్లు చెప్పుకుంటాను "అని .నిజమే ..!అయన తో ఉంటే మనసుకి చాలా హాయిగా ,ధైర్యం గా ఉంటుంది .

రేపు ఆయనకి మేఘ సందేశం పంపాలి ...నా జీవితాంతం నా స్నేహితుడి గా ఉండిపొమ్మని !!

18, ఆగస్టు 2010, బుధవారం

పసి(డి )మొగ్గ !(నేను గీచిన మౌస్ పెయింటింగ్స్ ! )



ఇంకా వీడిపోని బాల్యం !
అయినా తొంగి చూస్తోంది .. యవ్వనం !!

ఆ మది లో తొలకరి జల్లుల పులకింత !
అదే యవ్వన పరువపు పిలుపంట!!

14, ఆగస్టు 2010, శనివారం

"మా అన్నపూర్ణమ్మ అంగడి "



సందె వేళ
ఆమె :"వేడి వేడి ఇడ్లీలు నాలుగు తినండి శీను గారూ..ప్రాణం కుంచెం కుదుట పడుద్ది "
నేను :"అయ్యో !వద్దండి .నెలాఖరు రోజులు ..మొన్న తిన్న దోసె డబ్బులే ఇంకా ఇవ్వలేదు. .మళ్లీ అరువా?!"
ఆమె :"భలేవారండి .నేనేమైనా మిమ్మల్ని డబ్బులివ్వమని పీకి పాకం పెట్టేతున్నానా!మీ దగ్గర ఉన్నపుడే ఇయ్యండి"
తెల్లని మల్లెపువ్వు లాంటి వేడి వేడి ఇడ్లీ ల ని ప్లేటు లో పెట్టి ,చల్లని నవ్వొకటి నవ్వి అప్యాయం గా 'టిఫిన్ ' పెట్టేదావిడ !
నేను ఆ నాలుగు ఇడ్లీ లు గుటుక్కున మింగేసి .. మొహమాటం గా చెయ్యి కడుక్కోబోతా ఉంటే ..
అమ్మ లా నా ఆకలి కనిపెట్టి ఇంకో రెండు ఇడ్లీ లు పెట్టి నా కడుపు ఆకలి తీర్చేదావిడ.
వెధవ ఆకలి ..పీక పిసికి నిర్ధాక్షిణ్యం గా చంపేస్తే ..చచ్చి ఊరుకుంటుంది గానీ..పోనేలే కదా అని ,కొంచెం నీరు పోశామా ..ఆవురావురమంటూ ..మనల్నే నిలువెల్లా దహించి వేస్తుంది .


నేను పనిచేసే ఆఫీసు పక్కనే చెట్టు కింద పెట్టుకున్న నాలుగు చక్రాల బండే ఆమె "టిఫిన్ సెంటరు ".
పేరు కి టిఫిను సెంటరే గానీ..మా వీధి లో నా లా చిన్నా చితకా ఉద్యోగా లు,పనులు చేసుకుని బ్రతికే చాలా మందికీ ..నెలాఖరు రోజుల్లోనో .. జేబుల్లో డబ్బులు లేనప్పుడో ఆకలి కడుపుల్ని నింపే "అన్నపూర్ణమ్మ అంగడి "!
( డబ్బులు ఎప్పుడు ఇచ్చినా గానీ ..విసుక్కోకుండా ఆకలి వేసినపుడు ఆప్యాయం గా కడుపునింపే అన్నపూర్ణ ..ఆ బండి యజమాని !అందుకే ఆ బండి ని అన్నపూర్ణమ్మ అంగడి అన్నాను.)
ఇలాంటి అన్నపూర్ణ మా అమలాపురం ఊళ్ళో నో ..పక్కన పల్లెల్లోనో కనిపిస్తే ఇంత వింత గా ,విశేషం గా చెప్పే వాడ్ని కాదు గానీ...
అసలు ఊరేంటో.. .యిప్పుడుంటున్న ఇల్లు యాడ నో ..అసలు ఎన్నాళ్ళు ఉంటారో , ఎప్పుడు పోతారో ..తెలియని ఈ -అ'భాగ్య నగరం' లో అడగకున్నా అరువులు పెట్టి కడుపునింపే "అమ్మ "లు అరుదే గా !
ఆమె పెట్టె అరువు కోట్ల రూపాయులు కాకపోవచ్చు ..
పొట్ట కూటి కోసం ఈ భాగ్య నగరాని కి వలస వచ్చిన ఈ భాగ్య జీవి(మంచి మనసులో ఆవిడ భాగ్యవంతురాలే )వేరే వాళ్ళ పొట్ట నింపడం సహసమేగా !!

ఆ అమ్మ పేరు "దుర్గ ".ముప్పయి కి ముప్పై ఐదుకి మద్య వయసు .
వెదురు కర్రని చక్కగా వంచి బొమ్మః గా మలిచి చీర కట్టి ప్రాణం పోసినట్టు సన్న గా ..ధ్రుడం గా ఉండేదావిడ.
ఆ పల్చటి మొహం మీద ఎప్పుడూ చెరిగిపోని చిరునవ్వు !
ఆమె మాట ...గాంభీర్యం తో పాటు ఆప్యాయత ని కలగలిపి పలికేది.
ఆమె కి పెళ్ళైన కొన్ని రోజుల కే భర్త చనిపోవడం తో ... పుట్టింటి కి వచ్చేసి ముసలి తల్లి దండ్రుల సంసార భాద్యతలన్నీ తన మీద వేసుకుంది .మగ పిల్లలే ఇంటి భాద్యతల నుండి తప్పించుకుతిరుగుతున్న ఈ రోజుల్లో ..ఇలాంటి ఆడపిల్ల ఉన్నందుకు ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించేది .

నేను మా ఆఫీసు లో జాయిన్ అయిన కొత్తల్లో ..ఆమె మంచితనాన్ని చూసి ..లౌక్యం అనుకునేవాణ్ణి.
అదే వ్యాపార తత్త్వం కాబోలు అనుకునేవాణ్ణి!తరువాత తెలిసింది ..నా ఉహ తప్పు అని !
ఆవిడ దగ్గర అరువులు పెట్టి కడుపునిండా మేక్కేసిన కొంతమంది కలియుగ భకాసురులు.చెప్పా పెట్టకుండా దుకాణం సర్దేస్తే ..
వాళ్లకి ఏనాడో ఋణం కాబోలు అని సరిపెట్టుకునేదే తప్ప పోయిన వాళ్ళని ఒక పల్లెత్తు మాట అనేది కాదు !
అరువులు పెట్టడం మానేది కాదు !!
"అదేంటండి ..దుర్గ గారు !అడిగిన వాళ్ళందరికీ అలా అరువులు పెట్టేసి మీరు ఇబ్బందులు పడటం దేనికి ?!మొహమాటం లేకుండా ..అరువులు పెట్టనని చెప్పేయండి "అనేవాణ్ణి అపుడప్పుడు !
"పోనీలెండి ..ఒకరి కడుపు ఆకలి తీర్చే భాగ్యం అందరికి రాదు ...డబ్బులిస్తే సరే సరి ...లేదంటే ఒకరి ఆకలి బాధని తీర్చిన తృప్తి అయినా మిగులుతుంది .
ఆ పుణ్యమేదో ..వచ్చే జన్మ లో కాపాడుతుంది "నవ్వతా అనేదావిడ !
ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా ?!అనిపించేది నాకు .
పోనీ ..బాగా సంపాదించిందేమో లే ..అనుకుందామన్నా,పాపం ! అరువులు ఎగ్గొట్టేసి పోగా మిగిలిని కాస్త డబ్బులు ..వాళ్ళ అమ్మ నాన్న ల మందుల కి ,నిరుద్యోగ తమ్ముడు ఖర్చు ల కి ,ఆ పేద సంసారాన్ని నెట్టుకు రావడానికి సరిపోయేవి .
పండగ పూట అయినా తనకి ఒక మంచి చీర కొనుక్కునేది కాదు .ఆ డబ్బులు ఉంటే వేరే ఖర్చు పోతుంది కదా అనేది .


ఇదంతా ..ఆవిడ గురుంచి ఎందుకు చెప్తున్నానంటే .....
మొన్న పోయిన నెల లో కొంచెం ఒంట్లో నలత గా ఉందని వాళ్ళ సొంతూరు విజయ వాడ వెళ్ళింది .
ఆమె తో పాటే..వాళ్ళమ్మ ,నాన్న కూడా వెళ్లారు .అన్నాళ్ళు ఆమె చేతి వంట కి అలవాటు పడిన మా ప్రాణాలు ..ఆకలి తో విలవిల్లాడేవి.
ఆవిడ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం !

ఒక రోజు ఊరునుండి వాళ్ళ తమ్ముడు వచ్చాడు ."అక్క ని హాస్పిటల్లో పెట్టారు ..బ్రతకడం కష్టం !అంటున్నారు డాక్టర్లు "అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు .
నాకు ఒక క్షణ కాలం ఏమి అర్ధం కాలేదు.
"బ్రతకడం కష్టం ఏమిటి ?!ఆవిడ బాగానే ఉండేది కదా !"అయోమయం గా అడిగాను .
"లేదు...చాలా రోజులు గా తన కడుపులో ఉన్న బాధ ఎవరికీ చెప్పుకోలేదు ..జబ్బు బాగా ముదిరి పోయిందంట!
ఎప్పుడు మా గురుంచే ఆలోచించేది ..తన గురుంచి అస్సలు పట్టించుకోలేదు "దుఃఖం తో అతని గొంతు బొంగురు పోయింది .

ఒక రోజు సాయంత్రం ..ఆమె కు సీరియస్ గా ఉందని చెప్పి ఫోను వస్తే ఆ ఆబ్బాయి (అతని పేరు కూడా శ్రీనే )హడావిడి గా వాళ్ళ ఊరు వెళ్ళాడు .మళ్లీ రాలేదు .
మా వీధి లో నే ఉండే వాళ్ళ దూరపు బంధువులు ఒకాయన ఆవిడ చనిపోయిందని చెప్పాడు .
నాకు కన్నీళ్ళు రాలేదు ..ఎందుకో అర్ధం కాదు !ఆవిడ గొప్పతనాన్ని కన్నీటి తో వెలకట్టలేక అనుకుంటా..!!

వాళ్ళ తమ్ముడు చెప్పినట్టు ..ఆవిడ తన కోసం ఆలోచించుకోలేదు ..తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించి నట్టుగా తన గురుంచి తానే పట్టించుకోలేదు .మా కడుపు ఆకలి ని పసిగట్టిన ఆవిడ తన కడుపు బాధని,మనసులో ని వ్యధ ని మాత్రం ఎవరికీ చెప్పుకోలేదు .
ఇప్పుడు మా ఆఫీసు పక్కన చెట్టు కింద ఎవరో కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు .
మా లాంటి వాళ్ళ ఆకలి కేకలు ..వాళ్ళ చెవి కి వినిపిస్తాయి గానీ...వాళ్ళ మనసు కంటి కి మాత్రం ఆనవు .
"అరువు లేదు" .."అయ్యో పాపం !"అసలే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తారు .
నాకు ఆకలి వేసినప్పుడల్లా "దుర్గమ్మ "గుర్తుకొస్తుంది .కాల గర్భం లో కలిసిపోయిన "అన్నపూర్ణమ్మ అంగడి "గుర్తుకొస్తుంది !!
ఆత్మ బంధువుల ని అంత తొందరగా మరచిపోలేము కదా !

ఆవిడ కి మేము చాలా ఋణ పడిపోయాము - ఆమె మా కడుపు ఆకలి తీర్చినందుకు కాదు ..
తన మంచి మనసు తో మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసినందుకు !

7, ఆగస్టు 2010, శనివారం

అగమ్యం(నేను గీచిన మౌస్ పెయింటింగ్స్ ! )



గాలి వాన లో ..వాన నీటిలో పడవ ప్రయాణం !
తీరమెక్కడో ..గమ్యమేమిటో తెలియదు పాపం !! (క్షమించాలి ..ఇక్కడ గాలి ,వాన లేదు )

6, ఆగస్టు 2010, శుక్రవారం

ఉత్తరం -3



ప్రియమిత్రుడు సూరి బాబు కి ..!

ఏంట్రా సూరి ..ఇన్నాళ్ళు ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయలేదని కోపం గా ఉందా నీకు ?!
ఏమి చేయమంటావురా..ముందే చెప్పాను కదా .పోస్టు డబ్బా లు మన ఊళ్ళో లా పక్కనే ఉండవని !
అందులోనూ నేను గంగ పర్రు సుబ్బరాజు గారి కంపెనీ లో జాయిన్ అయిన దగ్గర నుండి నాకు రాత్రేదో పగలేదో. .తెలియకుండా అయిపోయిందిరా !
ఇక్కడ కూడా మన ఊళ్ళో లానే ప్రతి రొజూ మామూలు గానే తెల్లగా తెల్లారుతుంది .
కానీ నా మనసు కి మాత్రం ఎప్పుడూ ఏదో మబ్బు కమ్ముకునట్టు ముసురు పట్టేసినట్టు ఏదో తెలియని అంధకారం చుట్టు ముట్టేసినట్టు ఉంటుంది .
ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఏదో తెలియని వెలితి గా అనిపిస్తుంటుంది .
కారణం ఏంట్రా అని ఆలోచిస్తే ...చానా ఏళ్ళు గా ఏదో ఒక కారణం తో (ఎక్కువ గా బద్ధకం తో నూ..కొంచెం తక్కువ గా పరిస్థితులు అనుకూలించక పోవడం వల్లనూ )నేను చేయకుండా పక్కన పెట్టేసిన పనులన్నీ ,ఇప్పుడు.. ఇన్నాళ్ళ తరువాత (28 సం) నా నెత్తి మీద కి ఎక్కి నాట్యం చెయ్యబట్టే నాయీ శిరో భారానికి కారణమేమోనని చూచాయగా అనిపించింది .

ఇప్పుడు అనుకునేం లాభం ?!
ఏ టైము లో చెయ్యాల్సిన పనులన్నీ ఆ టైము లో నే చేసుంటే ,నేనీరోజు నీతో ఇలా నా గోడు వేల్లబోసుకునే పనేముంది చెప్పు ?!

ఇలాంటి బాధ నేను మన ఊళ్ళో ఉన్నపుడు లేదురా ..ఎందుకంటే అక్కడే నేనే మారాజు ని అనుకునేవాణ్ణి!
ఈ మహా నగరం లో అడుగు పెట్టాక జైన విగ్రహల్లాంటి (నేను అనేది ఎత్తు లో కాదు ...హొదా లో )ఈ జనాల మద్య నేను మరుగుజ్జులా అయిపోయిన పీలింగ్ మనసుని మెలిపెట్టేస్తుంటే ...ఇన్నాళ్ళు నన్ను నేనే మోసం చేసుకుని బ్రతికానా అని తెగ బాదైపోయింది.

ఒరేయ్ సూరి !నీవు ఏమీ అనుకోనంటే ..నేను చెప్పే సోదంతా కొంచెం ఓపిక పట్టి వింటానంటే ..రెండు ముక్కల్లో చెబుతా !
నీవు ఊ కొట్టక పోయినా పరవాలేదు ..నేను చెప్పింది వింటే అదే పది వేలు !

ఇక అసలు సంగతికి వస్తే...
నేను పొద్దున్నే భారం గా లేస్తానా ..అప్పటికే మా ఎదిరింట్లో నైసుగా ఉండే కుర్రాడొకడు ..నీటు గా గెడ్డం చేసుకుని , నున్నగా తల దువ్వుకుని ,ఇస్త్రీ నలగని బట్టల్ని చక్కగా "ఇన్ -షర్ట్ "చేసుకుని ..దొరబాబు లా హుందాగా బైకు ఎక్కి దర్జా గా ఆఫీసు కి వెళ్తుంటే ..అప్పుడు మొదలవుతుంది..నా ఏడుపు !
అతను ఏదో కంప్యూటరు కంపెనీలో పని చేస్తున్నాడంట.
అలా మొదలైన నా ఏడుపు ..కంపెనీ కి వెళ్తున్నపుడు దారిమధ్యలో తగిలే కూల్ డ్రింకు షాపుల దగ్గర ,టిఫిన్ సెంటర్లు దగ్గర అమ్మాయి తో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పళ్ళు యికిలించే కాలేజి కుర్రాళ్ళ ని చూస్తే ...(క్షమించాలి !అందర్నీ కాదు ..కొందరినే )నా ఏడుపు వరదగోదారై ఉప్పొంగుతుంది.
మన ఊళ్ళో ఆడపిల్ల వంక కన్నెత్తి చూస్తేనే ..మహా పాపం కదా !
ఇక్కడ అలాంటివేమి ఉండవు! ఎంచక్కా అమ్మాయి లు అబ్బాయి లు చెట్టపట్టాలు వేసుకుని హుషారుగా షికార్లు చేస్తుంటారు !

అంతేనా ?!...
మా ఆఫీసు లో మేనేజరు గారు (డు)చక చక మని ఇంగ్లీషు లో మాట్లాడేస్తున్నపుడు.....
దేవ కన్య లాంటి అమ్మాయి వచ్చి ..ఇంగ్లీష్ లో అడిగిన అడ్రస్స్ కి నేను టక్కున సమాధానం చెప్పలేక తెల్ల మొహం వేసినప్పుడు ..
నేను నా డొక్కు సైకుల్ని ఈడ్చుంటూ వెళ్తుంటే . ...నా పక్కనే రయ్యిమంటూ దూసుకెళ్ళే కార్లు ,నా మీద వర్షపు నీళ్ళని చిమ్మి నిర్లక్ష్యం గా వెల్లిపోతున్నపుడు...నా గుండెల్లో నుండి తన్నుకొచ్చే ఏడుపుని గొంతుకలోనే నొక్కేసి, నేను పడే బాధని ఎలా చెప్పగలను ?!
నేను కూడా చదువుకోక బట్టే కదా ...ఇలాంటి సరదాలన్నీ మిస్సై పోయి ,ఇన్ని అవమానాల్ని భరించాల్సి వస్తుంది .
ఆ రోజు మా నాన్న చదువుకోమన్నపుడు ,నా మనసుకెక్కలేదు ..
నేను చదువుకుందామనుకున్నపుడు బ్రతుకు బాగోలేదు .
అందుకే పెద్దలు అంటారు -"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని !".

ఆ మాత్రం దానికే అంతలా ఏడవాలా అంటావా?!నీకేం బాబూ..ఊళ్ళో కూచుని ఏమైనా చెబుతావు .
ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది నా బాధ !
ఒక పండగ సంతోషం ఉండదు ..ఒక తద్దినం హడావిడి ఉండదు !
కనీసం ఆదివారమైన ఒక పూట సెలవు ఉండదు .
సెలవు రోజుల్లో ..మా రూము లో కుర్రాలంతా కాళ్ళు బార జాపుకుని కబుర్లు చెప్పుకుంటున్నపుడు...సాయంత్రం పూట "పస్టు షో" సినిమాకి వెళ్తున్నపుడో ..నా గుండె అగ్ని గుండం అయిపోతుంది .
పండగలప్పుడు పిండి వంటలు ఎలాగూ లేవు..కనీసం కమ్మటి పప్పున్నం అయినా తిందామంటే ..నేను తినే హోటలు మీల్సు లో ఉప్పే సరిగా ఉండదు ..ఇంక కమ్మటి పప్పు కూర ఎక్కడిది ?!

ఏంట్రా సూరి !నీకు నవ్వు వస్తుందా ?నా బాధలన్ని నీకు నవ్వులాట గా ఉందా ?
అవునులేరా ..గట్టు మీద వున్నోడికి గోతిలో పడ్డ నా లాంటివోడి బ్రతుకు నవ్వులాటగానే ఉంటది !
గంగ రాజు గారు మన ఊరి మనిషే కదా అని ..కష్టకాలం లో కాస్తయిన ఆదుకోకబోతాడా..అని తక్కువ జీతమైనా చటుక్కున ఈ గుమస్తా ఉద్యోగం లో జేరిపోయాను కానీ ...ఆయనే నన్ను కష్టాల కడలి లో తోచేస్తాడని,నా మొహమాటాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన చాకిరీ చేయించుకుంటాడని నేను ఊహించలేదు .

ఏంటోరా...తాడు బొంగరం లేకుండా అయిపోయింది జీవితం !
పోనీ చదువు సంగతి పక్కన పెట్టు ..కనీసం నాకు ఇష్టమైన కథలు ,కవిత లు మీదైనా గట్టిగా ద్రుష్టి పెట్టినా ..మరీ యండమూరో ..చంద్ర బోసో కాకపోయినా ..ఏ వార పత్రికల్లోనో,మాస పత్రికల్లోనో .. కథలో కాకర కాయలో రాసుకుని ..పేపర్లో నా పేరు చూసుకుని ,భుక్తి కి సంపాదించు కాకపోయినా ముక్తినైనా పొందేవాడిని .

సరేరా ..మావా!ఇవన్నీ అనుకుని ఏం లాభం -భకాసురుడు,కుంభ కర్ణుడు నా అన్నా తమ్ములైనప్పుడు !!
నా సోది అంతా చెప్పి నిన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నానా?
ఏదో సరదాకి చెప్పేను కానీ ,అసలైన కష్టాలంటే ఇవి కావురా ..!
చదువుకోకపోవడం వల్లా ..అసలు బ్రతుకంటే ఏమిటో తెలియకుండా బ్రతికేస్తే ..ఎలాంటి కష్టాల్ని ,నష్టాల్ని భరించాల్సి వస్తుందో ..అనుభవించిన నాకు తెలుసు !నన్ను పుట్టించిన ఆ దేవుడి కి తెలుసు !!
ఇదైనా నీకు ఎందుకు చెబున్నానంటే ...మన ఊళ్ళో ,మన తరవాత కుర్రాల్లైన చదువుకోకుండా ..నాలా ముందు చూపు లేకుండా అడ్డ దిడ్డం గా బ్రతికేస్తుంటే ..వాళ్ళ కి నా గురుంచి చెప్పైనా వాళ్ళకి నాలుగు చివాట్లు పెడతావని నాకు చిన్న ఆశ !
తరవాత వాళ్లైనా నాలా కాకుండా ఉంటారని ,ఉండాలని నా ఆరాటం !
సరేరా సూరి ..ఇంత సేపూ నేను చెప్పిన నా సోదంతా విసుగు లేకుండా చదివినందుకు చాలా సంతోషం !
వీలుంటే వారం లోగా మళ్లీ ఉత్తరం రాస్తాను ..నీవు వద్దన్నా ,కాదన్నా రాస్తాను !
నేను ఏమైనా తప్పులు రాస్తే మనసులో ఏమీ పెట్టుకోకు !

ఇట్లు .నీ ప్రియ మిత్రుడు,
చెవుడు బావుల వెంకటేశ్వరరావు (ముని మాణిక్యాల రావు ).

2, ఆగస్టు 2010, సోమవారం

పసి వాడు(నేను గీచిన మౌస్ పెయింటింగ్స్ ! )

మా సబిత అక్క పుట్టినరోజు కి నేను గీచి పంపిన చిన్న గిప్ట్ ఇది.
పాపం !ఎలా ఉన్న గాని చాలా సంతోషించింది .మనం ఇష్టం తో పిచ్చి గీతలు గీచి ఇచ్చినా అది "అపురూప కానుకే" కదా !



పాల బుగ్గల పసివాడు -పసిడి కాంతుల సూరీడు!
పూల గుత్తి తో పిలిచాడు ..పలక లేదని అలక బూని మూతి ముడుచుకు కూచున్నాడు !!

23, మే 2010, ఆదివారం

వీధి సినిమా హంగామా !



అవి మా ఊరి మొత్తాని కి అరిగెల వెంకన్నాయుడు గారి లంకంత కొంపలో ,పెద్ద బి పి ఎల్' బ్లాక్ &వైట్ టివి మహా రాజు లా మహా దర్జా గా వెలిగిపోతున్న రోజులు !
ఊరి మొత్తానికి ఒకే ఒక్క టివి కదా ..ఆ మాత్రం దర్జా ఉంటుంది లెండి !
రాత్రి అయ్యేసరికి ఊళ్ళోని జనమంతా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని టివి చూసేదానికి నాయుడు గారి అరుగు మీద తిష్ట వేసేవారు . వారం లో అయిదు రోజులు జనం కాస్తంత పలచగానే ఉన్నా ..మిగిలిన రెండు రోజులు అంటే శుక్రవారం "చిత్రలహరి "అప్పుడు ,ఆదివారం "సినిమా " వచ్చినపుడు మాత్రం వాళ్ళ హాలు మొత్తం రిలీజు సినిమా ధియేటర్ లా కిక్కిరిసిపోయి ,మిగిలిన జనం అరుగు మీద వేల్లాడుతూ ,చివరాఖరు కి రోడ్డు మీద కంటా నిలబడి నేరేడు కాయల్లాంటి కళ్ళని తాటి కాయలంత చేసి ఆత్రం గా చూసేవాళ్ళు .

అలాంటి కరువు రోజుల్లో (సినిమా కరువు లెండి )ఏ దేవి నవ రాత్రుల కో ,వినాయక ఉత్సవాల కో మా ఊళ్ళో తప్పని సరిగా వేసే 'తెర సినిమాల' హంగామా గురుంచి ఇంకేం చెప్పాలి ?!

అవి మా చీముడు ముక్కుల్ని మోచేత్తో తుడుచుకుంటూ ,కృష్ణ ,చిరంజీవులని పిచ్చిగా ఆరాదిస్తూ ..
మా పెద్ద వాళ్ళేమో ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమా రోజుల్ని నెమరు వేసుకుంటూ తాపీగా కాలం వెల్ల దీస్తున్న రోజులు.
అలాంటి రోజుల్లో ..ఉత్సవాల కి నెల రోజుల ముందునుంచే చందాల వసూళ్ళ హడావిడి మొదలయ్యేది .ముఖ్యం గా తెర సినిమాల్ని దృష్టి లో పెట్టుకుని చందాల వసూళ్ళు సాగేవి . ఉత్సవాల్లో మొదటి రెండు రోజులు ,ఏ హరి కథో ,బుర్ర కథా కాలక్షేపం తో నో సాఫీ గానే గడిచిపోయేవి కానీ ,మూడో రోజు నుంచి మాత్రం అసలు గొడవ మొదలయ్యేది .

మా పెద్ద వాళ్ళేమో ,ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమాల్లో ఏదో ఒకటి అని సర్దుకుపోతే ,మా పిల్లకాయలు మాత్రం చిరంజీవి సినిమా ఒకడు ,కృష్ణ సినిమా అని ఇంకొకడు పట్టు బట్టడం తో రెండు గ్రూపులుగా విడిపోయేవాళ్ళం.
అక్కడితో పెద్దవాళ్ళ గ్రూపు తో కలిసి మూడు అయ్యేవి .ఇంక మూడు సినిమాలు తప్పనిసరి అయ్యేవి .
కానీ వసూలయిన చందా డబ్బులు మూడు సినిమాల కి సరిపోకపోవడం తో అభిమాన హీరో సినిమా కోసం ఆయా గ్రూపుల వాళ్ళు మిగిలిన డబ్బుల్ని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది .
పెద్ద వాళ్ళ సంగతి సరేసరి ,మేం పిల్లకాయలం డబ్బులు ఎక్కడ నుంచి తెస్తాం ?

ఒక అవిడియా !ఒక చిన్న రేకు డబ్బాకి చిన్న రంద్రం చేసి రెండు గ్రూపులు కాలవ గట్టు మీద కి వచ్చేవాళ్ళం .
కాలవ ఆవలి పక్కన ఒక గ్రూపు ,ఇవతల పక్కన ఒక గ్రూపు కాపు కాచి దారి లో వచ్చే ,పోయేవాల్లని ఆపి బ్రతిమాలో ,ఒక్కోసారి బలవంతం గానో "దేముడి చందాలు " వసూలు చేసేవాళ్ళం .
నేను మాత్రం చందాలు వసూలు చేసేదానికి వెళ్ళకుండా ఆ రోజంతా సినిమా ప్రచార కార్యక్రమం లో తల మునకలయ్యేవాడిని .
ఎలాగంటే ......మా గుడి లో మైకి సెట్టు లోంచి నిరంతరం గా వస్తున్న"దేవ దేవ ధవళాచల మందిర ...." పాటని మద్య మద్య లో ఆపేసి నా గొంతు ని కాస్తంత గంభీరం గా పెట్టి మైకు లో -
"భక్త మహాశయులారా !విజ్ఞప్తి -ఈ రోజు రాత్రి దేవి నవరాత్రుల సుభ సందర్భం గా మన ఊరి దుర్గమ్మ గుడి దగ్గర సూపర్ స్టార్ కృష్ణ నటించిన గొప్ప బ్రహ్మాండమైన కుటుంబ కథా చిత్రం 'పచ్చని కాపురం 'ప్రదర్శించబడుతుంది .కావున తామంతా విచ్చేసి మాయీ ప్రోగ్రాం ని జయ ప్రదం చెయ్యాలని కోరి ప్రార్దిస్తున్నాం "అంటూ పది నిముషాలకో సారి గొంతు చించుకునే వాణ్ణి .

మైకు సెట్టు లో నా గొంతు విన్న మా అమ్మ తెగ సంబర పడి పోతా ఉంటే,పండక్కి మా ఊరోచ్చిన మా అమ్మమ్మ "విజమ్మా!(మా అమ్మ పేరు విజయ లక్ష్మి ) నీ కొడకు ఎలా బ్రతుకుతాడోనని బాధ పడిపోతావు కదా ...చూడు ..ఎంత బాగా మైకు లో మాట్లాడుతున్నాడో !సినిమా బండి లాక్కోడానికైన పనికి రాడంటావా?"అని వేళాకోలమాడేది .

ఏమైతేనేం ...ఎలాగోలా సాయంత్రాని కి మా వీధి లో 'తెర సినిమా 'పడిపోయేది .సాయంత్రం అయ్యేసరికి మా పిల్లకోతులమంతా ఊళ్ళో మందార చెట్ల మీద పడేవాళ్ళం .ఎవరికి అందిన పూలని వాళ్ళు కోసుకుని వాటితో పాటే కాసిన్ని మందారాకుల్ని కోసి ,చిన్న చిన్న ముక్కల గా చేసి మా అభిమాన హీరో మీద చల్లేందుకు రెడీ గా పెట్టుకుని ఉండేవాళ్ళం .(రామ.. రామ !తప్పుగా అనుకునేరు ..నేను అన్నది తెర మీద హీరో మీద చల్లడానికి ).
రాత్రి కి మా పిల్లకాయలం అంతా తెర ముందు గోనే పట్టాలని పరుచుకుని కూచునేవాళ్ళం .
పెద్ద వాళ్ళ యితే ఏ కుర్చీ నో బల్ల మీదనో ,లేకుంటే అరుగుల మీదనో కూచుని సినిమా చూసేవారు.
ముందు వరసలో కూచున్న మేమంతా తెర మీద కి హీరో గారు వచ్చినప్పుడల్లా ..మేము రెడీ చేసి పెట్టుకున్న పువ్వుల్ని గట్టిగా అరుస్తూ తెర మీద కి విసిరేవాళ్ళం .పెద్దవాళ్ళు మందలించినా వినేవాళ్ళం కాదు .
సినిమా అయ్యేంత వరకూ కింద పడిన పువ్వుల్ని మళ్లీ ఏరుకుంటూ ,అరుచుకుంటూ ,అలసిపోతూ ఏ అర్ధరాత్రప్పుడో ఇళ్ళకు పోయి తృప్తి గా నిద్రపోయేవాళ్ళం .


**పాటల పూ తోట లో మన" వేటూరి పుష్పం " రాలిపోయింది .అయినా ఆ పరిమళం తెలుగు నేల పై నిత్యం గుబాళిస్తూనే ఉంటుంది .ఆ మహాను భావుడి కి కన్నీటి వీడ్కోలు .

15, మే 2010, శనివారం

ఒంటరి తనం



'జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది ".
ఈ పల్లవి నా మనసు లో మెదిలినప్పుడల్లా ..సీతా రామ శాస్త్రి గారు నా మనసులో భావన ని ఎలా కనిపెట్టి ఇంతలా రాయగలిగారబ్బా !అనిపిస్తుంటుంది .
నాకే కాదు ..ఈ పాట వింటున్నపుడు ,ఆంధ్ర దేశం లో తెలుగు తెలిసిన ప్రతి తెలుగు వారు ఇంచుమించుగా ఇలాగే అనుకుంటారనుకుంట.
(ఇక్కడ "ఆంధ్ర దేశం లో తెలుగు తెలిసిన వాళ్ళు " అని ఎందుకు అన్నాను అంటే ..తెలుగు ని ఒక తెగులు గా భావించి తెల్లోడి ఆంగ్ల భాష ని మాత్రమే ఒంట బట్టించుకుంటున్న తెలుగు యువతరం లో చాలా మందికి సరిగా తెలుగు రాదని నా నమ్మకం .అందులో నేను ఒకడి ని .)

సరే ,ప్రస్తుతానికి ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు సంగతి కి వస్తాను.ప్రపంచం లో ఎవరూ లేక ఒంటరి తనం తో అలమటించే అభాగ్యులు చాలా మందే ఉన్నా ...చుట్టూ బంధువు లు ,మిత్రులు ఉండి కూడా
ప్రపంచం లో ప్రతి మనిషి ,ఏదో ఒక క్షణం లో "ఒంటరి "గా ఫీలవ్వని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదేమో !
అలాంటి వాళ్ళ లో నేను ఒకడిని .బహుశా శాస్త్రి గారు కి కూడా ఇలాంటి మానసిక వేదన లో నుంచే ఈ పాట ప్రాణం పోసుకున్నదని నా నమ్మకం .
ఇలాంటి ఒంటరి తనం ,చాలామంది కి అప్పుడప్పుడు అనిపిస్తే ..కొంతమంది కి మాత్రం ఎల్లప్పుడూ తోడుగానే ఉంటుంది .దీనికి పూర్తి గా కారణం అయితే చెప్పలేం గానీ ,నాకు తెలిసి మాత్రం రోజు రోజు కి యాంత్రికమైపోతున్న మానవ జీవితా ల్లో ,బలహినమైపోతున్న మానవ బంధాలే ఈ సమస్య కి కారణం గా కనిపిస్తుంది .

ఒక్కొక్కరి జీవితం లో ఒక్కో రకం గా జరిగిన సంఘటన ల ఆధారం గా ఈ 'ఒంటరి తనం 'అలుముకుంటుంది .
కొంతమంది కి తనకి బాగా నమ్మకం అయినవాళ్ళు మోసం చేసినప్పుడు కలిగితే ,ఇంకొంత మంది కి తనకి ఇష్టమైన వాళ్ళు తన ని ఏమాత్రం పట్టించుకోనప్పుడు ఇలాంటి ఒంటరితనం తెలియకుండానే జీవితాల్లో కి ప్రవేశిస్తుంది .
ఈలాంటి మానసిక పరిస్థితుల్లో చాలా మంది చస్తూ బ్రతుకుతుంటే ,కొంత మంది అర్ధం లేని ఆలోచనలు,ఆవేశాలు చుట్టుముట్టి పిచ్చి వాళ్ళ లా ,ఇంకొంత మంది ఉన్మాదుల్లా తయారవుతున్నారు .
ఈ మద్య కాలం లో తరచూ మనం వింటూ ,చూస్తున్న ప్రేమోన్మాదుల వికృత చేష్టల మానసిక పరిస్థితి కి ఈ ఒంటరితనమే ఒక కారణం కావొచ్చు.

నిజానికి మనం మనసు పెడితే ..ఈ ఒంటరి తనం నుండి బయట పడటం ఏమంత పెద్ద పని కాదు.
ఈ కంప్యూటర్ యుగం లో పక్క మనిషి నుంచి నిజమైన ప్రేమ ని ,ఆప్యాయతని ఆశించడం కొంచెం అత్యాశే కానీ ,మనం ప్రేమిస్తే రెట్టింపు ప్రేమని పంచిచ్చే మూగ జీవుల ప్రేమ కి 'కొలమానం' ఏముంది ?
ఆస్వాదించే మనసే ఉండాలి గానీ ప్రకృతి ఒడి లో దొరికే స్వాంతన ఇంకెక్కడ దొరుకుంది ?
ఇలాంటప్పుడు మన కి ఇష్టమైన పనుల లో మనసు పెట్టి ,మనలోని సృజనని బయటకి తీయగలిగితే ..ఈ "ఒంటరి తనం " కూడా ఒంటరిదైపోతుంది కదా !

*మన పెద్ద వాళ్ళు ఆన్నిటి లో కల్లా 'అన్నదానం ' గొప్పదంటారు .కానీ ఈ రోజుల్లో పక్క వాళ్ళ కి కల్మషం లేని ప్రేమ ,ఆప్యాయత పంచి ఇవ్వడం అన్నిటిలో కల్లా గొప్ప దానం అని నా నమ్మకం .

20, ఏప్రిల్ 2010, మంగళవారం

వేసవి సెలవులు



సుతి మెత్తని భుజాల పై వేళ్ళాడే 'బడి సంచులు '-భేతాళు ని తమ్ముళ్ళు ,చెల్లెళ్ళు !
లేత మనసు ల తో ఆటాడుతూ ..వెంటాడుతూ,వేటాడే 'బడి పుస్తకాలు'-పసి హృదయాలని కలలో సైతం వీడని' పీడ కలలు'!!

వాటికి కొన్నాళ్ళు విరామం...

వేసవి సెలవులు ..
నిండు వేసవి లో కురిసే 'తొలకరి జల్లులు '
క్లాసులోంచి బయటకి రాగానే ..'క్వశ్చన్ పేపర్లు 'కాగితపు పడవలైపోతాయ్ !
క్లాసు పుస్తకాలు ' గాలి పటా' లై గాలి లో కి ఎగిరిపోతాయ్ !!
అప్పుడే జైలు లోంచి విడుదలైన ఖైది ల్లా ... వాళ్ళ మొహం లో కొత్తగా' వెలుగు రేఖలు 'విచ్చు కుంటాయి .
ఈ చదువులంటే ఈ పసి మనసు ల కి ఎందుకనో ఇంత విరక్తి ?!



**ఈ రోజు మధ్యాహ్నం(స్కూలు ఆఖరి రోజు )..మా వీది లోంచి వెళ్తున్న స్కూలు బస్ కిటికీ లోంచి ఎగురుతున్న కాగితపు రాకెట్లని చూశాక...

19, ఏప్రిల్ 2010, సోమవారం

విషపు చుక్కలు



ఈ రోజు తెల్లగా తెల్లారింది ప్రతి రోజు లానే ...

నిన్న మొన్నటి వరకు ఆప్యాయం గా నీ బుగ్గల్ని నిమిరిన ఆ చేతులే ..
ఈ రోజు నీ మెడ పై కర్కశం గా బిగుసుకుంటున్నాయి .

ప్రేమ పేరు తో నీవు పంచి ఇచ్చిన విషపు చుక్కలే ..
ఈ రోజు వాడి లో 'ఉన్మాధాగ్ని' యై .. విలయ తాండవం చేస్తుంది .

నీవు వాడి గుండె కు చేసిన గాయం నొప్పి లో ..నీ గొంతు నొప్పి వాడి కంటికి అనడం లేదేమో ...
"మృగ "మై పోయాడు .

ఇంతకీ తప్పెవరిది ?!
ఆశ పెట్టిన నీదా?అత్యాశ పడిన వాడిదా?!

ఏమైతేనేం ...కదిలే కాలం మీ కోసం ఆగదు గా ...
చిమ్మ చీకటి మీ ఇద్దరి రుధిరం తో మరింత చిక్కబడి మరో 'ప్రేమ జంట 'ని బలి తీసుకోడానికి మళ్లీ రేపటి కి తెల్లగా తెల్లారుతుంది .

11, ఏప్రిల్ 2010, ఆదివారం

కన్నీళ్ళు



ఏమిటో చెలీ ..
అప్పుడెప్పుడో ..నీవు ఆప్యాయం గా నన్ను హత్తుకున్నపుడు 'ఆనంద భాష్పా' లై కురిసిన ఈ కన్నీళ్ళు ..
ఇప్పుడు నన్ను అసహ్యించుకుంటూ ఆమడ దూరం నెట్టేసినపుడు 'అశ్రు ధార' లై వర్షించడం లేదేమిటో?!

బహుశ ...
నీవు నన్ను 'ఒంటరిని 'చేసి వెల్లిపోతున్నపుడు...
అగ్ని పర్వత మై పగిలే నా హృదయం లో నుంచి లావా లా ఉప్పొంగి -ఉప్పెనై నన్ను ముంచేయడానికి..
నా లోనే నిక్షిప్తమవుతున్నయేమో ..ఈ' కన్నీళ్ళు' !

10, ఏప్రిల్ 2010, శనివారం

నా ప్రియమైన శ్రీమతి ...



నిన్నటి రోజంతా అలసి సొలసి ఆదమరచి నిదుర లో కి జారుతున్న వేళ.. ..
ఒకటో రెండో 'అమృతపు చినుకు' లేవో ఆర్తి గా నా మోము ని ముద్దాడి నట్టు గుర్తు !
ఏమై ఉంటుందబ్బా ?!

అమ్మ దొంగా!
సిగ్గు తో ఎరుపెక్కిన నీ బుగ్గలే చెబుతున్నాయి ..,
అవి నీ' అధర మధుర సుధా చుంబనాలే' కదా !

అందుకేనా..ప్రతి ఉషోదయం నా కనులకు అత్యంత శోభాయమానం !
నిత్యం నా మదిలో వసంత కోయిల గానం !!

ఎందుకే చెలీ .. నేనంటే నీకు అంత ఇష్టం !!

9, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఆశ !



జాబిలి కి చీర కట్టాలని ఎన్నాళ్ళుగానో ..నాకో చిలిపి ఆశ !
నా" చెలి" వి నీవు కనిపించి కరుణించావు !!
చాలు ......
నా ఆశ ,అడియాశ కాలేదు ..... !

8, ఏప్రిల్ 2010, గురువారం

వర్ణింప తరమా ..?!





చెలీ !
వెన్నెల్లో గోదావరి లా ..
సంకురాత్రి 'రంగు ముగ్గు' లా ...
అంతటి అందం ఎందుకో నీకు!?

'జాబిలి' నిను పంపించిందా !
'జాజిపువ్వే ' నీలా విరిచిందా !!....

4, ఏప్రిల్ 2010, ఆదివారం

నా ప్రశ్న కి బదులివ్వు..!



ఎవరు చెప్పారు నీకు ?!
నా రంగుల కలల్ని చిదిమేసి మీ ముంగిట్లో 'రంగ వల్లులు 'దిద్దుకోమని !
నా గుండెని పిండేసి ఆ 'రుధిరపుచమురు' తో మీ అత్తారింట్లో దీపాలు పెట్టుకోమని !

నా చొక్కా చెంగు తో నీ చిమిడి ముక్కుని తుడుచి ,మురిపెంగా నీ బుగ్గ మీద ముద్దు పెట్టినపుడు ఎందుకు చెప్పలేదు ..
నీ చిలక ముక్కు కి దొండ పండు ని 'నేను' కాదని !

నీ ఓణీల పండగప్పుడు ఊరంతా నీ 'మొగుడు 'వాడేనని మేళ మాడితే ..
నీ ఓరకంట చూపుల కి నా తుంటరి చూపుల్ని జత చేసి నేను 'ఇంద్ర ధనస్సు కలలు' కన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ..
నీ కలల రాకుమారుడు 'నేను' కాదని ,'కారెక్కి 'వస్తాడని !

చిలక్కొట్టిన జాంపండు ని నీవు సగానికి కొరికి మిగిలిన సగాన్ని నా నోటికి అందించినపుడైనా చెప్పక పోయావా ...
నీవు సిగ్గుల మొగ్గవుతూ ..చుట్టిచ్చే 'చిలకల'ని ఆరగించే చినవాడు 'పట్నం బడి' లో పై చదువులు వల్లెవేస్తున్నాడని !

మా అమ్మ అపురూపం గా కట్టుకున్న సన్నజాజి మాల సగానికి తుంచేసి ,
సందె చీకట్లో ఎవరూ చూడకుండా నీ జడ లో తురిమినప్పుడైనా చెప్పి ఉండాల్సింది ..
నీ కలల 'జాబిలి 'తన వెంట 'వెన్నెల జాజుల్ని' తీసుకొస్తాడని !

నీ మువ్వల పట్టీల పాదాల పై నేను ముద్దాడినపుడైనా నీ గుండె ఘల్లు మనలేదా ?!
నీ ఒళ్ళు జలదరించలేదా ?!

అన్నాళ్ళు ..అన్నేళ్ళు నా ఇష్టాలని ,కష్టాలని కలిసి పంచుకున్న నీవు... ,
నాకు అందకుండా వెల్లిపోతున్నపుడు నీ కాళ్ళ పారాణి పై కురిసి మెరిసిన నా కన్నీటి చుక్కల్ని చూసినపుడే గుర్తుకొచ్చిందా..
నీ 'బ్రతుకు బండి' కి నేను సరి జోడి కాదని!!

పోనీ ..
నీవు "మొనగాడ ' ని మనువాడిని మగాడి తోనైనా చెబుతావా ...?
నీ లేత పాదాల పై దిద్దిన 'పెళ్లి పారాణి' లెలేత గోరింటాకు మెరుపు కాదని ,
'నా' రుధిరపు ఎరుపని !
తన కాళ్ళ కింద పడి నలిగి చెరిగి పోతున్నవి నీవు దిద్దిన రంగవల్లు లు కాదని,
'నా ' రంగుల కలలని !!

2, ఏప్రిల్ 2010, శుక్రవారం

ఉత్తరం-2



ఒరేయ్ ..సూరి బాబూ !మొన్న నేను రాసిన ఉత్తరం అదిందని ఆశిస్తున్నాను.
నీనుండి నాకు సమాధానం లేదు ..పొలం పనుల్లో బీజీ గా ఉన్నవనుకొంటా !
మాయా...నాకు మన ఊరి గంగపర్రు సుబ్బరాజు గారి కంపెనీ లో నే ఉజ్జోగం దొరికిందిరా .
అయన హైదరాదాద్ వొచ్చాక బాగా సంపాయించాడు రా .

ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ..సుబ్బరాజు గారి లాంటి వాళ్ళు ఇక్కడ అడ్డ దిడ్డం గా పడి
సంపాయిచ్చేస్తుంటే ..
నా నాలాంటి చిన్నా,చితకా పనులు చేసుకొని బతికేవాళ్ళ జీవితాలు మాత్రం అతలాకుతలం
అయిపోతున్నాయి ..మామ !!

ఇంటిల్లపాది నెలంతా కష్టపడినా..నెలఖరవునా.. గంజి నీళ్ళు కుడా ఉండవురా !
ఆ కన్నీలనే తాగి బతికేస్తున్నారు..ఎందుకంటే తాగడానికి మంచి నీళ్ళు కూడా కొనుక్కోవాలి మరి !!
ఈ విషయం లో కొంచెం మనోళ్ళ తప్పు కూడా ఉందిరా ..మరి !
పక్కోడికి సెల్ ఉండి మనకు లేకపోతె .నామోషి !
పక్కింటోడి పిల్లోడికి పుట్టిని రోజు పండగ చేసుకుంటే ..మన ఇంటి లో కూడా జరిగిపోవాలి ..అంతే!

ఇక్కడ కడుపునిండా తిండి లేకపోయనా పరవాలేదు మయా ...పక్కవాళ్ళకి " కలర్ పుల్" గా కనిపిస్తే చాలు.
మొత్తానికి చెప్పాలంటే ...చావలేక ,బ్రతక లేక .. ఉన్న ఊరికి రాలేక చస్తూ బ్రతికేస్తున్నార్రా ..

సూరి ..ఇక్కడ నా పరిస్థితి అయితే మరీ ధారుణం రా ..పొద్దు పొడవక ముందే లేచి ఆఫీసు కి పోవాలి .
మళ్లీ వచ్చేది ..ఏ అర్ధరాత్రప్పుడో..!
ఇక్కడ నా లాంటి వాళ్ళే చాలా ఎక్కువ .

నిజం చెప్పాలంటే ..నా లాంటోడు చేసే చిన్న చితకా ఉజ్జోగాలు మన పొలం పనులు కంటే గోప్పవేమి కాదురా .
మన ఉళ్ళో ,పొద్దంతా కష్టపడినా ..సందె పొద్దేల ఏ రామాలయం గుడి సెంటర్ లోనో ,
ఏ కాలువ రేవులో నో కూర్చుని కబుర్లు చెప్పుకుంటా రిలాక్షు అయిపోయేవాళ్ళం .
ఇక్కడేమో..పక్కింటోడు వచ్చి పక్కనే కుర్చున్నా గుర్తు పట్టలేనంత బిజీ ..!

ఒరేయ్ ..నీకు చెప్పడం మరిచిపోయా ,మొన్న పోయిన ఆదివారం మన బుల్లబ్బాయి గారి శీను గాడు
రూము కి వస్తే,సిటీ చూసొద్దామని వెళ్ళాము రా .
ఏమి చెప్పాలి మా తిప్పలు ?! నేనైతే ..పరిగెత్తి బస్సేక్కలేక కింద పడ్డా.
నా టైం బాగుండి నీకు ఇలా ఉత్తరం రాస్తున్నాను కానీ ,లేకుంటే ఈపాటికి నీవు లొట్టలేసుకుంటూ ..నా తద్దినం
భోజనం తినేవోడివి వెధవ !!

ఒరేయ్ మాయా..ఇక్కడ బస్సులు జనాల కోసం ఆగవురా ..ఫార్మాలిటీ కోసం ఆగుతాయి రా .
ఎక్కేవాళ్ళు ఎక్కుతారు ,దిగేవాళ్ళు దిగుతారు ,పోయేవాళ్ళు (పైకి )పోతారు !!
ఎలాగైతేనేఁ ..చావు తప్పి కన్ను లొట్టబోయి ట్యాంకుబండు కి వెళ్ళాం .
ఆ సంగతులన్నీ తరువాత ఉత్తరం లో తీరిగ్గా రాస్తాను గానీ ,నీవు మాత్రం ఉత్తరం రాయడం మరచిపోకురోయ్.మన ఊరోల్లందరిని అడిగానని చెప్పు ..
ఉంటాను మరి !

24, మార్చి 2010, బుధవారం

ప్రేమ లేఖ -2



ప్రియా!
నిదుర రాని నా కన్నులకు జోల పాడి నిద్రపుచ్చావు !
తడబడే నా అడుగులకు కాలి 'మువ్వ' వై లయ నేర్పించావు !!
అనుక్షణము నా' హృదయ స్పందన' వై నా వెంట ఉన్నావు...
నా మది లో ఎన్నో మధురానుభూతుల్ని నింపావు ..
నాకో మధుర జ్ఞాపకమై మిగిలావు !!

ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా..చెప్పలేకపోతున్నాను ప్రియా ..
ఎందుకంటే ,


నీవు నాకు మిగిల్చిన 'మధురజ్ఞాపకం 'ఊయల లో 'మారాం' చేస్తున్నాడు .
నేను కట్టుకున్న' మావారు'ఆఫీసు నుండి వచ్చే వేళ అయ్యింది .
ప్రియా!మరు జన్మ లోనైనా నీ పాదదాసి గా పుట్టాలని ఆశించే......
.....................నీ దేవదాసి{దేవదాసు లా అన్నమాట }!!

**"పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు "-సుప్రీం కోర్టు సృస్టికరణ."-

ఉదయం పేపరు చదువుతున్నప్పుడు ఈ వార్త కంటపడి ,నా మనసు లో ఓ విత్తు పడి..ఓ చిలిపి ఆలోచన మొగ్గ తొడిగి ..పువ్వై ..పిందై ..కాయై చివరాఖరు కి నా ఈ "కపి -త "అయ్యింది .ఎక్కువ చేస్తే ..క్షమించండి !

*కోర్టు వ్యాఖ్యలు తప్పు కాదంటే ..నా ఈ కపి-త కూడా తప్పు కాదు మరి !

23, మార్చి 2010, మంగళవారం

ప్రియ మిత్రుడు -జానీ గాడు-3



అగ్రహారం మా పక్క ఊరే కావడం మూలాన ఆ పెళ్లి లో చాలా వరకు మాకు తెలిసిన ముఖాలే .
వాళ్ళంతా పలకరిస్తుంటే ,మేము మాత్రం నవ్వేసి ఊరుకునే వాళ్ళం.నోరు విప్పితే అసలు బండారం ఎక్కడ బయట పడిపోతుందేమోని భయం !ఒక పక్క పెళ్లి తంతు జరుగుతుంటే ,ఇంకో పక్క టెంటు లో బోజనాల హడావిడి .
పెళ్లి కి వచ్చిన జనమంతా బోజనాల దగ్గరే ఉన్నారు.అక్కడ అడుగు పెడుతూనే ..వెజిటేరియన్ పలావు వాసన నా ముక్కు పుటల్ని తాకేసరికి నేను మొదట బోయినాల టెంటు లో కి వెళ్లబోయాను .సాయి గాడు నా చెయ్యి పట్టుకుని ఆపేశాడు.
"రేయ్ ఎవరైనా చూస్తే మనం పెళ్లి బోయినాలకి వచ్చామకుంటారు .ముందు కాసేపు పెళ్లి చూసాక ,తరువాత బోయినాలు "అన్నాడు.
వాడు కొంచెం పెద్ద తరహ మనిషి వాడి మాట కాదనలేక ,అందరం పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాం .నా మనసు మాత్రం టెంటు లో నే ఉండిపోయింది .
"జీడి పప్పు పకోడీ కూర బలే ఉందిరా "అని ఒకడు ,"చిక్కుడుకాయ టమేటో అదిరిపోయిందేహే"అని ఇంకొకడు ..బోజనాలు చేసేసి పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళ మాటలు నా చెవి లో పడేసరికి ఇంక ఓపిక పట్టడం నా వల్ల కాలేదు .
జానీ గాడ్ని గట్టిగా గిల్లేశాను .వాడు చూపులు ఎక్కడో పాతుకుపోయాయి ,ఈ లోకం లో లేడు .
"ఒరేయ్ ఆ పిల్లని చూడరా ..బలే ఉంది కదా "అన్నాడు పెళ్లి కూతురు వైపు చూపిస్తూ ."రేయ్ !పెల్లికూతురు ని అలా అంటే కళ్ళు పోతాయిరా"అని లెంపలేసుకున్నాన్నేను."అది కాదేహే ..పెళ్లి కూతురు వెనకాల "మెల్లగా చెప్పేడు వాడు .
మంచి ముత్యానికి పట్టు పరికిణీ కట్టినట్టు ఉందా పిల్ల .ఎన్ని కొంటె పనులు చేసినా ఆడపిల్ల లకి ఆమడ దూరం లో ఉండే జానీ గాడు ,ఆ పిల్ల ని చూసి మైమరచిపోవడం నాకు వింతేమీ అనిపించలేదు .వాడే కాదు ఎలాంటి మగాడైనా ఆ పిల్ల అందాని కి పడిపోవలసిందే!
నాకు మాత్రం ఆ అమ్మాయి అందం కంటే నా కడుపు లో ఆకలే ఎక్కువ అలజడి రేపుతుంటే ..సాయి గాడ్నిప్రసాదు గాడ్ని తీసుకుని బోజనాలకి వెళ్ళిపోయాను.జానీ గాడు మాత్రం అక్కడ నుంచి కదల్లేదు.
బోజనాలు అయ్యాక ఎలాగో బలవంతం గా వాడ్ని ఇంటి కి లాక్కొని వచ్చేశాము .పాపం !వాడి మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది .

మర్నాడు తెల్లారగట్లే పాల కేంద్రం నుంచి పాలు తీసుకొస్తూ అలవాటు గా మా ఇంటి ముందు ఆగి పలకరించాడు. వాడి పై పెదవి కొంచెం చిట్లి రక్తం గడ్డ కట్టి ఉంది .
"అదేంట్రా !రాత్రి బాగానే ఉన్నావు కదా "అన్నాన్నేను ."నిన్న రాత్రి సైకిలు అరుగు మీదకి ఎక్కిస్తా పడిపోయన్రా "వాడి స్టైల్లో కిచ కిచ మని నవ్వేసాడు .
కొన్ని రోజులకి మా పదో తరగతి పరీక్షా పలితాలు వచ్చేశాయి . దేవుడు దయవల్ల మా మిత్రబృందం అంతా గట్టేక్కేశాము .
ఓ రోజు సర్టిఫికెట్లు తీసుకొవడానికి స్కూలుకి వెళ్తే ,అక్కడి కి వంకర పళ్ళ మధు గాడు కూడా వచ్చి ,జానీ గాడ్ని చూసి కిసుక్కున నవ్వేసాడు .
ఏమైందిరా? అని అడిగితే వాడు అసలు విషయం చెప్పేసాడు ."ఒరేయ్ !ఆ రోజు మా నాన్న గారు అడ్డు పడకపోతే ,పెళ్లి కూతురు తరపోల్లు వీడ్నిచితక్కోట్టేదుర్రా "అని చెప్పి మళ్లీ పళ్ళు యికిలించాడు . మాకేమి అర్ధం కాక జాని గాడి మొహం వైపు అయోమయం గా చూశాము .ఇంక చేసేదేమీ లేక కొంచెం సిగ్గు పడుతూ ..వాడు చేసిన ఘన కార్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పేశాడు .
"రేయ్!ఆ రోజు మనమంతా ఇళ్ళకు వచ్చేశాక ..నేనొక్కన్నే మళ్లీ పెళ్లి కి వెళ్ళాను రా ..నేనేమి చెయ్యలా ..కొంచెం ఆ పిల్ల తో మాట్లాడబోతా ఉంటే ఎవడో గొట్టం గాడు నా మీద చెయ్యేశాడు .పెళ్ళని ఊరుకున్నాను గానీ,అదే బయటయితే విరగోట్టేద్దును నా కొడుకునీ!"సమర సింహ రెడ్డి లెవెల్లో ఎమోషనల్ అయిపోయాడు జానీ గాడు .{అప్పటికే కుస్తీ పోటిలలో రాష్ట్ర స్థాయి లో పాల్గుంటున్న బలశాలి మరి ..ఆ మాత్రం ఉంటుందిలేండి !}
"ఓర్ని!అదా సంగతి ..మరి ఆ రోజు అడిగితే కాలు జారింద న్నా వేంట్రా"అని నేనడిగితే ,
కాలు కాదురా ..మనసు జారేడు "నాలుక బయట పెట్టి తలాడిస్తా తమాషాగా నవ్వేసాడు సాయి గాడు.
"నీకు చాలా కళ లు ఉన్నాయిరా "ప్రసాదు గాడు ఆటపట్టించాడు .మాకూ నవ్వు ఆగలేదు ..జానీ గాడ్నిచుస్తూ పగలబడి నవ్వేశాము .
వాడు కూడా పై పెదవి మీద చూపుడు వేలు తో నిమురు కుంటూ ..కిచ కిచ మని మా తో పాటే నవ్వేశాడు .


ఇలాంటి జ్ఞాపకాలెన్నో ..మిగిల్చిన ఆ "కోతి గాడు" చివరాఖరు కి తనే మా అందరి కి "కన్నీటి జ్ఞాపకం" గా మిగిలిపోతాడని ఏనాడూ అనుకోలేదు .

19, మార్చి 2010, శుక్రవారం

ప్రియ మిత్రుడు -జానీ గాడు-2



ఆ రోజు సాయంత్రం మా 'దుష్ట చతుష్టయం ' ఎప్పటిలానే లాకుల మీద కూచుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్నాము .
మా స్కూల్లో మాస్టార్లు గురుంచి ,మా క్లాసు లో అందమైన అమ్మాయి ల గురుంచి ,మేము చేసిన అల్లరి పనుల్ని ఒక్కొకటి గుర్తు చేసుకుంటూ ..మాట్లాడుతూ ఉండగానే ఆ సాయంత్రం కాస్తా సందె చీకట్లు ముసురుకుని క్రమ క్రమం గా చిక్కబడి 'చీకటి రాత్రి 'అయిపోయింది .మెల్ల మెల్లగా వూళ్ళో ని సందడి అంతా సద్దుమనిగిపోయింది .
లాకుల్లోంచి చెంగు మని దూకుతున్న కాలవ నీళ్ళ హొరు తప్ప ,మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ నిశ్శబ్దం గా అయిపోయాయి .

కబుర్ల లో పడి మేము పట్టించుకోలేదు గాని మా కడుపు లో చిన్నగా ఆకలి కేకలు మొదలయ్యాయి .
"ఒరేయ్ ..ఆకలేస్తుంది ,యిళ్ళ కు వెల్లిపోదాం రా " పొట్ట నిమురుకున్నాడు ప్రసాదు గాడు.
అంతటి తో మా వేసవికాల సమావేశాలని తరువాత రోజుకి వాయిదా వేసేసి,యిళ్ళ బయలుదేరబోతుంటే ..ఆ నీరవ నిశీధి లో ఎక్కడి నించో సన్నగా సన్నాయి రాగం వినిపించింది .
అంతే!ముందుకి కదలబోతున్న జానీ గాడు టక్కున ఆగిపోయి 'రేయ్!అగ్రహారం లో ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది ..ఎవరి ఇంట్లో అంటావ్ "'అని ఉత్సాహం గా అడిగాడు .
వాడి ఉత్సాహం చూస్తే ఏదో కోతి పనికి ప్లాను వేస్తున్నట్టు అనిపించింది నాకు .
"మన 'బి 'సెక్షను లో వంకర పళ్ళ మధు గాడు ఉన్నాడు గా ..వాళ్ళ పెద్ద నాన్న గారి అబ్బాయి దేహే ..మా అన్నయ తో కలిసి చదువు కున్నాడంట!మొన్న మా యింటికొచ్చి మమ్మల్ని కుడా పెళ్లి కి రమ్మని' మరీ మరీ చెప్పి వెళ్ళేడు రా .. "అని అమాయకం గా చెప్పేసాడు ప్రసాదు గాడు.
ఆ తరువాత జరిగే పరిణామాల్ని వాడు ఉహించలేకపోయాడు పాపం!
కోతి కి కొబ్బరికాయ దొరికేసినట్టు జానీ గాడు కి మంచి దారి దొరికేసింది .
"అయితే మనం ఎల్దామే హే ..మీ అన్నయ వూళ్ళో లేడు కదా !ఎవరైతే ఏంటి ?" కిచ కిచ మని నవ్వతా లోట్టలేసాడు జానీ గాడు.
ప్రసాదు గాడి గుండెల్లో రాయి పడిపోయింది .'మా అన్నయ్య కి తెలిస్తే చంపేస్తాడురా'అని తెగ భయపడిపోయాడు .
"పరవాలేదే హే..మీ అన్నయ్య అడిగితే ,మధు గాడు రమ్మన్నాడని చెబుదాం "ఎగదోశాడు సాయి గాడు.
పెళ్లి బోయినాలు కళ్ళ ముందు కదిలేసరికి ...నా నోట్లో నీళ్ళు ఊరి నేనూ సరే అన్నాను .
నున్నగా తలలు దువ్వుకున్నాం!జేబు రుమాళ్ళ మడతల్లో దాచుకున్న సంతూర్ పౌడరు ని ముఖాలకి అద్దుకుని పిలవని పేరంటానికి పెళ్లి పెద్ద ల్లా బయలుదేరిపోయాం .
అప్పుడే మొదలైంది అసలు కథ !!
{ తరువాత టపా లో ....}

16, మార్చి 2010, మంగళవారం

ప్రియ మిత్రుడు-జానీ గాడు-1



అవి వేసవి కాలం రోజులు .
నేను నా మిత్ర బృందం పదో తరగతి పరిక్షలు రాసేసి నెత్తి మీద కొండంత బరువు దించేసుకుని,
సాయంత్రం అయ్యేసరికి మా ఊరి 'లాకులు' మీదకి చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం .
మా మిత్ర బృందం లో సభ్యులం 'పంచ పాండవులు' లా ఐదుగుర మే కానీ ,
కొంటె పనులు దగ్గరి కి వచ్చేసరికి 'దుష్ట చతుష్టయం' లా నలుగురమే -సాయి ,జానీ ,ప్రసాదు ,నేను !
కృష్ణ మోహన్ గాడ్ని ఐతే వాళ్ళింటిలో వాళ్ళు బయటకి పంపేవారు కాదు .(వాడు ఇంట్లో ..రాముడు మంచి బాలుడు టైపు అన్న మాట !బయటకు వస్తే చిలిపి కిట్టయ్యే !)
మా ఐదుగురు లో నలుగురుం ఇంచుమించు గా ఒకే నడవడిక లో ఉంటాం కానీ ..జానీ బాబు గాడు మాత్రం కళ్ళు తాగిన కోతి టైపు .
వాళ్ళ అమ్మ నాన్న ల కి పెళ్ళైన చాలా రోజుల వరకూ పిల్లలు పుట్టకపోతే,యేసు ప్రభువు ని నమ్ముకున్నాక పుట్టాడంట వాడు .
అందుకే "జానీ బాబు "అని పేరు పెట్టారంట వాడి కి !మనసు కి దయామయుడే కానీ .మనిషే కాస్తంత వంకర .
అలాంటి వంకర మనిషి..ఆ వేసవి సాయం కాలం చేసిన ఓ 'వంకర పని' గురుంచి తరువాత టపా లో చెబుతాను .
{కొంచెం పని ఉంది ..ఏమీ అనుకోకండే }!

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...