10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

మా పాలవెల్లి

వినాయక చవితి !
"నాన్నోయ్ !నాలుగు యాప్లిస్ కాయలు (ఆపిల్స్ ),నాలుగు బత్తాకాయలు ,ఆరు మొక్క జొన్న పొత్తులు ,రెండు ఎలక్కాయలు(వెలగపండు )...."నా లిస్టు ఇంకా పూర్తి కాకుండానే నాన్న మద్యలో అడ్డు తగిలి "అన్నీ తెస్తాలేరా "అనేసి కర్రల సంచి ని హీరో సైకిలు హ్యాండిలు కి తగిలించి పండగ సరంజామా తీసుకు రావడానికి బజారు కి బయలుదేరేవారు.
ఆయన సైకిలు వెనకాలే వీది మలుపు వరకూ పరుగెత్తి ..."నాన్నోయ్ !సాయంత్రం వచ్చేటప్పుడు కొత్త 'పాలిల్లు '(పాల వెల్లి) కూడా తీసుకురా !"అని మెల్లగా చెప్పేవాన్ని .గట్టిగా చెబితే ఎవరైనా విని అమ్మ తో చెప్పేస్తారని నా భయం !
నా కొత్త పాలిల్లు కోరిక కి మొదటి అడ్డుపుల్ల ఆవిడే మరి!
అమ్మ నాకంటే కూడా భలే తెలివైంది .నేను వీధి లోంచి ఇంట్లో కి రాగానే "ఓయ్ చిన్నా!అటక మీద ఉన్న పాలిల్లు దించుకుని శుబ్రం చేసుకో " అనేది ."లేదమ్మా !కొత్త పాలిల్లు తీసుకు రమ్మని నాన్న తో చెప్పాను .ఇంక పాతది ఎందుకు ?"అన్నాను ధీమాగా !
"దాని సంగతి తరువాత ముందు దీని సంగతి చూడు "అని ఆర్డరేసేది అమ్మ .
ఆవిడ బాధ భరించలేక అటక మీద ఉన్న పాత పాలవెల్లి దించి ,దానికి ఉన్న ఎండిపోయిన మావిడాకుల్ని తుంచి .బూజు దులిపి ఓ మూలన పెట్టేవాడిని .ఊళ్ళో అందరి పాలవెల్లు ల కంటే నాది నెం .వన్ గా ఉండాలని నా ఫీలింగు !
నాన్న కి లిస్టు చెప్పినా నా ప్రయత్నం లో నేను ఉందామని ...పక్క ఇంటి వాళ్ళ పెరటి చెట్ల మీద ఒక కన్నేసి ఉంచేవాడిని.వాళ్ళ పెరటి నిండా నారింజ ,బత్తాయి ,జామ, రాంబాల కాయలు (సీతా పలాలు లెండి ) చెట్లు !
వాళ్ళు మద్యాహ్నం నిద్రకి ఉపక్రమించగానే గోడ దూకి నా పని కానిచ్చేసేవాడిని.ఆ పెరట్లో నాలాంటి వాళ్ళు చాలా మందే ఉండేవారు .
మా ఇంటి ఎదురుగా ఉండే చెరువు లోని కలువ పువ్వుల్ని కోసుకొచ్చేవాడిని.
సాయంత్రం అయ్యేసరికి పండగ సామాన్లని తీసుకొచ్చేవారు నాన్న -నా కొత్త "పాలిల్లు" తప్ప !నా కంటే ముందే అమ్మ నాన్న తో మాట్లాడి నా కొత్త పాలిల్లు కి స్కెచ్ గీసేసిందని అప్పుడే నాకు అర్దమయ్యేది .నాకు కన్నీళ్ళు ఆగేవి కావు ...నులకమంచం లో పడి వెక్కి వెక్కి ఎడ్చేసేవాడిని.ఆ రాత్రి కి అన్నం తినేవాడ్ని కాదు .
అయినా తప్పదు కదా ..ఉదయాన్నే లేచి నా బూజు పట్టిన పాలవెల్లి ని మా రామాలయం ఎదురుగా ఉండే బావి దగ్గరకి తీసుకుపోయి నీటు గా కడిగేవాన్ని!మా ఊళ్ళో అందరి "పాలిల్లు "లు అక్కడికే తీసుకొచ్చి కడిగేవారు.కొత్త పాల వెల్లులు తెచ్చుకున్న కుర్రోళ్ళు కొంచెం హొయలు పోతుంటే ... .నా మనసుకి ఎక్కడో చివుక్కుమనేది .దీనంతటికి కారణమైన మా అమ్మ మీద కోపం వచ్చేది .
నేను మూతి ముడుచుకుని కూచుంటే అమ్మ దానికి పసుపు రాసి ..కుంకం బొట్లు పెట్టి "చూడరా ..మనది కూడా కొత్త పాలిల్లే "అనేది .
నాన్న దానిని వీది అరుగు మీద పురుకోస తో వెళ్లాడ కట్టి మామిడాకులు గుచ్చేవారు .నేను కాసేపటికి కోపం తగ్గి నాన్న తీసుకొచ్చిన కర్రల సంచి విప్పదీసి చూసేవాడ్ని ...నేను చెప్పిన వాటిలో సగమే తెచ్చేవారు అయన .మళ్లీ యుద్ధం ప్రకటించేవాడిని .ప్రతి సంవత్సరం ఇదే తంతు !
మా పాలవెల్లి లో కొంచెం ఖరీదైన ఆపిల్స్ .దానిమ్మ కాయలు ఉండేవి కావు .పాలవెల్లి కి నాన్న తెచ్చిన పండ్లు కాయలు .పూలు కట్టేసాక దానిని అత్తారబత్తం గా తీసుకుపోయి దేవుడు గదిలో వెళ్లాడ కట్టి "వినాయకుణ్ణి "పెట్టి పూజ చేసేవారు .
నా పుస్తకాలు తెచ్చి పసుపుతో ఓం అని రాసి దేవుడి కి దణ్ణం పెట్టుకోమనేవారు .నేను అస్సలు దణ్ణం పెట్టుకునేవాన్ని కాదు.
అందుకేనేమో సరిగా నాకు చదువు అబ్బలేదు .సాయంత్రం అవగానే నేను వద్దని మొత్తుకుంటున్నా దేవుడు దగ్గరి అక్షింతలు నా తల మీద వేసేది అమ్మ -కొడుకు చంద్రున్ని చూసి నీలాపనిందలు తెచ్చుకోకుండా!అమ్మకి నేనంటే ఎంత ప్రేమో!

ఇదంతా ఒక ఎత్తు అయితే ..తొమ్మిది రోజులు అయ్యాక ఇంకో గొడవ !నాన్న తెచ్చిన వినాయకుడు బొమ్మని పత్రి తో పాటు కాలువలో కలిపేస్తుంటే...ఏడ్చి నానా యాగీ చేసేవాడిని .ముద్దుగా బొద్దుగా ఉండే వినాయకుడి ని ..వదులుకోవడానికి నా మనసు అస్సలు ఒప్పుకొనేది కాదు . అప్పుడు అంతే..ఇప్పుడు కూడా ఇంతే !
ఇప్పుడు ఈ భాగ్య నగరం లో పెద్ద పెద్ద వినాయక విగ్రహాల్ని హుస్సేన్ సాగర్ మురికి నీటి లో కలిపేస్తుంటే మనసుకి ఎందుకో కొంచెం బాధగా అనిపిస్తుంది .
అప్పుడు ఎంత ఏడ్చి మొత్తుకుంటూ పండగ చేసినా కలిగిన అనందం ..ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాల మద్య ..పెద్ద హడావిడి ల మద్య పండగ చేసుకుంటున్నా కలగడం లేదు .కాలం మారిపోయింది .ఇప్పుడు పండుగలు పండగ లా ఉండటం లేదు.

*మిత్రులందరికీ "వినాయక చవితి "శుభాకాంక్షలు .

16 కామెంట్‌లు:

raj చెప్పారు...

its similar to my childhood and thanks

చందు చెప్పారు...

వినాయక చవితి శుభాకాంక్షలు.

శిశిర చెప్పారు...

అవును. ఇప్పుడు పండుగలు పండగ లా ఉండటం లేదు. బాగున్నాయి మీ జ్ఞాపకాలు. వినాయక చవితి శుభాకాంక్షలు .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@raj garu:thank u sir.

@ సావిరహే గారు !:ధన్యవాదాలు ..వినాయక చవితి శుభాకాంక్షలు .

@శిశిర గారు :ధన్యవాదాలు .వినాయక చవితి శుభాకాంక్షలు .

Unknown చెప్పారు...

My father and mother will behave like your parents.

I will ask my father to buy apples and promegranate fruits. But he never brought them.

Offcourse it is not his fault. Fanancial matters are important.

Now As a software engineer I am working at abroad and have moneny to buy apples. But no festival environment at home.

Today I am felt I am missing my family and my home.

I am very sad for not celebrting the Ganesh Festival at my home.

ఇందు చెప్పారు...

మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.....నా చిన్నప్పటి గ్నాపకాలు గుర్తుకొచ్చాయి.....నాకు హుస్సేన్ సాగర్ లొ వినాయకనిమజ్జనం చూస్తే బాధేస్తుంది....హ్మ్ ఏంచేస్తాంలేండి....

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

తువ్వాయి గారూ...,విఘ్నాధిపతిని భక్తితో పూజిద్దాం

హారం

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

శ్రీనూ చాలా బాగా చెప్పారు మీ అమూల్యమైన మొమొరీస్‌ని....అప్పట్లో మా ఇంట్లో కూడా ఆప్లీస్ కాయలు, బత్తాయి, దానిమ్మలాంటి ఖరీదైన కాయలు కొనేవారు కాదు...పాలవెల్లి నేనే డేకరేట్ చేసేవాడిని..ఇప్పుడు అన్నికొనుక్కోగలిగినా, డెకరేట్ చేసే అవకాశం లేక ఏదో వెలితిగా ఉంటుంది...ఎప్పుడైనా లేని రోజులే బాగుంటాయి...అన్నీ వచ్చాసాక ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను మిస్సయిపోతుంటాము...

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@Monarch గారు !నా టపా కి స్పందించినందుకు ధన్యవాదాలు .
నా పరిస్థితి కుడా ఇంచుమించుగా మీ లాంటిదేనండి .అమ్మ ,నాన్న ఊరిలో ఉన్నారు .నేనేమో హైదరాబాద్ లో పండగ రోజుల్లో ఒంటరిగా ..బాధగా.. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ..ఇలా టపాలు రాసుకుంటూ ...!మనలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారండి .

@ఇందు గారు!:ధన్యవాదాలు .కొన్ని కొన్ని విషయాలని బలవంతం గా నైనా జీర్ణించుకోవాలి.మనం ఎంతో భక్తి తో పూజించే దేవుణ్ణి చివరకి డ్రైనేజి వాటర్ లో నిమజ్జనం చేయడం ఏమిటి ?ఎంత మూర్ఖత్వం ?!

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@భాస్కర రామి రెడ్డి గారు:ధన్యవాదాలండి .నాకు స్వతహాగా కొంచెం భక్తి తక్కువండి ..మీరు చెప్పారు కాబట్టి ఈ ఒక్కసారికి వినాయకుణ్ణి భక్తి తో పూజిస్తా ..హహ ..!

@శేఖర్ గారు :ధన్యవాదాలండి .ఇవి మనం అనుకోవడానికి చిన్న చిన్న విషయలేగాని..ఈ చిన్న చిన్న ఆనందాలే ..మన పెద్ద జీవితానికి ఊపిరి పోసే ప్రాణ వాయువులే కదండీ!

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

శ్రీనూ నా ఉద్దేశంలో చిన్న చిన్న ఆనందాలంటే తక్కువ వేల్యూ ఉన్నవి అని కాదు...ఆనందానికి అసలైన నిర్వచనం చెప్పేవి ఈ చిన్న చిన్న ఆనందాలు...అప్పట్లో మనవాళ్ళు ఆర్ధికంగా అంతగా కలవారు కాకపోయినా మనం ఎంత ఆనందాలను పొందాము ఇలాంటి పండుగల్లో...అదే ఇప్పుడు చూడండి..కాస్త ఉన్నవారిమి ఐనా అలాంటి ఆనందం ఒక్కటి కూడ లేదు పండుగలప్పుడు...నేను చెప్పాలనుకున్నది మీకు అర్ధం అయిందని అనుకుంటున్నాను..అన్నటు నన్ను శేఖర్ అని అనండి గారు చేర్చకుండా..:-)

శ్రీను .కుడుపూడి చెప్పారు...

అయ్యో !మీ భావన నాకు ముందే అర్దమైంది శేఖర్ గారు !
క్షమించాలి ..గారు చేర్చకుండా ఉండలేను -మాది అమలాపురం కదా !అలా అలవాటైపోయిందండీ.

Unknown చెప్పారు...

hai srinu mee maa paalavelli chala bagundi..chaduvutunte maa childhood gurtukuvachindi.pandagalu ippudu adambaramga jarugutunnavi..appudu bhaktiga vundevi..elanti articles, stories inka chala rayalani korukuntunna..all the best

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@SABITHA GARU:THANK U SABITHA GARU.

కొత్త పాళీ చెప్పారు...

Brilliant

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@కొత్తపాళీ గారు : ఏదో మీ అభిమానమండీ ! :)

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...