10, జనవరి 2019, గురువారం

పాపికొండల ప్రయాణం

పాపికొండల ప్రయాణం 
మొన్న పోయిన వారం వూరెళ్ళాం. ఎక్కడికైనా వెళ్దామనుకుని రాజమండ్రి నుండి గోదారి లాంచీ లో పాపికొండలు మీదుగా భద్రాచలం ప్రయాణం పెట్టుకున్నాం. ఒక్కో తలకాయకి పదహారొందలు అంటే కిక్కురు మనకుండా ఎక్కేసాం.ప్రయాణం చేసాక డబ్బులకి ఆ జర్నీ దొబ్బు లేదనిపించింది. రాజమండ్రి గోదారి గట్టు మీద నుండి  పట్టిసీమ పోలవరం మీదుగా పురుషోత్త పట్నం రేవు వరకూ మినీ బస్సు ప్రయాణం.మేం వెళ్లేసరికి లాంచీ రేవులో ఓ పది వరుకు సింగారించుకున్న రంగ సానుల్లా అందమైన లాంచీలు.గోదారి గట్టు మీద చిరు తిళ్ళు మంచి నీళ్లు అమ్మే కుటీరాలు. "బాబు..వాటర్ బాటిల్ ఇవ్వు"ఓ ఇరవై అతడి చేతిలో పెట్టాను. ఇంకో పది అన్నాడు. "అదేంటి ఇరవై నే కదా"."యిక్కడంతే ఇష్టమైతే కొనుక్కో.. లేదంటే "డాష్ ". అబ్బా.. గుండె రెండు ముక్కలైంది. ఓ రెండు కిలోమీటర్లు వరకూ ఇంకేం షాపుల్లేవ్. చచ్చినట్టు కొనుకున్నా. అది కూడా కూలింగ్ లేకుండా.   గోదారొడ్డుదిగి లాంచీ ఎక్కాం.   పొద్దున్న టిపినీలు,మజ్జెన్నం బోయినాలు (లంచ్ )ఆల్లియ్యే !ఎంటర్టైన్మెంటు కి డోకా లేదు. ఓ సారి మంచి మసాలా పాటలు, ఇంకో సారి మత్తెక్కించే మెలోడీ సాంగులు ఆటలు పాటలు అబ్బో పిచ్చెక్కి పోయే సరదా జోకులు 😄.అంత బానే ఉంది కానీ నా లో ఏదో తెలియని బాధ !సరే ఆ బాధ తోటే పాపికొండల చల్లని గాలి పీల్చుకుంటా.. గోదారి గలగలలు వింటా మెల్లగా పేరంటాలపల్లికి వచ్చేసాం. అక్కడ శివుణ్ణి దర్శించుకుని గిరిజన అక్కలు అన్నలు వెదురు తో చేసిన బొమ్మల్ని తక్కువ రేటైనా కొనకుండా కళ్లారా చూసేసి మళ్ళీ భద్రాచలం వైపు వెళ్లే లాంచీ ఎక్కేసాం. ఎన్ని అందాల్ని చూసినా పొద్దున్న బరువెక్కిన గుండె అలాగే బరువు గా ఉంది. పొద్దస్తమానూ ఆటలతో డాన్సులతో అలిసిపోయిన కపుల్స్, పిల్లకాయలు అన్నిఆపేసి గోదావరి గలగలలు వింటా సేద తీరతావుంటే నేను మాత్రం పొద్దున్న జరిగిన గోర అవమానం గురుంచే ఆలోచిస్తా కూర్చున్నా. ఓ గంట ప్రయాణం తరువాత సరిగ్గా నాలుగు గంటలకి పోచవరం దగ్గర లాంచీ దించేశారు. గోదారొడ్డున నిలబడి చూస్తే కళ్ల ముందు అన్నీ గోదారి నీళ్ళే. గలగలపారే కమ్మటి నీళ్లు.గోదారి తల్లి కి ఓ దణ్ణం పెట్టి మెల్లగా యిసుక తిప్పలో కాళ్ళు ఈడ్చుకుంటా ఏటిగట్టు మీద కొచ్చేసరికి గొంతెండిపోయింది. "ఒరేయ్.. పొద్దున్న కొన్న మంచి నీళ్లు బాటిల్ యివ్వరా"నా పక్కనే ఉన్న మా చిన్నాన్న కొడుకు శీను గాడ్ని అడిగా." లాంచీలో ఎవడో కొట్టేశాడ్రా "వట్టి చేతులు గాల్లో ఊపేసాడు వాడు. చచ్చింది గొర్రె. ఈ గోదారి గట్టు మీద కూడా బోలెడు వాటర్ బాటిళ్ల్లు. "ఒకటి కొన్నా" అన్నాడు వాడు. దూరం గా భూదేవిని ఆప్యాయం గా స్పర్శిస్తూ గోదారి నీళ్లు. కళ్ళముందు ధరలు చుక్కల్ని తాకుతూ సీసా నీళ్లు. "వొద్దురా.."నాలుకతోనే పెదవుల్ని తడి చేసుకున్నా. అక్కన్నించి టాటా మేజిక్ లో భద్రాచలానికి ఓ డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం. టాటా మేజిక్ ఎక్కి కూచున్నాక "ఒరేయ్ శీను.. మనం  తింగరి నా యాళ్ళం, టిఫినులు బోయినాలు పెట్టునోళ్లు మంచి నీళ్లు ఇస్తారనే యివరం లేక పెద్ద పుడింగుల్లా వాటర్ బాటిల్ కోనేసాం. అది సరే.. లాంచీ లో అన్నీ నీళ్లు ఉండగా మళ్ళీ మన బాటిల్ కొట్టేసిన తింగరి నా కొడుకు ఎవడ్రా " మెల్లగా గుండె భారాన్ని దించుకుంటా పెకెత్తున్న నవ్వేస్తా అన్నాన్నేను. ఆడు మెల్లగా నవ్వి "ఆడేం తింగరి నా కొడుకు కాదురా .. ఇక్కడనుంచి మనం ఇంకా చాలా దూరం ఎల్లాలి. చాలా దూరం వరకూ ఊళ్లే తగలవు.  చుక్క మంచి నీళ్లు  కావాలన్న చచ్చినట్టు భద్రాచలం వరకూ ఆగాల్సిందే. ఈ ఆటో వోడు ఇంకెక్కడా ఆటో ఆపడు. " అన్నాడు తాపీగా. అబ్బా.. మళ్ళీ చచ్చింది గొర్రె. మళ్ళీ తింగరోడ్ని అయిపోయాను. మళ్ళీ అవమానం.  నేను గోదారోడ్ని అయుండి గోదాట్లో ప్రయాణం చేస్తా కళ్ళ ముందు అన్ని నీళ్లు ఉండి కూడా ఒక కార్పొరేట్ మంచి నీళ్ల బాటిల్ ముందు తలొంచుకోవాల్సిరావడం నిజం గా అవమానమే. మళ్ళీ గుండె బరువెక్కింది. 😊ఇన్ని రోజులైనా బరువు అలాగే ఉంది.హైదరాబాద్ లో  వాటర్ బాటిల్ చూసినప్పుడల్లా నా గుండె కలుక్కుమంటుంది. 😂😂.

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...