25, జనవరి 2024, గురువారం

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూసుకుపోతున్న తారాజువ్వలా పొగలు కక్కుకుంటూ దూసుకుపోతున్నాయి ట్రావెల్స్ బస్సులు.విండోల్లోనుండి బయటకి చూస్తున్న ప్యాసింజర్ల కళ్ళల్లో ఆనందాల భోగిమంటలు!అలా చూస్తూ ఉండగానే కీచుమని శబ్దం చేస్తూ సడెన్ ఆగిందో బస్సు.బస్సు కింద చక్రాలకి కాస్త దూరంలో ఓ బక్కచిక్కిన ముసిలి మనిషి.చావునుండి కొంచెంలో తప్పించుకున్నాడు.మేం ఉలిక్కిపడి తేరుకొనేలోపే బస్సు చుట్టూ మూగేశారు జనం.ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందరితో బాటే మెల్లగా అక్కడికి వెళ్ళాన్నేను.బిచ్చగాడిలా ఉన్నాడు ఆ మనిషి.మురికి పట్టి చివికిపోయిన బట్టలు.నెరిసిపోయి పిచ్చిక గూడులా పెరిగిపోయిన జుట్టూ,గెడ్డం.ఏమీ అర్ధంకానట్టు చుట్టూ చేరిన జనాల్ని పిచ్చి చూపులు చూస్తున్నాడు.ఆ గెడ్డం వాలకం చూస్తుంటే అచ్చు మా చిన్నప్పుడు మాఊరి కోదండ రాములోరి గుడెనకాల ఉండే 'డెక్కలోడు'లానే ఉన్నాడు ఆ మనిషి.ఇలాంటోళ్లని చూసినప్పుడల్లా అప్పటి మాఊరి 'డెక్కలోడే' గుర్తొస్తాడు నాకు ఎందుకనో! ఆ ముసిలాయనకి మోచేతి దగ్గర చీరుకుపోయి రక్తం కారుతుంది. పక్కకి తీసుకుపోయి కూర్చో బెట్టి మంచినీళ్లు పట్టించారు జనం. మోచేతికి ఏదో గుడ్డ కట్టేరు.అతడు కొంచెం తేరుకున్నాక కొన్ని సానుభూతి నిట్టూర్పులు విడిచి,అతడ్ని అక్కడే వదిలేసి ఎవరి మానాన వాలెళ్ళిపోయారు. "బతికిపోయిండు బిడ్డ.ఈ భూమ్మీద జరన్ని నూకలున్నట్టున్నై !"అంటూ గొణుక్కుంటూ మా ముందు నుండి వెళ్లిపోయాడా సెంటర్లో మనిషి. "అదిగో..రోడ్డవతలున్న ఆ షాపింగ్ మాల్ ఒకప్పుడు ఆడిదే.అప్పులైపోయి అమ్మేశాడు.దివాళా తీసేక పెళ్ళాం బిడ్డలు కూడా వదిలేశారు.పిచ్చోడయిపోయాడు పాపం!"ఆ పక్కనున్న ఆయనకి చెబుతున్నాడు ఇంకో ఆసామీ.ఇంతలో మేము ఎక్కాల్సిన బస్సు వొచ్చింది. 'ఒకప్పుడు బాగా బతికిన మనిషిప్పుడు అప్పులు పాలై పిచ్చాడెందుకయిపోయాడో !'అనుకుంటూ భారంగా బస్సెక్కాను. జనాలతో బరువెక్కిన బస్సు మెల్లగా కదిలింది.బరువెక్కిన గుండెతో ఆ బస్సులో ఆలోచనలో కూరుకుపోతూ నేను!

 **** ***** 
ఊరొచ్చి రెండ్రోజులైంది.తెల్లారితే భోగి !సాయం సంధ్య వేళ. వాకిళ్ళలో కళ్ళాపి జల్లి ముగ్గులేస్తున్నారు ఆడోళ్ళు. ఆ ముగ్గులకి రంగులద్దుతున్నారు ఆడపిల్లలు. పిడికెడు డబ్బుల్తో బజారుకెళ్లి,దోసెడు పండగ సరుకులు తెచ్చి అరుగులు మీద ఈసురో మని కూలబడుతున్నారు మొగోళ్ళు. చీకటి చిక్కబడుతుంటే భోగి దుంగల కోసం గుడి సెంటర్లో జమవుతున్నారు కుర్రోళ్ళు. పద్దెనిమిదేళ్ల క్రితం నేను ఊరొదిలి హైదరాబాద్ వెళ్ళిపోయాక చాలా సార్లు ఊరొచ్చినా,సంక్రాంతి పండక్కి రావడం ఇదే తొలిసారి. ఊళ్ళో పండక్కి ఇంతకముందు ఉన్న సందడి లేదు.హరిదాసుల సంకీర్తనలు లేవు.గంగిరెద్దుల గణగణ గంటల చప్పుడూ లేదు. కొత్త అల్లుళ్ళ అలికిడి,పుట్టింటికి వొచ్చిన ఆడపడుచుల సందడి అసలే లేదు.వీధి అరుగుమీద కూర్చుని వీధిలోకి తొంగి చూస్తుంటే ఐదేళ్ల మా తమ్ముడి కూతురు భోగిదండ తీసుకొచ్చి"పెద్దా !చూడు నా దంద ఎంత పెద్దగుందో! "అంది వయ్యారంగా కళ్ళు తిప్పుతూ.దాని హైటులో సగం ఉందది. అప్పట్లో భోగిదండలు గుచ్చడం అంటే ఒక పెద్ద సంబరం మాకు.సంక్రాంతి నెల పడితే చాలు,పిల్లకాయలం అందరూ పొలాల్లో దొరికే ఆవుపేడ కోసం తెగ కుస్తీలు పట్టేవాళ్ళం. పోటీలు పడి పొలాల్లో నుండి తెచ్చిన పేడని నీళ్లతో కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి భోగి పిడకలుగా కొబ్బరి చెట్లకు కొట్టేవాళ్ళం. అవి ఎండే వరకూ పొద్దున్నే లేచి వాటి దగ్గరకి పోయి ఎండినాయో లేవోనని వొత్తి చూడటం రోజువారీ పని అయిపోయేది మాకు. భోగిపిడకలు అన్నీ ఎండినా పిడకల్లో కాస్త పెద్దవైన అమ్మణం ముద్ద,అరటిపండు ఎండే సరికి కొంచె ఎక్కువ రోజులే పట్టేవి. అలా ఎండిన భోగిపిడకల్ని దబ్బనంతో పురికొసలోకి లాగి దండ కట్టాక అది ఎంత ఎత్తుందో చూసుకుని మురిసిపోవడం,వీధిలోకి తెచ్చి "చూశావా.. నా గోపిడకల దండ ఎంత పొడుగుందో!"అంటూ గొప్పలు పోవడం ఎంత సరదాగా ఉండేదో! అప్పట్లో భోగిదండలంటే నాలుగైదు అడుగులకంటే తక్కువ ఉండేవి కావు.భోగి మంటైతే గుడి గోపురాన్ని తాకేటట్టు పైకి లేచేది. **** **** కొంచెం చీకటి చిక్కబడ్డాక,తమ్ముడూ నేను మెల్లగా అడుగులేసుకుంటూ గుడి సెంటర్ లోకి వెళ్ళేము. నాకంటే పెద్దోళ్ళు,నాతో బాటే పుట్టిపెరిగిన నడి వయసున్నోళ్లు నవ్వుతూ పలరించేరు.నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక పుట్టి పెద్దైన కుర్రోళ్ళు నన్ను చూసి చూడనట్టే గమ్మున ఉండిపోయారు. అప్పుడు అర్ధమైంది నాకు,పొట్టకూటి కోసం ఊరిని వదిలేసి టౌన్ కి వెళ్లిపోయిన నన్ను ఇంకొన్నాళ్లయితే ఊరే వదిలేస్తుందని!! "ఏంట్రా ఇంకేం దుంగలు కొట్టుకురాలేదా?యిప్పుడెళ్ళి యెప్పుడుకి ఏత్తార్రా గోమంట?!"అంటూ కుర్రాళ్ళని గదమాయించాడు నా వయసున్న జనార్ధనం. "ఎంతన్నయ్యా..నల్లా నాయుడు గారి పొలంలో ఎప్పుడో కొట్టేసిన కొబ్బరి దుంగలున్నాయి.బాబులుకాపు గారి దిబ్బ మీద ఎండిపోయిన తాటి పట్టెలున్నాయి.ఆటి మద్దిలోకి ఇదిగో మన గుడి ఎనకాల 'కేతా దత్తుడు' గారి డొక్కల గూడూ!" అంటా కిసుక్కున్న నవ్వేశాడు పద్దినిమిదేళ్ళ కుర్రాడు. "ఎండిపోయి చెదట్టేసిన దుంగలు ఎంతకాలం మండతాయేహే!తెల్లారగట్లేస్తే,తెల్లగా వెలుగు రాకుండానే పుసుక్కుమంటాయా పుల్లలు. కొంచెం సేవున్న కర్రలైతే పండగ మూడ్రోజులైనా భగభగలాడతాది మంట"అంటా పెదవి విరిచేడు జనార్ధనం. కుర్రోళ్ళు గమ్మునుండిపోయారు.నేను అప్పుడే రాములోరి గుడి వెనకున్న డొక్కల గూడుకేసి చూశాను. అక్కడే ఉండేది 'డెక్కలోడు'గుడిసె.భోగిమంట కోసం ఆ పక్కనే వేసేవోళ్ళం కాలవ గట్టుమీద నుండి కొట్టుకొచ్చిన బుడ్డముడిసె డొంకల్ని.సంక్రాంతి నెల మొదలు పెట్టినప్పటినుండి సాయంత్రాలు బడి నుండి వొచ్చాక మా మొగ పిల్లలందరికీ కాలవ గట్టుమీదున్న డొంకల్ని కొట్టుకురావడమే పని. పండగ నాటికి అవి ఎండిపోయి ఎంతటి పచ్చి కర్రనైనా పట పటలాడించి మట్టిలో కలిపేసేవి. అదంతా ఒక ఎత్తైతే భోగి ముందు రాత్రి అయితే మాత్రం మేము,మాకంటే కొంచెం పెద్దవయసున్న కుర్రాళ్ళు పడే కష్టం మామూలు కష్టమైతే కాదు.సలసల మరిగే రక్తంతో కొండల్ని సైతం పిండి చేసే వయసది.కుర్రాళ్లతో బాటు ఇంకొంత మంది పెద్దోళ్ళు కూడా జతయ్యేవారు.వాళ్ళతో బాటే మా పిల్ల బ్యాచ్. మొత్తం కలిసి ఓ పదిహేను ఇరవై మందికి తక్కువ కాకుండా ఉండేవాళ్ళం.అలా చీకటిని,రాత్రి కళ్ళకి కాటుకలా దిద్దుకోగానే లంక మీదకి లంఖించిన వానరమూకలా అందరం కలిసి కాల్వగట్టు మీదకి దండెత్తేవాళ్ళం.కాలువ వారగా గట్టు మీద ఏపుగా పెరిగిన మామిడి,నేరేడు,రావి,చింత కొమ్మల్ని కొట్టుకొచ్చేవాళ్ళం. నలుగురు ఐదుగురు పెద్దోళ్ళు కలిపి మొస్తే గానీ లేచేవి కావవి. మాక్కూడా ఒళ్ళు పులిసి పుండై పోయేది అవి మోస్తుంటే! కాల్వగట్టు మీద చెట్లని నరకడం అయిపోయాక తాపీగా పొలాల్లో ఎప్పుడో పడిపోయి ఎండినపోయిన కొబ్బరి,తాటి దుంగల్ని పోగేసేవాళ్ళం.అక్కడక్కడా పొలాల్లో పాకల్లో నిలవబెట్టిన సేవ కర్రల్ని కూడా కొంచెం కొంచెంగా హాంఫట్ చేశేసేవాళ్ళం. కష్టం చేస్తూనే,అర్ధరాత్రి పూట మధ్యలో ఆకలేస్తే పొలాల్లోని కొబ్బరిచెట్ల నుండి కొబ్బరికాయల్ని దింపే వాళ్ళం.ముందుగానే కోంటోళ్ల(కోమటి) వెంకన్నగారి కొట్లోనుండి తెచ్చి పెట్టుకున్న బెల్లమూ,ఆ కొబ్బరికోరు కలిపి కొబ్బరిలౌజు చేసుకునేవాళ్ళం.ఆకలి కడుపుతో వేడివేడిగా పొగలు కక్కుతున్న తియ్యటి కొబ్బరిలౌజుని అరిటాకుల్లో వొడ్డించుకుని ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంటా నోళ్లు చప్పరించుకుంటూ తింటా ఉంటే ఆ మజానే వేరు.కడుపులు నిండిపోయాక రాములోరిగుడి ముందర పోగేసిన దుంగల్ని చదరంగా ఒకదానిమీద ఒకటి పేర్చే వాళ్ళం. వాటి మధ్యలో బొక్కా భీమరాజు గారి గడ్డిమేటులో నుండి నొల్లుకొచ్చిన వొట్టిగడ్డి,ఎండిపోయిన బుడ్డముడిసె కొమ్మల్ని దూర్చి తెల్లారుఝామున తెల్లగా వెలుగు రాకుండానే భోగిమంటని ముట్టించే వాళ్ళం.గుడి గోపురాన్ని తాకేట్టు లేచేది భోగిమంట. మంట ముట్టించి పెద్దోళ్ళు ఇళ్లకెళ్లిపోయాక పిల్ల రాక్షసులమంతా వెలుగొచ్చేలోపు ఏంచేయాలో తోచక ఆ మసక వెల్తుర్లోనే 'డెక్కలోడు'గుడిసె మీద సరదాగా రాళ్ళేసేవాళ్ళం. గుడిసె మీద ఆకుల్ని లాగి తెగ అల్లరి చేసేవాళ్ళం. అప్పుడు మొదలయ్యేది అసలు మజా! 'డెక్కలోడు'బయటకొచ్చి మమ్మల్ని నానా బూతులు తిట్టేవాడు. ఆడి కంటికి కనపడకుండా గుడి పక్కకి పోయి దాక్కునేవాళ్ళం. చప్పుడు చేయకుండా నవ్వుకునే వాళ్ళం.మళ్ళీ మళ్ళీ రాళ్ళేసి ఏడ్పించేవాళ్ళం.మంచో చెడో తెలియని ఆకతాయి వయసది. ఆ రోజొక్కటే అదోరకమైన ఆటవిడుపు మాకు.మిగిలిన రోజుల్లో ఆడి జోలికెళ్ళేవాళ్ళం కాదు.ఆడు మా జోలికొచ్చేవాడు కాదు. ఆ రోజులు వేరే!ఆ మనుషులూ వేరే!!ఇప్పుడా'డెక్కలోడు'లేడు. గుడిగోపురాన్ని తాకేటట్టు భోగి మంటలు లేవు.ఉత్సాహంతో ఊరకలేసే కుర్రోళ్ళు లేరు.తెల్లార్లూ ముగ్గులు పెట్టి మురిసి పోయే ఆడపిల్లలు లేరు. నిజం చెప్పాలంటే అసలు పండగ పండగలానే లేదు. నాకు ఊహ తెలిసేటప్పటికి 'డెక్కలోడు'మా రాములగుడి వెనకాల చిన్న తాటాకు పాకలో ఉండేవోడు.తోడుగా వాళ్ళతమ్ముడు నర్సయ్య కూడా ఉండేటోడు.'డెక్కలోడు' చూడ్డానికి కొంచెం చిత్రీ పట్టిన నల్ల తుమ్మదుంగలా దిట్టంగా ఉంటే,నర్సయ్య చూడ్డానికి ముళ్ల కంచెలు మీద రంగెలిసిపోయిన పాత నూలు చీర ఆరేసినట్టు,దుమ్ములు బయటకి పొడుచుకొచ్చి బక్క పలుచగా ఉండేవోడు. వింటి తాడుని బిగించడానికి వొంచిన విల్లులా కాస్త వొంగి ఉండే ఆ మనిషెప్పుడూ దగ్గుతూనే ఉండేవోడు ఎందుకనో! రోజులోఎప్పుడైనా ఒక్కసారి ఊతకర్ర ఆసరా చేసుకుని గుడెసెలో నుండి బయటికొచ్చేవాడు.ఒక మారు పాక చుట్టూ తిరిగి కాసేపు పాక బయటే నిలబడి ఆనక లోపలికెళ్ళి పడుకునేవాడు. 'డెక్కలోడు'మాత్రం తెల్లారితే కర్ర పోటు వేసుకుంటూ ఊరిమీద పడేవోడు.ఎవరో వొకరు పెట్టే గంజన్నమో,కాసిన్ని పచ్చడి మెతుకులో తెచ్చుకుని తమ్ముడికి కాసింత పెట్టి తనూ కాస్త తినేవోడు. ఆనక గుడిసె ముందు కూర్చుని తెగిపోయిన చెప్పుల్ని సూది దారంతో కుట్టుకుంటూనో,ఊడిపోయిన తడికలకి కట్టడానికి కొబ్బరాకుల చాప అల్లుకుంటూనో కూర్చునేవాడు.అప్పుడప్పుడు మోకాళ్ళ దగ్గర ఏదో ఆకుపసరు పూసుకుని గుడ్డతో కట్టు కట్టుకునేవాడు కానీ మేము అడిగితే మాత్రం అదేంటో చెప్పేవాడు కాదు.ఊళ్ళో అడుక్కోవడానికి తప్ప ఊరి జనాలతో పెద్దగా మాట్లాడని ఆ మనిషి పని చేస్తూనే తనలో తానే ఏదో గొణుక్కునేవాడు.ఎవరికీ అర్ధమయ్యేది కాదు ఆ గొణుగుడు! 
** **
 కుర్రాళ్ళు దుంగలకి కెళ్తుంటే 'ఓరేయ్!ఆ రైతు గారి దొరబాబు పొలంలో ఏలు కూడా ఎట్టకండి.మళ్ళీ కేసులు అయి అంటే ఎవడు పడతాడు ఎదవ సంత !"అని వెనక నుండే గట్టిగా కేకేశాడు జనార్ధనం. "ఏంటీ కేసా?!"కళ్లింత చేసుకుని అడిగేను. "అవున్రా.. కేసే పోలీస్ కేసు!పోయినేడాది చీకట్లో ఆనవాళ్లు తెలీక ఆడి పొలంలో టేకు దుంగనెత్తుకొచ్చేశారు ఈళ్ళు.ఆడు ఒక్కటే ఏడుపు.పోలీస్ కేసు పెట్టేడు.కుర్రాళ్లెవ్వరూ ఊళ్ళో లేరు పోయినేడాది పండక్కి!"అని చిన్నగా నిట్టూర్చాడు జనార్ధనం. 'అలాగైతే డెక్కలోడు ఎన్ని కేసులు పెట్టాలిరా మన మీద! ఇంటి మీద ఆకుల్ని లాగేసి,రాళ్లిసిరేసి డెక్కలోడ్ని,ఆళ్ల తమ్ముడు నరసయ్యని ఎంత విసిగించేసే వాళ్ళం!అప్పట్లో భోగి పండక్కి మనం ఏం అల్లరి పని చేసినా పొలాల్లో రైతులు కూడా చూసి చూడనట్టే ఉండేవారే తప్ప ఏనాడైనా పల్లెత్తు మాటనేవారా మనల్ని?!.ఇలాంటి కేసులవి ఎప్పుడైనా చూశామా మన చిన్నతనంలో!ఎంతైనా మాయామర్మం ఎరగని రోజులురా అవి"అన్నాన్నేను. "నిజమేరా"అంటూ చిన్నగా నిట్టూర్చాడు జనార్ధనం. అప్పటికే జనార్ధనం చెప్పిన మాటలకి తలాడిస్తూ,కుర్రాళ్లంతా భోగి దుంగల కోసం,కత్తీ కటార్లతో చీకట్లో కలిసిపోయారు.తమ్ముడు కూడా వాళ్ళతో బాటే కలిశెల్లేడు. కుర్రోళ్లంతా అటెళ్లగానే నేను ఇంటికొచ్చి అన్నం వడ్డిస్తున్న అమ్మని అడిగేను. "అమ్మా !డెక్కలోడోళ్ళు అసలు పెళ్లి చేసుకోలేదా?!"అని. నా ఊహ తెలిశాక ఆడి గుడిసెలో ఒక్క ఆడమనిషిని కూడా చూడలేదు నేను.అమ్మ భారంగా నిట్టూర్చింది. "అవ్వకేం...అదంతా ఒక పెద్ద కథలే నాయనా!"అని చెప్పడానికి రెడీ అయ్యింది. "ఆడి కథంతా నీకేం తెలుసుగానీ,నేను చెప్తాను ముందు నువ్వు అన్నం తినేసి రారా పెద్దోడా!"అంటా లంక పొగాకు చుట్టని నోట్లో పెట్టుకుంటా గతజ్ఞాపకాల్లోకి ఎల్లిపోయాడు నాన్న.అన్నం తినేశాక నాన్న పక్కన కూర్చున్నాను.నాన్న చెప్పడం మెదలెట్టాడు. "అది పంతొమ్మిదివొందల ఎనభైల్లో తుఫాన్రా పెద్దోడా.నేను పుట్టి పెరిగాక అలాంటి తుఫాను చూళ్ళేదు ఎప్పుడూ! ఇళ్ల పైన తాటాకు కొప్పుల గాల్లోకి లేచిపోయాయి. కొబ్బరి చెట్లు కూకటి వేళ్ళతో నేలకి వొరిగిపోయి అరటితోటలన్నీ కచ్చా పచ్చా అయిపోయాయి.పొలాల్లో పాకలు కూలిపోతే గేదెల్ని తోలుకొద్దారని వానకి తడవకుండా నెత్తి మీదనుండి గోనే పట్టాలు కప్పుకుని మీ పెద్దబాబు,నేను పొలం దారిగట్టు అట్టుకుని ఎల్తుంటే 'గుయ్యో' మని ఒకటే గాలి వర్షమూ.దారికి అడ్డంగా పడిపోయిన చెట్లూ,కట్లు తెగిపోయిన బోదె గట్లు!ఎలాగోలా ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గేదెల్ని తోలుకొచ్చి లాకు మొండిలో ఉన్న గవర్నమెంటోళ్ళ షెడ్డుల్లో కట్టేసి వొత్తుంటే,మన ఇంటికొచ్చే పుంత దారిలో ఉన్న ముత్తాతల కాలంనాటి రావి చెట్టు దారికడ్డంగా పడిపోయింది. అప్పుడే అనుకున్నాను,మీ తాతోళ్లు ఉమ్మట్లో ఉన్నప్పుడు కట్టిన ఐదు పోర్షన్ల మట్టి అరుగుల తాటాకిళ్లు మట్టిలో కలిసిపోయి వుంటాదని!ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చి గుడిసెంటర్లో నుండి ఆ ఇంటి వైపు సూత్తే గోడలు కూలిపోయి,ఆ పైన తాటాకుల కొప్పు దబ్బిడి పడిపోయి కనిపించిందా మట్టిఇల్లు.నాలుగు కుటుంబాల జనం పిల్లా పీచు మొత్తం కలిపి పదిహేను మంది దాకా ఉండేవాళ్ళం ఆ ఇంట్లో ! అప్పటికి నీకు మూడో యేడు.మీ పెద్ద బాబుకి నాకు గూండాగిపోయినట్టపించింది.ఇంటి ముందు నిలబడి మేమిద్దరం నెత్తి నోరు బాదుకుంటే లోపలనుండి కిక్కురు మనలేదు ఒక్కరూ! అప్పుడు ఇనిపించింది రాములోరి గుడెనకాల ఉండే గోవిందరాజుల ఇంట్లోనుండి పొలికేక. "ఓరేయ్ సత్తెం..మీ వోళ్ళంతా మా ఇంట్లోనే ఉన్నారే హే! బేగి ఇటొచ్చేయండి.మీ వాకట్లో ఆ గంగాబోండాల చెట్టు పిచ్చెక్కినట్టు ఊగుతావుంది!"అంటా గట్టిగా కేకేశాడు గోవిందరాజులు. అప్పుడు ప్రాణం లేచొచ్చింది మాకు.గబగబా గుడెనకాల ఉన్న ఆడింటికి ఎల్తే ఇంటినిండా బిలబిల్లాడతా ఉన్నారు మన పాలెం జనం. పాలెం మొత్తానికి ఆడిది,దూళ్ల యాపారం చేసే బుల్రాజుది మాత్రమే సిమెంటు గోడలున్న బంగాళాపెంకుటిళ్లు.తుఫానుకి పెంకులు కొన్ని పైకి లేచిపోయినా ఇళ్లు రెండూ మాత్రం నిట్రాడుల్లా అలాగే నిలబడిపోయాయి.ఆ మర్నాటికి తుఫాన్ ఎలిసిపోయింది గానీ ఊరు మాత్రం ఇంచుమించుగా కుప్పకూలిపోయింది. తుఫాన్ కి పడిపోయిన ఇళ్ళని నిలబెట్టుకునే దాకా ఆ రాములోరి గుడి అరుగు,ఆ రెండు పెంకిటిళ్లే ఆసరా అయ్యేయి పాలెం జనాలకి.గోవింద రోజులైతే గాదెలో ధాన్యం తియ్యించి మూడు రోజుల పాటు,రెండు పూట్ల బోయినాల ఏర్పాట్లు అయి దగ్గరుండి తానే చేయించేవోడు.ఆళ్లావిడ కనకలక్ష్మి అయితే పిల్లలకి కావాల్సిన పాలు,నీళ్ల ఏర్పాట్లు సూసుకునేది.ఊళ్ళో జనం చేతులెత్తి మొక్కేవాళ్ళు ఆళ్ళిద్దరికి.గోవిందరాజులుకి ఇష్టముండేవి కావు ఆ పొగడ్తలు.కష్టం లో ఉన్నోడికి పావలా రూపాయి సాయం చేసేవోడు. తిరిగిస్తే తీసుకునేవోడు లేదంటే లేదు.గోవిందరాజులుకి ఐదెకరాల కొబ్బరితోట మూడెకరాల ఊడ్పుచేను ఉండేది.మన పాలెంలో అప్పట్లో కాస్తొకూస్తో డబ్బున్నవోడు కూడా ఆడే.యెగసాయంతో బాటే అంబాజీపేట సంతలో కొబ్బరికాయ ఏపారం చేసేవోడు ఆ మనిషి. చేతినిండా బోలెడు డబ్బు,చేతికి నాలుగు ఉంగరాలు.మెళ్ళో పులిగోరు గొలుసు.మనిషి నల్లగా ఉన్నా,కళ అయిన మొఖంతో టేకుదుంగలా పిటపిటలాడే చెయ్యెత్తరి విగ్రహం. చెబితే నమ్మవుగానీ పెద్దోడా!తుఫాన్ కి కొబ్బరితోటలు దెబ్బ తినేశాక కొబ్బరికాయ రేటు అమాంతంగా పెరిగిపోయింది. ఆ దెబ్బతో గోవిందరాజులు తుఫాన్ కి ముందు అటకమీద,పొలంలో పెంకుటిశాలలో నిలవ గట్టిన కొబ్బరికాయకి మంచి రేటొచ్చింది. ఆ మిగులు డబ్బుతోనే ఆ టైమ్ లో ఆ పక్కనే ఉన్న బండార్లంకలో చిన్నగా బట్టలషాపు కూడా తెరిచేడు.కొన్నాళ్ళకి ఆ షాపు పెద్దదైంది.ఎప్పుడూ నలుగురైదుగురు పనోళ్ళు ఉండేవారు షాపులో.అదే కాకుండా కొద్దోగొప్పో డబ్బులు అనపర్తి రెడ్ల దగ్గర తక్కువ వడ్డీకి తెచ్చి బయట జనాల ఇచ్చి వడ్డీ యాపారం కూడా మొదలెట్టాడు.ద్వారపూడి,బెజవాడ సంతల కెళ్లి టోకుధరల్లో బట్టలు తెచ్చి బండార్లంక షాపులో అమ్మేవోడు. అలా బట్టల కోసం గోవిందరాజులు ద్వారపూడి సంతకెళ్లినప్పుడు జరిగిందో విచిత్రం!! ఎవరో భోగమోళ్ళ పిల్లంట.ఒక రోజు ఇంటికి తీసుకొచ్చేడు. దారి తప్పిపోయి బెదిరిచూపులు చూత్తుంటే ఆ బాధ చూళ్లేక ఇంటికి తీసుకొచ్చేనని ఊళ్ళో జనాలకి చెప్పేడు.ఆ పిల్లకి ఓ పాతికదాతుంటది వయసు.పాల నురుగ తెలుపు.గోవింద రాజులాగానే చెయ్యెత్తరి మనిషి.కళ అయిన మొఖమూ.ఊళ్ళో కుర్రోళ్ళంతా గుడి సెంటర్లోనే తిరిగేవారెప్పుడూ,ఆ పిల్ల కళ్ళల్లో పడాలని! పగలల్లా ఇంట్లో నుండి బయటకొచ్చేది కాదు ఆ పిల్ల. రాత్రిళ్ళు మాత్రం అరుగు మీద పడకకూర్చీలో కూర్చుని వయ్యారంగా కాళ్ళు ఊపతా ఉండేది.బాగా చీకటి పడ్డాక ఆ ఇంటి ముందునుండి ఎల్తే మొఖానికి గుప్పున కొట్టేది సన్నజాజుల అత్తరువాసన! ఆ పిల్లొచ్చిన కాన్నించి రోజూ గొడవే గోవిందరాజులు ఇంట్లో. కనకలక్ష్మి చాలా కాలం ఓపిక పట్టింది చాన్నాళ్లు! అలా గొడవ పడిపడీ కొన్నాళ్ళకి విసుగొచ్చి ఓరోజు తెల్లారగట్ల చెప్పాపెట్టకుండా పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది.అలా ఎళ్లిన మనిషి మళ్ళీ రాలేదు ఊళ్లోకి.కనకలక్ష్మి ఎల్లిపోయాక ఆ భోగమోళ్ళ పిల్లతోనే ఉండేవాడు గోవిందరాజులు. అంతకుముందెప్పుడూ మందలవాటు లేని గోవిందరాజులకి మెల్లగా మందు అలవాటైంది.ఆ పిల్లక్కూడా మందు అలవాటు చేసేడు. మందు తాగాక ఆళ్ళిద్దరూ కాసేపు సరసాలాడుకుని,నిషా బాగా తలకెక్కాక జుట్టూ జుట్టు పట్టుకుని కొట్టుకు సచ్చేవోళ్ళు. కనకలక్ష్మి ఉండగా చీమ కూడా చిటుక్కుమనని ఆ కొంపలో,ప్రతీ రోజూ చీకటి పడితే చాలు అంబాజీపేట 'దూళ్లసంత' అయిపోయేది ఆ ఇల్లు. గోవిందరాజులు మెల్లగా 'గురివింద రాజ'యిపోయాడు. పగలు రాత్రి లేకుండా తాగడం మొదలెట్టేసాడు.ఏపారాలు చేతికిందున్న కుర్రోళ్ళకి అప్పగించేసాడు.ఆ దెబ్బకి యేపారలు ఏటి పాలైపోయాయి.గోవిందరాజుల్ని లోకువ కట్టేసి వడ్డీకి డబ్బులు తీసుకున్న జనాలు మెల్లగా ఎదురు తిరిగి బాకీలు ఎగ్గొట్టేశారు. అనపర్తి రెడ్లు గోవిందరాజుల జుట్టు పట్టుకున్నారు.నిల్వ పెట్టిన కొబ్బరికాయ రేటు ఢమాల్ మని పడిపోయి బోలెడు నష్టమొచ్చేసింది. బట్టలేపారం మట్టికొట్టుకుపోయి అప్పుల్ని మిగిల్చింది. ఒకప్పుడు చానా గొప్పగా బతికిన గోవిందరాజులు ఎక్కడో ఏసిన తప్పటడుగే చివరాఖరికి ఆడ్ని నడి వీధిలో కట్టు బట్టల్తో నిలబెట్టేసింది.అప్పుల్ని తీర్చడానికి ఉప్పుకీ,ఊరగాయకి పొలాలు అమ్మేశాడు.అమ్మేసిన డబ్బుల్తో ఉన్న బాకీల్ని తీర్చేసి,ఉన్నంతలో ఎలాగోలా బతుకుదామనుకునే మనిషికి ఇంకో షాకు తగిలింది. ఈడితో లాభం లేదనుకుందేమో ఇంట్లో కొద్దోగొప్పో ఉన్న నగానట్రా పట్టుకుని ఆ భోగమోళ్ళ పిల్ల రాత్రికి రాత్రే ఎక్కడికో చెక్కేసింది. ఆ పిల్ల ఎల్లిపోయాక గోవింద రాజులు మరింత పిచ్చోడై పోయేడు.మళ్ళీ అయినకాడికి అప్పులు చేసి తాగేసి చివరాఖరికి కష్టకాలమప్పుడు పది మందికి నీడనిచ్చిన ఆ బంగాళాపెంకుటిళ్లు ని కూడా అమ్మేశాడు.ఆ భోగమోళ్ళ పిల్ల అలా ఎల్లిపోయిన కొన్నాళ్ళకి ఆళ్ల పెద్దోళ్ళొచ్చేరు.ఎంక్వయిరీ చెత్తే ఇక్కడే ఉందని తెలిసి వచ్చేరంట.ఆల్లొచ్చేసరికి ఆ పిల్ల లేకపోయేసరికి 'పిల్లని ఏం చేశావో చెప్పమని' చెప్పి గోవింద రాజుల్ని మెత్తగా చిదగ్గొట్టేసి,కాళ్ళు రెండూ ఇరగ్గొట్టేసారు ఆళ్ళు.ఊరోళ్లు అడ్డు ఎలితే 'ఆళ్ల పిల్లని చంపేశారని' ఊరోళ్లందరి మీద పోలీస్ కేసు పెడతామని బెదిరించారు. ఆ ఇరిగిపోయిన ఆ కాళ్ళకి అక్కడా ఇక్కడా ఏవో కట్లు ఎయిస్తే కాళ్ళు రెండూ అతుక్కున్నాయి కానీ ఆటి వొంకర మాత్రం ఆడు సచ్చేవరకూ పోలేదురా పెద్దోడా!"నాన్న చెప్పడం ఆపి ఓ సారి గుండెల నిండా గాలి పీల్చుకుని వొదిలి ఆరిపోతున్న లంక పొగాకు చుట్టని మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు.ఒక దమ్ము లాగి గుప్పుమని పొగ వదిలాడు. "నాన్న నేను డెక్కలోడు గురించి అడిగితే గోవిందరాజుల కథ చెప్తావేంటి?!"కాస్త అసహనంగా ముఖం చిట్లించాను నేను. నాన్న నా వంక తమాషాగా చూసేడు. "ఆ గోవిందరాజులే నువ్వడిగిన డెక్కలోడు రా!" ఏదో రహస్యం గుట్టు విప్పినట్టు దిలాసాగా నవ్వేడు నాన్న. "మరి ఆళ్ల తమ్ముడు లేడేంటి ఈ కథలో?!"అని ఆరా తీశాను. "అదా!ఆడిదో వెరైటీ కథలే.గోవింద రాజులు చితికిపోకముందు,ఇంకేదో సంపాదించేద్దామని పెళ్లి చేసుకోకుండా రంగం(రంగూన్)ఎళ్లేడు నర్సయ్యగాడు.అక్కడ సంపాదించింన డబ్బంతా తిరుగు ప్రయాణంలో ఓడలోనే పోగొట్టుకుని వొట్టి చేతుల్తో ఐదేళ్ల తరవాత ఊళ్లోకి అడుగెట్టాడు ఆ మనిషి.అప్పటికే ఈ గోవిందరాజులు మొత్తం ఆరిపోయేడు.అసలు అన్నెం చేసాడో చూడని కళ్ళతో అన్న చెప్పిందంతా నిజమేనని నమ్మి, అన్నని ఏమాత్రం తప్పు పట్టలేదు. గోవిందరాజులు చితికి పోవడానికి ఆడోళ్ళే కారణమని బలంగా అనుకున్న ఆడు జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే 'బెమ్మసారి'గా ఉండిపోయాడు. బలం ఉన్నంత కాలం చిన్నాచితకా పనులు చేసుకుంటా కాళ్ళు రెండూ ఇరిగిపోయి మంచాన పడ్డ గోవిందరాజుల్ని చూసుకుంటా ఆమ్మేసిన ఆ ఇంట్లోనే అద్దెకి ఉంటా బతికేశాడు నర్సయ్య. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా పెద్దోడా! కొంచెం వయసు మీద పడ్డాక ఆడిక్కూడా చిన్నప్పుడు నుండి ఉన్న ఉబ్బస రోగం ఉన్నట్టుండి బలంగా తిరగబెట్టేసింది.మంచం పట్టేశాడు ఆ బక్కపల్చటి మనిషి. అప్పుడు తగని తప్పని పరిస్థితిలో 'గోవిందరాజులు' బయటికి రాక తప్పలేదు. అవిటి కాళ్ళకి ఊత కర్రని ఆసరా చేసుకుని డెక్కుకుంటూ ఊరంతా తిరిగేవాడు.మాకందరికి కష్టంలో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆదుకున్న గోవిందరాజులే,తెలిసో తెలియకో ఏసిన తప్పటడుక్కి బతుకు రోడ్డుపాలైపోయి పిడికెడు మెతుకులు కోసం చిప్ప చేతబట్టుకుని డెక్కుకుంటూ ఊరంతా తిరిగేసరికి గతం తెలియని మీలాంటి పిల్లోళ్లందరికీ ఆడు 'డెక్కలోడు'అయ్యాడ్రా!" అంటున్న నాన్న గొంతు గాద్గధికమై కళ్ళల్లో అప్రయత్నంగానే కన్నీళ్లు తిరిగాయి.అమ్మ నాన్న చేతికి మంచి నీళ్ల గ్లాసు అందించింది. "చివరాఖరి దశలో రాబడి అంతగా లేక అద్దె కట్టలేని ఆళ్ళని,ఇల్లు కొనుకున్న బుల్రాజు నిర్ధాక్షిణ్యంగా బయటికి ఈడ్చేస్తే,ఊరోళ్లంతా కలిసి అదిగో ఆ రాములోరి గుడికి,ఆళ్ళింటికి మధ్యలో ఉన్న ఆ కూసింత దేవుడి మాన్యంలో కత్తెరపాక ఏసి కాస్త నీడనిచ్చార్రా. ప్రతీ రోజూ ఊరోlళ్లమంతా ఓ పండో ఫలమో,కాసిన్ని పచ్చడి మెతుకులో ఆళ్ళకి పెట్టి,గోవిందరాజులు బాగున్నప్పుడు చేసిన కొద్దోగొప్పో సాయానికి కొంచెమైనా ఋణం తీర్చుకునేవాళ్ళం పెద్దోడా! గతంలో జరిగినదానికి మనసు విరిగిపోయి కొంచెం మతి చెదిరిపోయి,గతం తలుచుకుంటూ తన గుడిసె ముందే ఏదో గొణుక్కుంటూ ఉండేవోడు ఆ గోవిందరాజులు!అన్నానికి తప్ప ఇంకో మాట కోసం నోరెత్తెని ఆ మనిషి,ఎవరైనా పలకరిస్తే పలికేవోడు లేదంటే లేదు.కష్టమొచ్చినా కన్నీళ్లు వొచ్చినా ఆ అన్నదమ్ములు ఇద్దరే ఒకరికి వొకరు తోడుగా ఉండేవాళ్ళు తప్ప ఇంకొకలికి చెప్పేవాళ్ళు కాదు.చివరాఖరికి చావులో కూడా ఆ ఇద్దరూ కలిసే పోయారు.ఆళ్ళిద్దరూ ఓ శీతాకాలం నాడు ఒకరు తరవాత ఒకరు రెండ్రోజుల తేడాలో సచ్చిపొతే,కర్మ కాండలు అవి ఊరోళ్ళే చేసేరు.ఆళ్ళు పోయాక ఆళ్ల జ్ఞాపకాల్ని మనసులో పెట్టుకుని, ఇదిగో ఇలా అప్పుడప్పుడు తలుచుకోవడం తప్ప ఇంకేం చేయగలం చెప్పు పెద్దోడా?!"అనేసి భారంగా నిట్టూర్చింది అమ్మ.డెక్కలోడి కథ విన్నాక పగిలి పదిముక్కలైన అద్దమైపోయింది మనసు. "మనది పల్లె కాబట్టి బ్రతికుండగా కొంచెం కూడు,గూడు దొరికింది ఆళ్ళకి. మీ హైదరాబాదూ,తమ్ముడోళ్ళు ఉండే వైజాగుల్లో కూడా ఇలాంటోళ్ళు చానా మందే ఉంటారంట కదరా.మరి ఆళ్ళని ఎవరు సూత్తార్రా పెద్దోడా?!" అనడిగేడు నాన్న.నేనేం మాట్లాడకుండా గమ్మునుండిపోయాను.మొన్న బస్సు కింద పడబోయి అదృష్టం కొద్దీ తప్పించుకున్న ముసిలోడే నాకళ్ళ ముందు కదిలేడు. హైదరాబాదూ, వైజాగుల్లోనే అనే కాదు చాలా నగరాల్లో బ్రతికి చెడ్డ ఇలాంటి అభాగ్యులు ఎందరో ఉంటారు.బస్టాపుల్లో, ఫుట్ పాతుల మీద మురికి పట్టి చిరిగిన బట్టలతో తమలో తామే ఏదో గొణుక్కుంటూ సణుక్కుంటూ తిరుగుతూనే ఉంటారు.వీళ్లంతా మనసు విరిగిన మనుషులు.విధి చిన్న చూపు చూసిన నిర్భాగ్యులు.ఏ కాలో,చెయ్యో విరిగితే అతుకుతుందేమో కానీ,మనసు విరిగితే మాత్రం అతుక్కోవడం కష్టం.వాళ్ళల్లో జీవితంలో తెలిసో తెలియకో వేసిన తప్పటడుక్కి బ్రతుకు గాడి తప్పిన వాళ్ళు కొందరైతే,నమ్మిన వాళ్లే నట్టేట ముంచేస్తే మనసు గతి తప్పి పిచ్చోళ్ళయిన వాళ్ళు ఇంకొందరు. అలా మనస్సు విరిగి మతి చెదిరిన మనుషులు ఎందరో నగరం రోడ్ల మీద! ఆకలి వేస్తే చెయ్యి చాసి అడుక్కోడమో,అదీ చేత కాక పోతే డస్ట్ బిన్నుల్లో ఎంగిలి మెతుకుల కోసం వెతుక్కోవడమో తప్ప ఇంకేం చేత కాదు వాళ్ళకి. నాన్న అడిగినట్టు,నగరాల్లో అలాంటి వాళ్ళని ఆదుకునే ఆపన్నహస్తాలు ఎన్ని ఉంటాయో?! అక్కున చేర్చుకునే మహానుభావులు ఎంతమంది ఉంటారో?!! నిద్రపోదామని మంచం మీదైతే నడుం వాల్చాను గానీ కంటిమీదకి కునుకు మాత్రం రాలేదు నాకు.అమ్మా నానోళ్లు చెప్పిన గోవిందరాజుల ' కథ విన్నాక,తెల్లారితే రాములోరి గుడి ముందు వేయాల్సిన 'భోగిమంట'నాగుండెలోనే వేసినట్టు గుండెంతా భగభగలాడతా ఉంది. ఆ మంట ఎప్పటికి చల్లారేనో!ఏమీ చేస్తే నగరాల్లో 'డెక్కలోడు' 'నర్సయ్య' లాంటి ఎందరో అభాగ్యుల బ్రతుకుల్లో వెలుగుపువ్వులు విరిచేనో!!

6, మే 2020, బుధవారం

#సరికొత్త వేకువ కోసం.. !#

లాక్ డౌన్ అంటూ సర్కారు
బ్రతుకు బండికి బ్రేకులు వేసింది.
ఇంట్లో నిత్యావసర సరుకులు
ఒక్కొక్కటిగా నిండుకుంటున్నాయి.
కళ్లల్లో ఉప్పు సముద్రాలు
ఊరుతున్నాయి.

వీధిలోకొచ్చిన మామిడిపళ్ళ
బుట్టని చూసి మా పెద్దది
పెదాల్ని చప్పరిస్తుంది.
ఆ పిల్లని  ఆ ధ్యాస నుండి
మెల్లగాతప్పించి మెప్పించాలంటే..
కత్తి మొన మీద కాలి బొటన వేలు
మోపి కర్ర సాము చేయడమే.
ఈ యేడాది మామిడి రుచి చూసే
యోగం  దానికి లేనట్టేనని
ఎలాగోలా చెప్పేయాలి.

బిల్లు కట్టలేదని కేబుల్ ఆపరేటర్
మా మాటల డబ్బా..
గొంతునొక్కేసి చాలా రోజులైంది.
ఇంటెడు చాకిరీ చేసి ఏ సాయం
సంధ్యలోనో.. ధారావాహికల్ని
తింటూ తాగుతూ ఒక  రకమైన
మత్తులో తూగే..మా ఇంటావిడకి
ఇప్పుడా ధ్యాసలేదు.

పాలు కారని  రొమ్ముని
పసోడి పెదాలికి తాకించి
కడుపు సగమే నిండి అర్ధాకలితో
ఈడ్చుకుపోయిన ఆ పిల్లాడి
పొట్టని సవరదీస్తూ..
బిక్క సచ్చిపోయి ఎటో దిక్కులు చూస్తోంది.

డబ్బా పాలకి అలవాటు పడ్డ
ఏడాదిన్నర పసోడు..
ఏడ్చే ఓపిక కూడా
లేక వాళ్ళమ్మ వొడిలో..
నిస్సత్తువగా  కదులుతున్నాడు.

పొద్దు పొడవక ముందే  తెచ్చిన
చిన్న పాల ప్యాకెట్, అర డబ్బానే
నిండి..పొద్దు ఇంకి పోకముందే నిండుకుంది.
పటిక బెల్లం నీళ్లు కలిపో..
వొట్టి పోయిన రొమ్ముల్ని
పెదాలకు కరిపించో..
పిల్లాడ్ని మాయ చేస్తే మాత్రం..
నిజం యెరిగిన వాడి
ఆకలి పేగు గమ్మున
ఊరుకుంటుందా?!
ఆ  అమ్మ కళ్ళల్లోని 'చెమ్మ'
ఆ పసోడి పెదాలని ఎంత సేపని
తడారిపోకుండా ఉంచగలదు.?!

ముతక బియ్యపు అన్నం
పంటి క్రిందపోతక చెక్కలా
నలుగుతుంటే..
పట్నం వొచ్చాక సన్న బియ్యపు
నాజూకు తనానికి అలవాటు పడ్డ
నా నాలుక..ఇష్టం లేనట్టుగా
కదులుతుంది.

చారులో అదే అన్నం మెత్తగా
పిసికి పెడితే తేడా తెలియని పెద్దది
అదే అమృతం అనుకుని
ఆబగా తినేస్తుంది..
చూసే కళ్ళని బట్టే ఉంటుంది ఏదైనా!

ఏ చేయూత లేని నా 'బడుగు బ్రతుకు'
క్షణ క్షణం   భయంతో
బిక్క సచ్చిపోతూంది...
సర్కారోళ్ళు దొడ్డ  మనసుతో
చేసే సాయం..ఆపద్ధర్మం గా
నా చేతుల్లో పెట్టడానికి
నేనిక్కడ మొలిచిన
'కార్డు దారుణ్ణి  'కాదు.
పొట్ట చేతపట్టుకుని పక్క రాష్ర్టం
నుండి  అన్నమో రామచంద్రా..
అంటూ తరలి వొచ్చిన 'వలసజీవి'ని!

నా జేబులోనుండి ఒక్కొక్కటే
జారిపోతున్న  చిల్లర పైసలు..
ఎప్పుడూలేంది ఇప్పుడు  యముడి
మహిషం మెడలోని మృత్యు గంటల్లాగా..
ఘల్లు ఘల్లున మోగుతున్నాయి.
ఆ చిల్లర  కాస్త చెదిరిపోతే ..
బియ్యంసంచి లోని  ఆ కాసిన్ని
గింజలు కాస్త నిండు కుంటే..
చివరాఖరికి చేసేదేంలేదింక !

మా దిగువ మధ్యతరగతి అభిమానాన్ని
నాలుగు రోడ్లు కూడలికి తాకట్టు
పెట్టి ఏ దాతో దాతృత్వంతో
విసిరే నాలుగు మెతుకులు
కోసం రోడ్డు పక్కన కాపు కాయాల్సిందే!

అంతకంటే ఇంకేం  చేస్తాం..
బ్రతికి బట్ట కట్టడానికి
అక్కరకు రాని 'ఆత్మాభిమానం'
ఉంటేనేం?! ఊడితేనేం..
చూస్తూ చూస్తూ అర్థం లేని
విలువలు కోసం ఆత్మ బలిదానం
చేసుకోలేం కదా..!
కనీసం బ్రతుకి ఉంటేనే  చాలిప్పుడు,
పనికి రాని విలువలన్నింటిని..
మడిచి ముడ్డికింద పెట్టెయడమే
సబబు.

మళ్ళీ మనందరికీ మంచి
రోజులొస్తాయ్..
విశృంఖల జీవన విధానానికి
స్వస్తి పలికి..
అణువణువునా మానవత్వం
పరిమళిస్తూ...
మన బ్రతుకులకో కొత్త అర్ధాన్ని
తెలియజెప్పే ..
సరికొత్త ఉషోదయ కిరణాలు
గడప గడపని ముద్దాడతాయ్. !!

అప్పటి దాకా
కన్నీటితోనే  కడుపు నింపుకుని...
మనసు నిండా కొత్త ఆశల్ని ఒంపుకుని..
కరోనా రహిత సరికొత్త ప్రపంచం
కోసం సప్త వర్ణాల కలలు కందాం!
భౌతికంగా ఎడమవుతూ..
మనో నిబ్బరంతో  కలిసికట్టుగా..
పోరాడదాం !!

శ్రీను. కుడుపూడి 🌷

1, ఫిబ్రవరి 2020, శనివారం

అ(త్త)మ్మ .

అమ్మ నాన్నోళ్లు పెద్దోళ్ళు అయిపోయారు. మేమేమో పొట్ట చేతపట్టుకుని నగరానికి వలసోచ్చేసాం.కడుపులో నొప్పొచ్చినా కళ్ళు బైర్లు కమ్మినా వాళ్ళని అక్కున చేర్చుకునేదెవరు? మా అదృష్టం బాగుండి మా చిన్నాన్న కొడుకులు చేదోడు వాదోడు గా ఉంటున్నారు. వాళ్ళు మాత్రం ఎంత కాలం సాయం గా ఉండగలరు. వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా. మేమే అక్కడికి వెళ్లి ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి.ఇలాగే..  మాలాగే చాలా మంది. దగ్గర్లో ఉన్న అక్కో చెల్లో వాళ్ళకి బాలేనపుడు నాల్రోజులు వాళ్ళ దగ్గర ఉండి వస్తుంది. ఎక్కువ రోజులు ఉన్నా బావ ఒప్పుకోడు కదా. మా  బావే కాదు చాలా మంది బావగార్లు అందుకు సమ్మతించరు." ఏం మీ మరదళ్ళు (కోడళ్ళు )లేరా.. మీ అమ్మ కి చేయడానికి "అని అనేస్తారు పుసుక్కున!పాపం కోడళ్ళకేమో బోలెడు కష్టాలు. అత్తామామగార్లని పట్టించుకునే తీరిక ఓపిక  ఎక్కడిది?!ఎక్కువ రోజులు ఊర్లో  ఉంటే  సిటీ లో 'మా పిల్లల చదువులు ఏమైపోవాలి 'అనో..నేను అక్కడే ఉండిపోతే 'మీ మంచి చెడు ఎవరు చూస్తారు' అంటూనో  మగాళ్ళవైపు నుండి నరుక్కొస్తారు.నిజానికి  అసలు సంగతి అది కాదు అని వాళ్ళకి కూడా తెలుసు. ఏదో మొహమాటానికి నాల్రోజులు అత్తింట్లో ఉన్నా, ఇంకో నాల్రోజులు పుట్టింటిలో ఉంటే బాగుణ్ణు అనుకునే మనస్తత్వాలు ఐపోయే... ఈ కాలం లోనే ఇలాగున్నారో తరతరాలుగా కోడళ్ళంతా ఇంతేనేమో అర్ధం కాదు. ఇవాళ్టి కోడలే రేపటి అత్తగారు అవ్వాల్సివస్తుంది అన్న ఎరుక వీళ్ళకి తెలీకనా? !ఏది ఏమైనా కూతుర్లంత ఆపేక్ష గా కోడళ్ళు (అందరూ కాదు )చూడరు అన్నది మాత్రం పరమ సత్యం. కోడళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో.. అమ్మ కి, "అత్త"మ్మ కి మద్య  రెండు అక్షరాలు మాత్రమే అంతరం అని !కూతుర్లకి ఎప్పుడు తెలుస్తుందో పుట్టింట్లో ఆపేక్ష అత్తింట్లోనూ చూపించాలని 😊. మనసు కాస్త విశాలం చేసుకుని చూస్తే అత్త కూడా 'అమ్మే' అని !!🙏

నాన్న ఇచ్చిన ఆస్తి.

మా నాన్న పీచుమిఠాయి అమ్మకముందు, నాలాగే ఓ పేద్ద ధియేటర్ లో ఓ చిన్న ఉద్యోగం చేసేవారు. గేట్ కీపర్ ! (He is equal to wicketkeeper Ms Dhoni 😊).ఆయన అనుమతి లేనిదే చిన్న ఈగ కూడా లోపలికి ఎంటరయ్యేది కాదంట. ఆ మాట కుడా మా నాన్న మీసం మెలేసి చెబుతాడు. అలా ఉద్యోగం చేస్తూనే.. వచ్చి పోయే సినిమాలన్నీ ఒకటికి పది సార్లు చూసేవాడు. రాత్రికి ఇంటికొచ్చాక, నేను నాన్న పక్కలోకి  
దూరి కథలు చెప్పమని సతాయిస్తుంటే..అప్పుడు మొదలెట్టేవాడు కథలు..అనగనగా ఒక రాజుగారుండేవారు.. అంటూ అయన చూసిన జానపద  సినెమాలన్నింటిని ఒక్కొక్క కథగా చెబుతూ నన్ను నిద్రపుచ్చేవాడు. అవి వింటూ మా నాన్నకి ఎన్ని కథలొచ్చో అని అబ్బుర పడిపోయేవాడ్ని. అప్పుడు నాకు తెలియదు అవి సినిమా కథలని !కొంచెం వయసొచ్చాక.. ఏ దూరదర్శన్ లోనో.. వీధి తెరమీదనో.. ఒక 'భక్త ప్రహ్లాద' నో 'ధాన వీర శూర కర్ణ'నో చూసినప్పుడు- "ఓర్నీ తస్సాదియ్యా.. ఇదా అసలు సంగతి" అనుకునేవాడిని.ఏది ఏమైనా మా నాన్న కి కథలు చెప్పడం వచ్చు.దాని వల్ల  నాకు కథలు వినడం.. దానితో పాటే నేను కుడా కథకుడ్ని కావాలన్న ద్యాస వచ్చింది. నా సంగతి ఇలా ఉంటే,నా కంటే పదేళ్లు వెనకపుట్టిన మా తమ్ముడైతే.. అసలు కథలు చెప్పమని అడిగేవాడే కాదు. ఎందుకంటే వాడు కథలు వినే టైపు కాదు.. కథలు చెప్పేరకం 😋.వాడు పుట్టుకతోనే పెద్ద కథకుడు. 😂.అలా కొన్నాళ్ళు పాటు ఒకరి కింద కష్టం చేసిన మా నాన్న, ఏదో ఒక విషయం లో చేయని తప్పుకి మాట పడి.. ఈ జన్మలో ఇంకొకడి కింద పనిచేయనని ఒట్టేసుకున్నాడు.. అయినా నా కథా కాలక్షేపం ఆగిపోలేదు. పేపర్లకి పాత ఇనప సామాన్లకి పీచు మిఠాయి అమ్మే మా నాన్న...  పాత పేపర్ల తో పాటే వచ్చే కథల పుస్తకాల్ని అమ్మితే పావలా వస్తుందని తెలిసి కుడా అమ్మకుండా నా కోసం ఇంటికి తెచ్చేవాడు. ఆ పుస్తకాలతోటే నాకు మెల్లగా ప్రపంచాన్ని చదవడం అలవాటైంది. ఎంత కష్టం లో అయినా గుండె నిబ్బరం గా ఉండటం తెలిసింది. ఏ నాన్న అయినా ఇంతకంటే గొప్ప ఆస్తి ఇంకేం ఇస్తారు చెప్పండి 👍

31, జనవరి 2020, శుక్రవారం

బైరాగి

వొళ్ళంతా బూడిద పూసుకుని
ఎవర్నో వెతుకులాడుతూ  తిరిగే బైరాగిలా
చూపుల్ని శున్యం లోకి వేలాడదీసి
జనారణ్యంలో వైరాగ్యంతో
తిరుగడుతుంటాను నేను..
ఏదో సాధించానని విర్ర వీగే వాళ్ళని చూస్తే
యేమి అనిపించదు నాకు..
 అసలేం సాధించారని !?

ఆమె స్పర్శ సైతం పులకింతలు రేపదు నాలో..
వాడి కేరింతకి అనందం ఉప్పొంగదు యెదలో..
అతడి కరచాలనంతో  కొంచెమైనా కదలిక రాదు మదిలో..
నాలో భావోద్వేగాలు ..
ఏనాడో ఉరికొయ్యికి
బలి అయ్యాయి..

ఆశలుండవు నాకు ..
ఆశయాలు అసలే లేవు.
జీవచ్ఛవాలు రంగులు అద్దుకుని తిరిగాడే ఈ లోకంలో
తెగిన గాలిపటంలా దిక్కు దారి తెలియని నేను-
నన్ను నేను కాలానికి ఎరగా వేసుకుని కాటి వైపు చూస్తూ కూర్చుంటాను నిర్లక్ష్యంగా..
పెదాలపై ప్లాస్టిక్ పువ్వుల్ని వికసించే
ఈ రోబోటిక్ జనాల మధ్యలో
ఊపిరి సలపనప్పుడు
నన్ను నేను 'వెలి' వేసుకోవడం తప్ప
 ఇంకేం చేయగలను ? !

అసలు ఏం సాధించారని విర్రవీగాలి వీళ్లంతా  ..
మట్టిలోనుంచి పుట్టిన మనిషి..
మట్టి తత్వాన్ని వదిలేశాక  యేమి సాధిస్తే ఏం,
సాధించకుండా ఉంటే ఏం ? !
అలాంటోళ్లని భుజాలకి ఎత్తుకోవడమంటే ..
శవాల్ని సామూహికం గా ఉరేగించడమే కదా !
ఆ శవాల జాతర్ని  చూస్తూ..
బూడిద పూసుకోకుండానే
నేను ఊళ్ళో తిరుగాడే బైరాగిని
యెప్పుడైపోయానో...!? 🤔


శ్రీను. కుడుపూడి.

జీవచ్ఛవాలు

ఏమిటో ఈ పరుగులు? !
చావుకి చాలా లేటైపోతున్నట్టు !
కాళ్ళమీద కార్లమీద
బైకుల్లో.. గగనవీధుల్లో...
ఒకటే ఉరుకులు
గజిబిజి పరుగులు !!

ఆత్మలు ఏనాడో 'సూసైడ్ 'చేసుకున్నాయి.
'మనసులు 'ఆవిరవుతూ...
అదృశ్యమవుతున్నాయి.
మనిషిప్పుడు కదిలే పాషాణం.

రంగు కాగితాలే మనుషుల్ని
శాసించే ఈ లోకంలో
'విలువల'కి ఏనాడో
వస్త్రాపహరణం జరిగిపోయింది.
ఒకవేళ కాలం కలిసొచ్చి 'చస్తే'..
పోయేదేమిలేదింక !

మహా అయితే కాల్చితే
గుప్పెడు బూడిద !
పండిస్తే పిడికెడు మట్టి తప్ప !!!

దిశా.. నిర్ధేశం.

మేం అబలలం కాదు..

యుగ యుగాలుగా ఆకృత్యాలను భరిస్తున్నా
ధైర్యం వీడని 'నిర్భయ'లం.
అన్యాయాన్ని నిలదీసి ఆత్మ గౌరవంతో బ్రతికే సింహాలం.

ఒకప్పుడు సతీసహగమనం..
ఆనక వరకట్నం పిచాశం.
ఇప్పుడు అత్యాచార అరాచకం.
రూపం మాత్రమే మారింది..
తరతరాలుగా..
'దౌర్జన్య కాండ' కొనసాగుతూనే ఉంది.
అయినా కూడా , ఈ మారణహోమాలికి ఏ
మాత్రం వెరవని వీర వనితలం.

మేం సబలలం..
కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్మాదం తో కాటు వేసే పిచ్చి కుక్కలకు "తూటా" రుచి చూపించే
'దిశా 'నిర్ధేశుకులం.

మేం ఆడోళ్ళం..
మీ ఆకలి కడుపులకి అన్నం పెడతాం..
కష్టమొస్తే గుండెల్లో దాచుకుంటాం..
మీతో మాకు కష్టమొస్తే మాత్రం
అణుబాంబులమవుతాం.


గుండె పిండి పాలుపట్టి
ముద్ద పెట్టి మూతి తుడిచి
ముడ్డి కడిగి లాలపోసి జోలపాడే  తల్లి
వడిలో సేద తీరే పిల్లవాడా...
పెరిగి పెద్దై మొగోడినంటూ మీసం
మెలేసే  ఓ మొనగాడా..

నీ తల్లి కూడా ఒక ఆడమనిషే కదా
నడి రోడ్డు మీద నడిచే ఆడతల్లి కూడా
ఇంకెవరికో తల్లెనో చెల్లెనో కదా.. !
మరెందుకు ఆతల్లిని కామంతో చిదిమేస్తావ్.
కసి తో మసి చేస్తావ్..
నీ సృష్టి మూలాల్ని నీవే ఛిద్రం చేసుకుంటావ్..?!!

శ్రీను. కుడుపూడి🌷

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...