24, మార్చి 2010, బుధవారం

ప్రేమ లేఖ -2



ప్రియా!
నిదుర రాని నా కన్నులకు జోల పాడి నిద్రపుచ్చావు !
తడబడే నా అడుగులకు కాలి 'మువ్వ' వై లయ నేర్పించావు !!
అనుక్షణము నా' హృదయ స్పందన' వై నా వెంట ఉన్నావు...
నా మది లో ఎన్నో మధురానుభూతుల్ని నింపావు ..
నాకో మధుర జ్ఞాపకమై మిగిలావు !!

ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా..చెప్పలేకపోతున్నాను ప్రియా ..
ఎందుకంటే ,


నీవు నాకు మిగిల్చిన 'మధురజ్ఞాపకం 'ఊయల లో 'మారాం' చేస్తున్నాడు .
నేను కట్టుకున్న' మావారు'ఆఫీసు నుండి వచ్చే వేళ అయ్యింది .
ప్రియా!మరు జన్మ లోనైనా నీ పాదదాసి గా పుట్టాలని ఆశించే......
.....................నీ దేవదాసి{దేవదాసు లా అన్నమాట }!!

**"పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదు "-సుప్రీం కోర్టు సృస్టికరణ."-

ఉదయం పేపరు చదువుతున్నప్పుడు ఈ వార్త కంటపడి ,నా మనసు లో ఓ విత్తు పడి..ఓ చిలిపి ఆలోచన మొగ్గ తొడిగి ..పువ్వై ..పిందై ..కాయై చివరాఖరు కి నా ఈ "కపి -త "అయ్యింది .ఎక్కువ చేస్తే ..క్షమించండి !

*కోర్టు వ్యాఖ్యలు తప్పు కాదంటే ..నా ఈ కపి-త కూడా తప్పు కాదు మరి !

23, మార్చి 2010, మంగళవారం

ప్రియ మిత్రుడు -జానీ గాడు-3



అగ్రహారం మా పక్క ఊరే కావడం మూలాన ఆ పెళ్లి లో చాలా వరకు మాకు తెలిసిన ముఖాలే .
వాళ్ళంతా పలకరిస్తుంటే ,మేము మాత్రం నవ్వేసి ఊరుకునే వాళ్ళం.నోరు విప్పితే అసలు బండారం ఎక్కడ బయట పడిపోతుందేమోని భయం !ఒక పక్క పెళ్లి తంతు జరుగుతుంటే ,ఇంకో పక్క టెంటు లో బోజనాల హడావిడి .
పెళ్లి కి వచ్చిన జనమంతా బోజనాల దగ్గరే ఉన్నారు.అక్కడ అడుగు పెడుతూనే ..వెజిటేరియన్ పలావు వాసన నా ముక్కు పుటల్ని తాకేసరికి నేను మొదట బోయినాల టెంటు లో కి వెళ్లబోయాను .సాయి గాడు నా చెయ్యి పట్టుకుని ఆపేశాడు.
"రేయ్ ఎవరైనా చూస్తే మనం పెళ్లి బోయినాలకి వచ్చామకుంటారు .ముందు కాసేపు పెళ్లి చూసాక ,తరువాత బోయినాలు "అన్నాడు.
వాడు కొంచెం పెద్ద తరహ మనిషి వాడి మాట కాదనలేక ,అందరం పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాం .నా మనసు మాత్రం టెంటు లో నే ఉండిపోయింది .
"జీడి పప్పు పకోడీ కూర బలే ఉందిరా "అని ఒకడు ,"చిక్కుడుకాయ టమేటో అదిరిపోయిందేహే"అని ఇంకొకడు ..బోజనాలు చేసేసి పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళ మాటలు నా చెవి లో పడేసరికి ఇంక ఓపిక పట్టడం నా వల్ల కాలేదు .
జానీ గాడ్ని గట్టిగా గిల్లేశాను .వాడు చూపులు ఎక్కడో పాతుకుపోయాయి ,ఈ లోకం లో లేడు .
"ఒరేయ్ ఆ పిల్లని చూడరా ..బలే ఉంది కదా "అన్నాడు పెళ్లి కూతురు వైపు చూపిస్తూ ."రేయ్ !పెల్లికూతురు ని అలా అంటే కళ్ళు పోతాయిరా"అని లెంపలేసుకున్నాన్నేను."అది కాదేహే ..పెళ్లి కూతురు వెనకాల "మెల్లగా చెప్పేడు వాడు .
మంచి ముత్యానికి పట్టు పరికిణీ కట్టినట్టు ఉందా పిల్ల .ఎన్ని కొంటె పనులు చేసినా ఆడపిల్ల లకి ఆమడ దూరం లో ఉండే జానీ గాడు ,ఆ పిల్ల ని చూసి మైమరచిపోవడం నాకు వింతేమీ అనిపించలేదు .వాడే కాదు ఎలాంటి మగాడైనా ఆ పిల్ల అందాని కి పడిపోవలసిందే!
నాకు మాత్రం ఆ అమ్మాయి అందం కంటే నా కడుపు లో ఆకలే ఎక్కువ అలజడి రేపుతుంటే ..సాయి గాడ్నిప్రసాదు గాడ్ని తీసుకుని బోజనాలకి వెళ్ళిపోయాను.జానీ గాడు మాత్రం అక్కడ నుంచి కదల్లేదు.
బోజనాలు అయ్యాక ఎలాగో బలవంతం గా వాడ్ని ఇంటి కి లాక్కొని వచ్చేశాము .పాపం !వాడి మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది .

మర్నాడు తెల్లారగట్లే పాల కేంద్రం నుంచి పాలు తీసుకొస్తూ అలవాటు గా మా ఇంటి ముందు ఆగి పలకరించాడు. వాడి పై పెదవి కొంచెం చిట్లి రక్తం గడ్డ కట్టి ఉంది .
"అదేంట్రా !రాత్రి బాగానే ఉన్నావు కదా "అన్నాన్నేను ."నిన్న రాత్రి సైకిలు అరుగు మీదకి ఎక్కిస్తా పడిపోయన్రా "వాడి స్టైల్లో కిచ కిచ మని నవ్వేసాడు .
కొన్ని రోజులకి మా పదో తరగతి పరీక్షా పలితాలు వచ్చేశాయి . దేవుడు దయవల్ల మా మిత్రబృందం అంతా గట్టేక్కేశాము .
ఓ రోజు సర్టిఫికెట్లు తీసుకొవడానికి స్కూలుకి వెళ్తే ,అక్కడి కి వంకర పళ్ళ మధు గాడు కూడా వచ్చి ,జానీ గాడ్ని చూసి కిసుక్కున నవ్వేసాడు .
ఏమైందిరా? అని అడిగితే వాడు అసలు విషయం చెప్పేసాడు ."ఒరేయ్ !ఆ రోజు మా నాన్న గారు అడ్డు పడకపోతే ,పెళ్లి కూతురు తరపోల్లు వీడ్నిచితక్కోట్టేదుర్రా "అని చెప్పి మళ్లీ పళ్ళు యికిలించాడు . మాకేమి అర్ధం కాక జాని గాడి మొహం వైపు అయోమయం గా చూశాము .ఇంక చేసేదేమీ లేక కొంచెం సిగ్గు పడుతూ ..వాడు చేసిన ఘన కార్యాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పేశాడు .
"రేయ్!ఆ రోజు మనమంతా ఇళ్ళకు వచ్చేశాక ..నేనొక్కన్నే మళ్లీ పెళ్లి కి వెళ్ళాను రా ..నేనేమి చెయ్యలా ..కొంచెం ఆ పిల్ల తో మాట్లాడబోతా ఉంటే ఎవడో గొట్టం గాడు నా మీద చెయ్యేశాడు .పెళ్ళని ఊరుకున్నాను గానీ,అదే బయటయితే విరగోట్టేద్దును నా కొడుకునీ!"సమర సింహ రెడ్డి లెవెల్లో ఎమోషనల్ అయిపోయాడు జానీ గాడు .{అప్పటికే కుస్తీ పోటిలలో రాష్ట్ర స్థాయి లో పాల్గుంటున్న బలశాలి మరి ..ఆ మాత్రం ఉంటుందిలేండి !}
"ఓర్ని!అదా సంగతి ..మరి ఆ రోజు అడిగితే కాలు జారింద న్నా వేంట్రా"అని నేనడిగితే ,
కాలు కాదురా ..మనసు జారేడు "నాలుక బయట పెట్టి తలాడిస్తా తమాషాగా నవ్వేసాడు సాయి గాడు.
"నీకు చాలా కళ లు ఉన్నాయిరా "ప్రసాదు గాడు ఆటపట్టించాడు .మాకూ నవ్వు ఆగలేదు ..జానీ గాడ్నిచుస్తూ పగలబడి నవ్వేశాము .
వాడు కూడా పై పెదవి మీద చూపుడు వేలు తో నిమురు కుంటూ ..కిచ కిచ మని మా తో పాటే నవ్వేశాడు .


ఇలాంటి జ్ఞాపకాలెన్నో ..మిగిల్చిన ఆ "కోతి గాడు" చివరాఖరు కి తనే మా అందరి కి "కన్నీటి జ్ఞాపకం" గా మిగిలిపోతాడని ఏనాడూ అనుకోలేదు .

19, మార్చి 2010, శుక్రవారం

ప్రియ మిత్రుడు -జానీ గాడు-2



ఆ రోజు సాయంత్రం మా 'దుష్ట చతుష్టయం ' ఎప్పటిలానే లాకుల మీద కూచుని పోసుకోలు కబుర్లు చెప్పుకుంటున్నాము .
మా స్కూల్లో మాస్టార్లు గురుంచి ,మా క్లాసు లో అందమైన అమ్మాయి ల గురుంచి ,మేము చేసిన అల్లరి పనుల్ని ఒక్కొకటి గుర్తు చేసుకుంటూ ..మాట్లాడుతూ ఉండగానే ఆ సాయంత్రం కాస్తా సందె చీకట్లు ముసురుకుని క్రమ క్రమం గా చిక్కబడి 'చీకటి రాత్రి 'అయిపోయింది .మెల్ల మెల్లగా వూళ్ళో ని సందడి అంతా సద్దుమనిగిపోయింది .
లాకుల్లోంచి చెంగు మని దూకుతున్న కాలవ నీళ్ళ హొరు తప్ప ,మా చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలన్నీ నిశ్శబ్దం గా అయిపోయాయి .

కబుర్ల లో పడి మేము పట్టించుకోలేదు గాని మా కడుపు లో చిన్నగా ఆకలి కేకలు మొదలయ్యాయి .
"ఒరేయ్ ..ఆకలేస్తుంది ,యిళ్ళ కు వెల్లిపోదాం రా " పొట్ట నిమురుకున్నాడు ప్రసాదు గాడు.
అంతటి తో మా వేసవికాల సమావేశాలని తరువాత రోజుకి వాయిదా వేసేసి,యిళ్ళ బయలుదేరబోతుంటే ..ఆ నీరవ నిశీధి లో ఎక్కడి నించో సన్నగా సన్నాయి రాగం వినిపించింది .
అంతే!ముందుకి కదలబోతున్న జానీ గాడు టక్కున ఆగిపోయి 'రేయ్!అగ్రహారం లో ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది ..ఎవరి ఇంట్లో అంటావ్ "'అని ఉత్సాహం గా అడిగాడు .
వాడి ఉత్సాహం చూస్తే ఏదో కోతి పనికి ప్లాను వేస్తున్నట్టు అనిపించింది నాకు .
"మన 'బి 'సెక్షను లో వంకర పళ్ళ మధు గాడు ఉన్నాడు గా ..వాళ్ళ పెద్ద నాన్న గారి అబ్బాయి దేహే ..మా అన్నయ తో కలిసి చదువు కున్నాడంట!మొన్న మా యింటికొచ్చి మమ్మల్ని కుడా పెళ్లి కి రమ్మని' మరీ మరీ చెప్పి వెళ్ళేడు రా .. "అని అమాయకం గా చెప్పేసాడు ప్రసాదు గాడు.
ఆ తరువాత జరిగే పరిణామాల్ని వాడు ఉహించలేకపోయాడు పాపం!
కోతి కి కొబ్బరికాయ దొరికేసినట్టు జానీ గాడు కి మంచి దారి దొరికేసింది .
"అయితే మనం ఎల్దామే హే ..మీ అన్నయ వూళ్ళో లేడు కదా !ఎవరైతే ఏంటి ?" కిచ కిచ మని నవ్వతా లోట్టలేసాడు జానీ గాడు.
ప్రసాదు గాడి గుండెల్లో రాయి పడిపోయింది .'మా అన్నయ్య కి తెలిస్తే చంపేస్తాడురా'అని తెగ భయపడిపోయాడు .
"పరవాలేదే హే..మీ అన్నయ్య అడిగితే ,మధు గాడు రమ్మన్నాడని చెబుదాం "ఎగదోశాడు సాయి గాడు.
పెళ్లి బోయినాలు కళ్ళ ముందు కదిలేసరికి ...నా నోట్లో నీళ్ళు ఊరి నేనూ సరే అన్నాను .
నున్నగా తలలు దువ్వుకున్నాం!జేబు రుమాళ్ళ మడతల్లో దాచుకున్న సంతూర్ పౌడరు ని ముఖాలకి అద్దుకుని పిలవని పేరంటానికి పెళ్లి పెద్ద ల్లా బయలుదేరిపోయాం .
అప్పుడే మొదలైంది అసలు కథ !!
{ తరువాత టపా లో ....}

16, మార్చి 2010, మంగళవారం

ప్రియ మిత్రుడు-జానీ గాడు-1



అవి వేసవి కాలం రోజులు .
నేను నా మిత్ర బృందం పదో తరగతి పరిక్షలు రాసేసి నెత్తి మీద కొండంత బరువు దించేసుకుని,
సాయంత్రం అయ్యేసరికి మా ఊరి 'లాకులు' మీదకి చేరి కబుర్లు చెప్పుకునేవాళ్ళం .
మా మిత్ర బృందం లో సభ్యులం 'పంచ పాండవులు' లా ఐదుగుర మే కానీ ,
కొంటె పనులు దగ్గరి కి వచ్చేసరికి 'దుష్ట చతుష్టయం' లా నలుగురమే -సాయి ,జానీ ,ప్రసాదు ,నేను !
కృష్ణ మోహన్ గాడ్ని ఐతే వాళ్ళింటిలో వాళ్ళు బయటకి పంపేవారు కాదు .(వాడు ఇంట్లో ..రాముడు మంచి బాలుడు టైపు అన్న మాట !బయటకు వస్తే చిలిపి కిట్టయ్యే !)
మా ఐదుగురు లో నలుగురుం ఇంచుమించు గా ఒకే నడవడిక లో ఉంటాం కానీ ..జానీ బాబు గాడు మాత్రం కళ్ళు తాగిన కోతి టైపు .
వాళ్ళ అమ్మ నాన్న ల కి పెళ్ళైన చాలా రోజుల వరకూ పిల్లలు పుట్టకపోతే,యేసు ప్రభువు ని నమ్ముకున్నాక పుట్టాడంట వాడు .
అందుకే "జానీ బాబు "అని పేరు పెట్టారంట వాడి కి !మనసు కి దయామయుడే కానీ .మనిషే కాస్తంత వంకర .
అలాంటి వంకర మనిషి..ఆ వేసవి సాయం కాలం చేసిన ఓ 'వంకర పని' గురుంచి తరువాత టపా లో చెబుతాను .
{కొంచెం పని ఉంది ..ఏమీ అనుకోకండే }!

15, మార్చి 2010, సోమవారం

ఉత్తరం -1



స్వచ్చమైన పల్లె నుంచి టౌన్ కి వలస వచ్చిన ఒక పల్లెటూరి పాపయ్య పడే మానసిక సంఘర్షణ ని
మనో భావాలను అక్షరీకరించే చిన్న ప్రయత్నమే ఈ "ఉత్తరాలు ".



ప్రియాతి ప్రియమైన మిత్రుడు...
లక్కిం శెట్టి సూరి బాబూ కి నీ మిత్రుడు చెవుడు బావుల ముని మాణిక్యాల రావు రాయునది ఏమనగా ..
నేను క్షేమం .నీవు అక్కడ క్షేమమని తలుస్తున్నాను .

ఒరేయ్ మామ ..నేను హైదరాబాద్ లో దిగినవెంటనే .
నీకు ఉత్తరం రాద్దాము అనుకున్నాను ..కానీ కుదరలేదు..!
ఎందుకంటే ...ఇక్కడ పోస్టు డబ్బాలు మన ఉళ్ళో లా పక్కనే ఉండవు రా!.
అది వెతికే సరికి ఇన్ని రోజులు పట్టింది .

పోనీ ఫోన్ చేసి మాట్లాడదామంటే ...
ఉత్తరం రాయడం లో వచ్చే ఆనందం ,చదవడం వల్ల కలిగే అనుభూతి ఎంత సేపు ఫోను మాట్లాడితే వస్తుంది చెప్పు !!

ఒరేయ్ ..సూరి గే నీకు హైదరాబాద్ విషయాలు చాలా చెప్పాలి రా .
ముందుగా నా 'కడుపు మంట' గురుంచి ...
వినే వాళ్ళకి కాస్తంత విడ్డురం గా ఉంటుందేమో కానీ ..పీత కష్టాలు పీత వి లా ఇది కూడా నాకు కూసింత పెద్ద కష్టమే !

నేను ఎల్లిన తోలి రోజే ..
పొద్దునే లేచి పొల్లు తోముకుని ...టిపిను చేద్దామని బయటకు వెళితే..
మన ఉళ్ళోని కాఫీ హొటేలు వెంకటరాజు బడ్డి కొట్టు లాంటిది ఒక్కటి కుడా తగల లేదు రా !!
నా బాధ ఎవరి కి చెప్పుకోవాలి ?కడుపు లో ఒకటే ఆకలి కేకలు !

మేముండే వీధి కి కూసింత దూరం లో ఏదో "హై- టెక్ "టీ పాయింట్ అని ఉంటె చూద్దాం కదా అని..వెళ్ళా !
అక్కడ వట్టి సమోసాలు ,బన్ను రొట్టెలు తప్ప ఇంకేమి లేవు !అదేదో 'ఇరానీ హొటేలు' అంట!

మర్నాడు మా రూం లో కుర్రాడొకడు ,పక్క వీధి లో మన సైడు హొటేలు ఉందని చెప్తే హుషారు గా చేతులూపు కుంటా వెళ్ళా !
ఎంగిలకుల పై ఎగబడ్డ కాకుల్లగా కుమ్ము కుంటున్నారు అక్కడ !
వాళ్ళ తో మనకేం పని లే అనుకొని నేను వెళ్లి దర్జా గా కుర్చీలో కుచ్చోని "ప్లేటు ఇడ్లీ "అని ఆర్డరు వేశా..!
మనల్నిఎవడు పట్టించుకోలేదు !

నా పక్కనే కూచున్న ఇంకొకాయన ,కౌంటర్ లో టికెట్ తీసుకొని నన్ను కూడా ఆ గుంపులో కి ఎగబడమన్నాడు.
యిదేమి కర్మరా బాబూ అనుకోని...టికెట్టు ఒకటి తీసుకోని జనం మద్యలో కి దూరేశాను..
ఎలాగైతే ..అష్ట కష్టాలు పడి ప్లేటు ఇడ్లీ సంపాయించాను .
ఆ హడావిడి లో ప్లేటులో ఎన్ని ఇడ్లీ లు ఉన్నాయో కూడా చూసుకోలేదు .

చాలా హాపీ గా ఫీలైపోయి..
నా టేబుల్ దగ్గర కొచ్చి తినబోతే ...నా ప్లేటు లో ఒకటే ఇడ్లీ ఉంది !
అడిగితే ..ఇక్కడ ప్లేటు కి రెండు ఇడ్లీ లే యిస్తారంట,ఇంకోటి ఆ జనం మద్యలో పడిందేమో వెతుక్కోమన్నాడు.
మరి 15 /- ఎందుకు తిసుకున్నావని అడిగా ..
మా మన వెంకటరాజు ఐతే 10- రుపాయిలకే అరచేయ్యంత ఇడ్లీలు నాలుగు పెడతాడు కదా !ఇవేమో దీపావళి ప్రమిదలంత కూడా లేవు . అందుకే నిలదీసి అడిగేశా ..
పిచ్చోడిని చూసినట్టు చుశాడురా ..
నాకు పెద్ద అవమానం అనిపించేసి ,కడుపు మండి వచ్చేసా ..

అంతే!ఆ రోజు మొదలు ఈ రోజు వరకూ..
"కుర్చీలో దర్జా గా కూర్చొని ,కొబ్బరి చెట్నీ లో ..ఇడ్లీ నంజుకుంటూ .మద్య మద్య లో నెయ్యి వేసిన కారప్పొడి ని అద్దుకుంటూ కడుపు నిండా తినేసి ఆరాం గా బొజ్జ నిమురుకోవాలన్న "చిన్ని కోరిక కూడా అలాగే ఉండి పోయిందిరా.

ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు కూడా తీరవురా ఇక్కడ !!
ఇవన్నీ వినడాని కి చిన్నివే రా ..మనసు కి మాత్రం బోలెడంత కష్టం !
నా లాంటోడు బ్రతకాలంటే చానా కష్టం !

ఒరేయ్ మామా ..ఇలా చెపుతూ ఉంటె ఇలాంటి వి ఇక్కడ చాలా ఉంటాయి రా ..
నేను మళ్లీ ఉత్తరం లో అన్నీ రాస్తాను కానీ ..ఊళ్ళో మనోళ్ళంతా జాగ్రత్త .

13, మార్చి 2010, శనివారం

ప్రేమ లేఖ



నా బాల్య మిత్రుడు ఒకరు ,తను పని చేసే చోట ఒక అమ్మాయి నచ్చిందని ,
తనకి తన ఇష్టాన్నిఎలా చెప్పాలో అర్ధం కావడం లేదని ,
ఆమె పేరు 'సుచరిత' అని ,చిన్న కవిత[ప్రేమలేఖ ] రాసి పెట్టమని అడిగితే
నేను ఆవేశం గా రాసేసాను ...


సుచరితా.....!
నా హృదయ మధుర స్వప్నాల మధుమితా ..!!

నీ మృదు మధుర ఆదరాలను అడుగుతున్నా ...
నీ అదర మధుర "మధు కలశానికి " నన్నే ' మా రాజు 'ని చేయమని !

నీ కలువ కన్నులను వేడుకుంటున్నా.....
నీ కమ్మని కలల తీరం లో కాసేపు' సేద 'తీరనివ్వమని !!

కదిలే కాలాన్నీ అడుగుతున్నా ....
నీవు నేను సుస్వరాల సమ్మేలనమై ...సాగిపోవాలని !
చరిత్ర లో మన' ప్రణయ చరిత ' ...'సుచరిత' గా మిగిలిపోవాలని !!


***** వాడు నాకు చాలా రోజుల తరువాత నాకు ఫోన్ చేసాడు.
తను చేసే జాబ్ మానేసి ,
వాడు వేరే చోట ఉద్యోగం జాయిన్ అయ్యానని చెప్పాడు .
ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యల తో వార్నింగ్ యిప్పించిందని చెప్పాడు .
నాకు అప్పుడే అర్ధం అయ్యింది ..మొదటి ప్రేమలేఖ అంత ఘాటు గా ఉండకూడదు అని !
పాపం వాడికి అది అర్ధం కాలేదు ..అందుకే ఎవరి ప్రేమ లేఖలు వారే రాసుకోవాలి .

12, మార్చి 2010, శుక్రవారం

స్ఫూర్తి



మనసు ని వెన్నెల లా చేసి చూడు...
జీవితం మనం అనుకోనేంత 'చిక్కుముడి' కాదు!

మన నెత్తి మీద బండ రాళ్ళు ఏమి లేవు..
మన చుట్టూ మనకు మనమే గీసుకున్న లక్ష్మణ గీతలు తప్ప...!!

మన' రంగుల కలలే 'మనకు భారం కాకూడదు ,
చితాకోక చిలుక ని చూడు ..రంగుల దుప్పటి కప్పుకొని ఎంత స్వేచ్చగా ఎగురుతుందో!!

మనం ఎవరికోసమో ఎదురు చూడటం మన అవివేకం !
'గడ్డి పువ్వు'ని చూడు ..దేవుడి పూజకు పనికి రాకున్నాఉదయ కాలపు మంచు లో ఎలా మెరిసిపోతుందో !!

జీవితం లో దేనినీ ఆశించ వద్దు ....శాసించు !!
నీవు కోరుకున్న జీవితం ..నీ కాళ్ళ ముందు మోకరిల్లుతుంది ..!

11, మార్చి 2010, గురువారం

ఓ తల్లి రోదన !



ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు ...
గుండె పగిలి ,గొంతు చిరిగేటట్టు !
ఇక్కడే కాదు
అక్కడ కూడా ..కాదు కాదు ఇంకెక్కడో ..
ఎక్కడెక్కడో అంతా అదే రోదన !

ఎవరని పరికించి చూస్తే ..
జుట్టు చెదిరి ,బొట్టు చెరిగి కళ్ళ లో "కృష్ణా..గోదావరి "ని నింపుకుని ..
అయోమయం లో ఓ "తేజోమయి "!!

ఎవరూ నీవు ?అని అడిగితే ...
"తెలుగు తల్లి "ని అంది .
కాదు కాదు ..'తెలంగాణా తల్లి' ని అంది.

నీవెవరో నీకే తెలియదా అంటే...
కడుపున పుట్టిన పిల్లలే క్షణానికో పేరు తో పిలుస్తుంటే ..
తానెవరో తనే మరిచిపోయాను అంది .

"నా ప్రేగు తెంచుకుని పుట్టిన పిల్లలే ..
నా గుండె ని చీల్చేస్తారేమో అని భయం వేస్తుందని " చెప్పి మళ్లీ గొల్లుమంది .

ఆ రోదన చూస్తుంటే ...అచ్చు "మా అమ్మ ఏడుపు" లానే ఉంది .
పాపం !ఆమె ఎవరో ?!
ఆమె 'గుండె కోత' ని ఎవరు అర్ధం చేసుకుంటారో ...!!

10, మార్చి 2010, బుధవారం

ఎబౌట్ మి..@ స్నేహం కోసం ….



అక్షర సుమాల తో సాహితీ సౌరభాలు వెదజల్లే ..సాహితీ మూర్తులు అందరికీ నా"సుమాంజలి ".
సాహితి వనం లో ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ బుల్లి 'తువ్వాయి 'కి స్నేహ హస్తం అందిస్తారని ఆశ తో ..
నా గురుంచి కొంచెం..

కొంచెం కోపం..
కొంచెం జాలి ..
ఇంకొంచెం భయం ,బిడియం
మరి కొంచెం గర్వం .

మనసు నిండా ప్రేమ ..
భవిత మీద బోలెడంత ధీమా !

పుస్తకాలూ చదవడం అంటే ఇష్టం.
రాయడమంటే ఇష్టమైన ఇష్టం ! (ఇంత వరకు ఏమీ రాయలేదనుకొండీ ).

చందమామ .. వెన్నెలమ్మ
చిన్నపిల్లలు ..గడ్డి పువ్వులు
నల్లని మబ్బులు ..ఎగిరే పక్షులూ

మా కోనసీమ కొబ్బరాకులు ..
ఆత్రేపురం "పూత రేకులు "
పిల్ల కాలవ లో చేప పిల్లలు
గడ్డివాము లో కుక్కపిల్లలు

తొలకరి చినుకు ..
కోయిల పలుకు
మా గోదావరి పరుగు
మా ముగ్గుల అరుగు

పచ్చని చేలు ..పైరు గాలి
అమ్మ పిలుపు ..
మా లేగ దూడ అరుపు
మా గుడి లో మేలుకొలుపు..
నాకు చాలా ఇష్టం !

స్నేమంటే ఇష్టం .
స్నేహానికి ప్రాణం పెట్టె స్నేహితులంటే ఇంకా ఇష్టం .

ఇంకా చెప్పాలంటే ..
మనలో మన మాట .(ఎవరికీ చెప్పకండే )

అందమైన వాలు జడలు..
ఘల్లుమనే కాలి మువ్వలు
కవ్వించే కొంటె చూపులు ..
మురిపించే చిలిపి నవ్వులు
నా మనసున కురిసే .. వలపు జల్లులు !

ఇక చివరి మాట వినండి మరి ..
నా ఇష్టదైవం "శ్రీ హరి "
నేను చేసేది గుమాస్తా గిరి (ఆయన ఆపద మొక్కులవాడు , నేనేమో అప్పుల బాధల వాడ్ని . )
నా తలేమో "తిరుమల గిరి"(బోల్డు హెడ్ ).

నా తో స్నేహం చేస్తారా ..మరి ?!


"తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌".

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...