6, మే 2020, బుధవారం

#సరికొత్త వేకువ కోసం.. !#

లాక్ డౌన్ అంటూ సర్కారు
బ్రతుకు బండికి బ్రేకులు వేసింది.
ఇంట్లో నిత్యావసర సరుకులు
ఒక్కొక్కటిగా నిండుకుంటున్నాయి.
కళ్లల్లో ఉప్పు సముద్రాలు
ఊరుతున్నాయి.

వీధిలోకొచ్చిన మామిడిపళ్ళ
బుట్టని చూసి మా పెద్దది
పెదాల్ని చప్పరిస్తుంది.
ఆ పిల్లని  ఆ ధ్యాస నుండి
మెల్లగాతప్పించి మెప్పించాలంటే..
కత్తి మొన మీద కాలి బొటన వేలు
మోపి కర్ర సాము చేయడమే.
ఈ యేడాది మామిడి రుచి చూసే
యోగం  దానికి లేనట్టేనని
ఎలాగోలా చెప్పేయాలి.

బిల్లు కట్టలేదని కేబుల్ ఆపరేటర్
మా మాటల డబ్బా..
గొంతునొక్కేసి చాలా రోజులైంది.
ఇంటెడు చాకిరీ చేసి ఏ సాయం
సంధ్యలోనో.. ధారావాహికల్ని
తింటూ తాగుతూ ఒక  రకమైన
మత్తులో తూగే..మా ఇంటావిడకి
ఇప్పుడా ధ్యాసలేదు.

పాలు కారని  రొమ్ముని
పసోడి పెదాలికి తాకించి
కడుపు సగమే నిండి అర్ధాకలితో
ఈడ్చుకుపోయిన ఆ పిల్లాడి
పొట్టని సవరదీస్తూ..
బిక్క సచ్చిపోయి ఎటో దిక్కులు చూస్తోంది.

డబ్బా పాలకి అలవాటు పడ్డ
ఏడాదిన్నర పసోడు..
ఏడ్చే ఓపిక కూడా
లేక వాళ్ళమ్మ వొడిలో..
నిస్సత్తువగా  కదులుతున్నాడు.

పొద్దు పొడవక ముందే  తెచ్చిన
చిన్న పాల ప్యాకెట్, అర డబ్బానే
నిండి..పొద్దు ఇంకి పోకముందే నిండుకుంది.
పటిక బెల్లం నీళ్లు కలిపో..
వొట్టి పోయిన రొమ్ముల్ని
పెదాలకు కరిపించో..
పిల్లాడ్ని మాయ చేస్తే మాత్రం..
నిజం యెరిగిన వాడి
ఆకలి పేగు గమ్మున
ఊరుకుంటుందా?!
ఆ  అమ్మ కళ్ళల్లోని 'చెమ్మ'
ఆ పసోడి పెదాలని ఎంత సేపని
తడారిపోకుండా ఉంచగలదు.?!

ముతక బియ్యపు అన్నం
పంటి క్రిందపోతక చెక్కలా
నలుగుతుంటే..
పట్నం వొచ్చాక సన్న బియ్యపు
నాజూకు తనానికి అలవాటు పడ్డ
నా నాలుక..ఇష్టం లేనట్టుగా
కదులుతుంది.

చారులో అదే అన్నం మెత్తగా
పిసికి పెడితే తేడా తెలియని పెద్దది
అదే అమృతం అనుకుని
ఆబగా తినేస్తుంది..
చూసే కళ్ళని బట్టే ఉంటుంది ఏదైనా!

ఏ చేయూత లేని నా 'బడుగు బ్రతుకు'
క్షణ క్షణం   భయంతో
బిక్క సచ్చిపోతూంది...
సర్కారోళ్ళు దొడ్డ  మనసుతో
చేసే సాయం..ఆపద్ధర్మం గా
నా చేతుల్లో పెట్టడానికి
నేనిక్కడ మొలిచిన
'కార్డు దారుణ్ణి  'కాదు.
పొట్ట చేతపట్టుకుని పక్క రాష్ర్టం
నుండి  అన్నమో రామచంద్రా..
అంటూ తరలి వొచ్చిన 'వలసజీవి'ని!

నా జేబులోనుండి ఒక్కొక్కటే
జారిపోతున్న  చిల్లర పైసలు..
ఎప్పుడూలేంది ఇప్పుడు  యముడి
మహిషం మెడలోని మృత్యు గంటల్లాగా..
ఘల్లు ఘల్లున మోగుతున్నాయి.
ఆ చిల్లర  కాస్త చెదిరిపోతే ..
బియ్యంసంచి లోని  ఆ కాసిన్ని
గింజలు కాస్త నిండు కుంటే..
చివరాఖరికి చేసేదేంలేదింక !

మా దిగువ మధ్యతరగతి అభిమానాన్ని
నాలుగు రోడ్లు కూడలికి తాకట్టు
పెట్టి ఏ దాతో దాతృత్వంతో
విసిరే నాలుగు మెతుకులు
కోసం రోడ్డు పక్కన కాపు కాయాల్సిందే!

అంతకంటే ఇంకేం  చేస్తాం..
బ్రతికి బట్ట కట్టడానికి
అక్కరకు రాని 'ఆత్మాభిమానం'
ఉంటేనేం?! ఊడితేనేం..
చూస్తూ చూస్తూ అర్థం లేని
విలువలు కోసం ఆత్మ బలిదానం
చేసుకోలేం కదా..!
కనీసం బ్రతుకి ఉంటేనే  చాలిప్పుడు,
పనికి రాని విలువలన్నింటిని..
మడిచి ముడ్డికింద పెట్టెయడమే
సబబు.

మళ్ళీ మనందరికీ మంచి
రోజులొస్తాయ్..
విశృంఖల జీవన విధానానికి
స్వస్తి పలికి..
అణువణువునా మానవత్వం
పరిమళిస్తూ...
మన బ్రతుకులకో కొత్త అర్ధాన్ని
తెలియజెప్పే ..
సరికొత్త ఉషోదయ కిరణాలు
గడప గడపని ముద్దాడతాయ్. !!

అప్పటి దాకా
కన్నీటితోనే  కడుపు నింపుకుని...
మనసు నిండా కొత్త ఆశల్ని ఒంపుకుని..
కరోనా రహిత సరికొత్త ప్రపంచం
కోసం సప్త వర్ణాల కలలు కందాం!
భౌతికంగా ఎడమవుతూ..
మనో నిబ్బరంతో  కలిసికట్టుగా..
పోరాడదాం !!

శ్రీను. కుడుపూడి 🌷

కామెంట్‌లు లేవు:

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...