14, ఆగస్టు 2010, శనివారం

"మా అన్నపూర్ణమ్మ అంగడి "



సందె వేళ
ఆమె :"వేడి వేడి ఇడ్లీలు నాలుగు తినండి శీను గారూ..ప్రాణం కుంచెం కుదుట పడుద్ది "
నేను :"అయ్యో !వద్దండి .నెలాఖరు రోజులు ..మొన్న తిన్న దోసె డబ్బులే ఇంకా ఇవ్వలేదు. .మళ్లీ అరువా?!"
ఆమె :"భలేవారండి .నేనేమైనా మిమ్మల్ని డబ్బులివ్వమని పీకి పాకం పెట్టేతున్నానా!మీ దగ్గర ఉన్నపుడే ఇయ్యండి"
తెల్లని మల్లెపువ్వు లాంటి వేడి వేడి ఇడ్లీ ల ని ప్లేటు లో పెట్టి ,చల్లని నవ్వొకటి నవ్వి అప్యాయం గా 'టిఫిన్ ' పెట్టేదావిడ !
నేను ఆ నాలుగు ఇడ్లీ లు గుటుక్కున మింగేసి .. మొహమాటం గా చెయ్యి కడుక్కోబోతా ఉంటే ..
అమ్మ లా నా ఆకలి కనిపెట్టి ఇంకో రెండు ఇడ్లీ లు పెట్టి నా కడుపు ఆకలి తీర్చేదావిడ.
వెధవ ఆకలి ..పీక పిసికి నిర్ధాక్షిణ్యం గా చంపేస్తే ..చచ్చి ఊరుకుంటుంది గానీ..పోనేలే కదా అని ,కొంచెం నీరు పోశామా ..ఆవురావురమంటూ ..మనల్నే నిలువెల్లా దహించి వేస్తుంది .


నేను పనిచేసే ఆఫీసు పక్కనే చెట్టు కింద పెట్టుకున్న నాలుగు చక్రాల బండే ఆమె "టిఫిన్ సెంటరు ".
పేరు కి టిఫిను సెంటరే గానీ..మా వీధి లో నా లా చిన్నా చితకా ఉద్యోగా లు,పనులు చేసుకుని బ్రతికే చాలా మందికీ ..నెలాఖరు రోజుల్లోనో .. జేబుల్లో డబ్బులు లేనప్పుడో ఆకలి కడుపుల్ని నింపే "అన్నపూర్ణమ్మ అంగడి "!
( డబ్బులు ఎప్పుడు ఇచ్చినా గానీ ..విసుక్కోకుండా ఆకలి వేసినపుడు ఆప్యాయం గా కడుపునింపే అన్నపూర్ణ ..ఆ బండి యజమాని !అందుకే ఆ బండి ని అన్నపూర్ణమ్మ అంగడి అన్నాను.)
ఇలాంటి అన్నపూర్ణ మా అమలాపురం ఊళ్ళో నో ..పక్కన పల్లెల్లోనో కనిపిస్తే ఇంత వింత గా ,విశేషం గా చెప్పే వాడ్ని కాదు గానీ...
అసలు ఊరేంటో.. .యిప్పుడుంటున్న ఇల్లు యాడ నో ..అసలు ఎన్నాళ్ళు ఉంటారో , ఎప్పుడు పోతారో ..తెలియని ఈ -అ'భాగ్య నగరం' లో అడగకున్నా అరువులు పెట్టి కడుపునింపే "అమ్మ "లు అరుదే గా !
ఆమె పెట్టె అరువు కోట్ల రూపాయులు కాకపోవచ్చు ..
పొట్ట కూటి కోసం ఈ భాగ్య నగరాని కి వలస వచ్చిన ఈ భాగ్య జీవి(మంచి మనసులో ఆవిడ భాగ్యవంతురాలే )వేరే వాళ్ళ పొట్ట నింపడం సహసమేగా !!

ఆ అమ్మ పేరు "దుర్గ ".ముప్పయి కి ముప్పై ఐదుకి మద్య వయసు .
వెదురు కర్రని చక్కగా వంచి బొమ్మః గా మలిచి చీర కట్టి ప్రాణం పోసినట్టు సన్న గా ..ధ్రుడం గా ఉండేదావిడ.
ఆ పల్చటి మొహం మీద ఎప్పుడూ చెరిగిపోని చిరునవ్వు !
ఆమె మాట ...గాంభీర్యం తో పాటు ఆప్యాయత ని కలగలిపి పలికేది.
ఆమె కి పెళ్ళైన కొన్ని రోజుల కే భర్త చనిపోవడం తో ... పుట్టింటి కి వచ్చేసి ముసలి తల్లి దండ్రుల సంసార భాద్యతలన్నీ తన మీద వేసుకుంది .మగ పిల్లలే ఇంటి భాద్యతల నుండి తప్పించుకుతిరుగుతున్న ఈ రోజుల్లో ..ఇలాంటి ఆడపిల్ల ఉన్నందుకు ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించేది .

నేను మా ఆఫీసు లో జాయిన్ అయిన కొత్తల్లో ..ఆమె మంచితనాన్ని చూసి ..లౌక్యం అనుకునేవాణ్ణి.
అదే వ్యాపార తత్త్వం కాబోలు అనుకునేవాణ్ణి!తరువాత తెలిసింది ..నా ఉహ తప్పు అని !
ఆవిడ దగ్గర అరువులు పెట్టి కడుపునిండా మేక్కేసిన కొంతమంది కలియుగ భకాసురులు.చెప్పా పెట్టకుండా దుకాణం సర్దేస్తే ..
వాళ్లకి ఏనాడో ఋణం కాబోలు అని సరిపెట్టుకునేదే తప్ప పోయిన వాళ్ళని ఒక పల్లెత్తు మాట అనేది కాదు !
అరువులు పెట్టడం మానేది కాదు !!
"అదేంటండి ..దుర్గ గారు !అడిగిన వాళ్ళందరికీ అలా అరువులు పెట్టేసి మీరు ఇబ్బందులు పడటం దేనికి ?!మొహమాటం లేకుండా ..అరువులు పెట్టనని చెప్పేయండి "అనేవాణ్ణి అపుడప్పుడు !
"పోనీలెండి ..ఒకరి కడుపు ఆకలి తీర్చే భాగ్యం అందరికి రాదు ...డబ్బులిస్తే సరే సరి ...లేదంటే ఒకరి ఆకలి బాధని తీర్చిన తృప్తి అయినా మిగులుతుంది .
ఆ పుణ్యమేదో ..వచ్చే జన్మ లో కాపాడుతుంది "నవ్వతా అనేదావిడ !
ఇలాంటి మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా ?!అనిపించేది నాకు .
పోనీ ..బాగా సంపాదించిందేమో లే ..అనుకుందామన్నా,పాపం ! అరువులు ఎగ్గొట్టేసి పోగా మిగిలిని కాస్త డబ్బులు ..వాళ్ళ అమ్మ నాన్న ల మందుల కి ,నిరుద్యోగ తమ్ముడు ఖర్చు ల కి ,ఆ పేద సంసారాన్ని నెట్టుకు రావడానికి సరిపోయేవి .
పండగ పూట అయినా తనకి ఒక మంచి చీర కొనుక్కునేది కాదు .ఆ డబ్బులు ఉంటే వేరే ఖర్చు పోతుంది కదా అనేది .


ఇదంతా ..ఆవిడ గురుంచి ఎందుకు చెప్తున్నానంటే .....
మొన్న పోయిన నెల లో కొంచెం ఒంట్లో నలత గా ఉందని వాళ్ళ సొంతూరు విజయ వాడ వెళ్ళింది .
ఆమె తో పాటే..వాళ్ళమ్మ ,నాన్న కూడా వెళ్లారు .అన్నాళ్ళు ఆమె చేతి వంట కి అలవాటు పడిన మా ప్రాణాలు ..ఆకలి తో విలవిల్లాడేవి.
ఆవిడ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం !

ఒక రోజు ఊరునుండి వాళ్ళ తమ్ముడు వచ్చాడు ."అక్క ని హాస్పిటల్లో పెట్టారు ..బ్రతకడం కష్టం !అంటున్నారు డాక్టర్లు "అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు .
నాకు ఒక క్షణ కాలం ఏమి అర్ధం కాలేదు.
"బ్రతకడం కష్టం ఏమిటి ?!ఆవిడ బాగానే ఉండేది కదా !"అయోమయం గా అడిగాను .
"లేదు...చాలా రోజులు గా తన కడుపులో ఉన్న బాధ ఎవరికీ చెప్పుకోలేదు ..జబ్బు బాగా ముదిరి పోయిందంట!
ఎప్పుడు మా గురుంచే ఆలోచించేది ..తన గురుంచి అస్సలు పట్టించుకోలేదు "దుఃఖం తో అతని గొంతు బొంగురు పోయింది .

ఒక రోజు సాయంత్రం ..ఆమె కు సీరియస్ గా ఉందని చెప్పి ఫోను వస్తే ఆ ఆబ్బాయి (అతని పేరు కూడా శ్రీనే )హడావిడి గా వాళ్ళ ఊరు వెళ్ళాడు .మళ్లీ రాలేదు .
మా వీధి లో నే ఉండే వాళ్ళ దూరపు బంధువులు ఒకాయన ఆవిడ చనిపోయిందని చెప్పాడు .
నాకు కన్నీళ్ళు రాలేదు ..ఎందుకో అర్ధం కాదు !ఆవిడ గొప్పతనాన్ని కన్నీటి తో వెలకట్టలేక అనుకుంటా..!!

వాళ్ళ తమ్ముడు చెప్పినట్టు ..ఆవిడ తన కోసం ఆలోచించుకోలేదు ..తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచించి నట్టుగా తన గురుంచి తానే పట్టించుకోలేదు .మా కడుపు ఆకలి ని పసిగట్టిన ఆవిడ తన కడుపు బాధని,మనసులో ని వ్యధ ని మాత్రం ఎవరికీ చెప్పుకోలేదు .
ఇప్పుడు మా ఆఫీసు పక్కన చెట్టు కింద ఎవరో కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు .
మా లాంటి వాళ్ళ ఆకలి కేకలు ..వాళ్ళ చెవి కి వినిపిస్తాయి గానీ...వాళ్ళ మనసు కంటి కి మాత్రం ఆనవు .
"అరువు లేదు" .."అయ్యో పాపం !"అసలే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తారు .
నాకు ఆకలి వేసినప్పుడల్లా "దుర్గమ్మ "గుర్తుకొస్తుంది .కాల గర్భం లో కలిసిపోయిన "అన్నపూర్ణమ్మ అంగడి "గుర్తుకొస్తుంది !!
ఆత్మ బంధువుల ని అంత తొందరగా మరచిపోలేము కదా !

ఆవిడ కి మేము చాలా ఋణ పడిపోయాము - ఆమె మా కడుపు ఆకలి తీర్చినందుకు కాదు ..
తన మంచి మనసు తో మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసినందుకు !

7 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

చాలా బాధగా అనిపించిందండి. చాలా అరుదుగా చూడగలం అలాంటి మనుషులని. నిజంగా అన్నపూర్ణే ఆవిడ.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

మీరు అన్నది నిజమే శిశిర గారు !ఇలాంటి వారు అరుదుగా కనిపిస్తారు .
ఎక్కువ కాలం బ్రతకరు ..ఎందుకో అర్ధం కాదు !

మాలా కుమార్ చెప్పారు...

ఇలాంటి వారు ఎక్కడో కాని కనిపించరు . ఆవిడ ఆత్మకు శానితికలగాలని ఆదేవుని ప్రార్ధీస్తున్నాను .

రాధిక(నాని ) చెప్పారు...

అన్నపూర్ణ మ్మ ,లాంటి వాళ్ళు ఈ రోజుల్లో అందునా సిటిల్లో చాలాఅరుదుగా ఉంటారు.అటువంటి వాళ్ళను మరిచిపోలేము.

Unknown చెప్పారు...

మనసుని కదిలించిందండీ...
చాలా బాగా రాశారు..
ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@మాలా కుమార్ గారు !ఇలాంటి వారు అరుదుగా ఉంటారు .ఆవిడ లేకపోవడం ,మా వీధి లో ఎంత మంది ఉన్నా బోసిగానే అనిపిస్తుంది .


@రాధిక గారు !ఇలాంటి వారు సిటీ లలోనే కాదు ..ఈ రోజుల్లో పల్లెల్లో కూడా కనిపించడం లేదు.ఆవిడ పేరు దుర్గ .మేము అంతా"అన్నపూర్ణమ్మ "అని పిలిచే వాళ్ళం .


@ఉషా కిరణ్ గారు !మనసున్న మనిషి వ్యధ ఎవరి మనసునైనా కదిలించక తప్పదండి .ఆవిడ ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను .

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

నిజమే..సిటీల్లో అలాంటివారు చాలా అరుదు..ఇంత మంచి వాళ్ళకు మన రాజకీయనాయకులంత ఆయుష్షు ఎందుకుండదో మరి...జబ్బులకు,జ్వరాలకు పేదవాళ్ళంటే గొప్ప చిన్న చూపు కాబోలు...వారినే పట్టుకు భాదిస్తాయి..

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...