6, ఆగస్టు 2010, శుక్రవారం

ఉత్తరం -3



ప్రియమిత్రుడు సూరి బాబు కి ..!

ఏంట్రా సూరి ..ఇన్నాళ్ళు ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయలేదని కోపం గా ఉందా నీకు ?!
ఏమి చేయమంటావురా..ముందే చెప్పాను కదా .పోస్టు డబ్బా లు మన ఊళ్ళో లా పక్కనే ఉండవని !
అందులోనూ నేను గంగ పర్రు సుబ్బరాజు గారి కంపెనీ లో జాయిన్ అయిన దగ్గర నుండి నాకు రాత్రేదో పగలేదో. .తెలియకుండా అయిపోయిందిరా !
ఇక్కడ కూడా మన ఊళ్ళో లానే ప్రతి రొజూ మామూలు గానే తెల్లగా తెల్లారుతుంది .
కానీ నా మనసు కి మాత్రం ఎప్పుడూ ఏదో మబ్బు కమ్ముకునట్టు ముసురు పట్టేసినట్టు ఏదో తెలియని అంధకారం చుట్టు ముట్టేసినట్టు ఉంటుంది .
ప్రతి రోజూ ఉదయాన్నే నిద్ర లేస్తూనే ఏదో తెలియని వెలితి గా అనిపిస్తుంటుంది .
కారణం ఏంట్రా అని ఆలోచిస్తే ...చానా ఏళ్ళు గా ఏదో ఒక కారణం తో (ఎక్కువ గా బద్ధకం తో నూ..కొంచెం తక్కువ గా పరిస్థితులు అనుకూలించక పోవడం వల్లనూ )నేను చేయకుండా పక్కన పెట్టేసిన పనులన్నీ ,ఇప్పుడు.. ఇన్నాళ్ళ తరువాత (28 సం) నా నెత్తి మీద కి ఎక్కి నాట్యం చెయ్యబట్టే నాయీ శిరో భారానికి కారణమేమోనని చూచాయగా అనిపించింది .

ఇప్పుడు అనుకునేం లాభం ?!
ఏ టైము లో చెయ్యాల్సిన పనులన్నీ ఆ టైము లో నే చేసుంటే ,నేనీరోజు నీతో ఇలా నా గోడు వేల్లబోసుకునే పనేముంది చెప్పు ?!

ఇలాంటి బాధ నేను మన ఊళ్ళో ఉన్నపుడు లేదురా ..ఎందుకంటే అక్కడే నేనే మారాజు ని అనుకునేవాణ్ణి!
ఈ మహా నగరం లో అడుగు పెట్టాక జైన విగ్రహల్లాంటి (నేను అనేది ఎత్తు లో కాదు ...హొదా లో )ఈ జనాల మద్య నేను మరుగుజ్జులా అయిపోయిన పీలింగ్ మనసుని మెలిపెట్టేస్తుంటే ...ఇన్నాళ్ళు నన్ను నేనే మోసం చేసుకుని బ్రతికానా అని తెగ బాదైపోయింది.

ఒరేయ్ సూరి !నీవు ఏమీ అనుకోనంటే ..నేను చెప్పే సోదంతా కొంచెం ఓపిక పట్టి వింటానంటే ..రెండు ముక్కల్లో చెబుతా !
నీవు ఊ కొట్టక పోయినా పరవాలేదు ..నేను చెప్పింది వింటే అదే పది వేలు !

ఇక అసలు సంగతికి వస్తే...
నేను పొద్దున్నే భారం గా లేస్తానా ..అప్పటికే మా ఎదిరింట్లో నైసుగా ఉండే కుర్రాడొకడు ..నీటు గా గెడ్డం చేసుకుని , నున్నగా తల దువ్వుకుని ,ఇస్త్రీ నలగని బట్టల్ని చక్కగా "ఇన్ -షర్ట్ "చేసుకుని ..దొరబాబు లా హుందాగా బైకు ఎక్కి దర్జా గా ఆఫీసు కి వెళ్తుంటే ..అప్పుడు మొదలవుతుంది..నా ఏడుపు !
అతను ఏదో కంప్యూటరు కంపెనీలో పని చేస్తున్నాడంట.
అలా మొదలైన నా ఏడుపు ..కంపెనీ కి వెళ్తున్నపుడు దారిమధ్యలో తగిలే కూల్ డ్రింకు షాపుల దగ్గర ,టిఫిన్ సెంటర్లు దగ్గర అమ్మాయి తో సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పళ్ళు యికిలించే కాలేజి కుర్రాళ్ళ ని చూస్తే ...(క్షమించాలి !అందర్నీ కాదు ..కొందరినే )నా ఏడుపు వరదగోదారై ఉప్పొంగుతుంది.
మన ఊళ్ళో ఆడపిల్ల వంక కన్నెత్తి చూస్తేనే ..మహా పాపం కదా !
ఇక్కడ అలాంటివేమి ఉండవు! ఎంచక్కా అమ్మాయి లు అబ్బాయి లు చెట్టపట్టాలు వేసుకుని హుషారుగా షికార్లు చేస్తుంటారు !

అంతేనా ?!...
మా ఆఫీసు లో మేనేజరు గారు (డు)చక చక మని ఇంగ్లీషు లో మాట్లాడేస్తున్నపుడు.....
దేవ కన్య లాంటి అమ్మాయి వచ్చి ..ఇంగ్లీష్ లో అడిగిన అడ్రస్స్ కి నేను టక్కున సమాధానం చెప్పలేక తెల్ల మొహం వేసినప్పుడు ..
నేను నా డొక్కు సైకుల్ని ఈడ్చుంటూ వెళ్తుంటే . ...నా పక్కనే రయ్యిమంటూ దూసుకెళ్ళే కార్లు ,నా మీద వర్షపు నీళ్ళని చిమ్మి నిర్లక్ష్యం గా వెల్లిపోతున్నపుడు...నా గుండెల్లో నుండి తన్నుకొచ్చే ఏడుపుని గొంతుకలోనే నొక్కేసి, నేను పడే బాధని ఎలా చెప్పగలను ?!
నేను కూడా చదువుకోక బట్టే కదా ...ఇలాంటి సరదాలన్నీ మిస్సై పోయి ,ఇన్ని అవమానాల్ని భరించాల్సి వస్తుంది .
ఆ రోజు మా నాన్న చదువుకోమన్నపుడు ,నా మనసుకెక్కలేదు ..
నేను చదువుకుందామనుకున్నపుడు బ్రతుకు బాగోలేదు .
అందుకే పెద్దలు అంటారు -"దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని !".

ఆ మాత్రం దానికే అంతలా ఏడవాలా అంటావా?!నీకేం బాబూ..ఊళ్ళో కూచుని ఏమైనా చెబుతావు .
ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది నా బాధ !
ఒక పండగ సంతోషం ఉండదు ..ఒక తద్దినం హడావిడి ఉండదు !
కనీసం ఆదివారమైన ఒక పూట సెలవు ఉండదు .
సెలవు రోజుల్లో ..మా రూము లో కుర్రాలంతా కాళ్ళు బార జాపుకుని కబుర్లు చెప్పుకుంటున్నపుడు...సాయంత్రం పూట "పస్టు షో" సినిమాకి వెళ్తున్నపుడో ..నా గుండె అగ్ని గుండం అయిపోతుంది .
పండగలప్పుడు పిండి వంటలు ఎలాగూ లేవు..కనీసం కమ్మటి పప్పున్నం అయినా తిందామంటే ..నేను తినే హోటలు మీల్సు లో ఉప్పే సరిగా ఉండదు ..ఇంక కమ్మటి పప్పు కూర ఎక్కడిది ?!

ఏంట్రా సూరి !నీకు నవ్వు వస్తుందా ?నా బాధలన్ని నీకు నవ్వులాట గా ఉందా ?
అవునులేరా ..గట్టు మీద వున్నోడికి గోతిలో పడ్డ నా లాంటివోడి బ్రతుకు నవ్వులాటగానే ఉంటది !
గంగ రాజు గారు మన ఊరి మనిషే కదా అని ..కష్టకాలం లో కాస్తయిన ఆదుకోకబోతాడా..అని తక్కువ జీతమైనా చటుక్కున ఈ గుమస్తా ఉద్యోగం లో జేరిపోయాను కానీ ...ఆయనే నన్ను కష్టాల కడలి లో తోచేస్తాడని,నా మొహమాటాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన చాకిరీ చేయించుకుంటాడని నేను ఊహించలేదు .

ఏంటోరా...తాడు బొంగరం లేకుండా అయిపోయింది జీవితం !
పోనీ చదువు సంగతి పక్కన పెట్టు ..కనీసం నాకు ఇష్టమైన కథలు ,కవిత లు మీదైనా గట్టిగా ద్రుష్టి పెట్టినా ..మరీ యండమూరో ..చంద్ర బోసో కాకపోయినా ..ఏ వార పత్రికల్లోనో,మాస పత్రికల్లోనో .. కథలో కాకర కాయలో రాసుకుని ..పేపర్లో నా పేరు చూసుకుని ,భుక్తి కి సంపాదించు కాకపోయినా ముక్తినైనా పొందేవాడిని .

సరేరా ..మావా!ఇవన్నీ అనుకుని ఏం లాభం -భకాసురుడు,కుంభ కర్ణుడు నా అన్నా తమ్ములైనప్పుడు !!
నా సోది అంతా చెప్పి నిన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నానా?
ఏదో సరదాకి చెప్పేను కానీ ,అసలైన కష్టాలంటే ఇవి కావురా ..!
చదువుకోకపోవడం వల్లా ..అసలు బ్రతుకంటే ఏమిటో తెలియకుండా బ్రతికేస్తే ..ఎలాంటి కష్టాల్ని ,నష్టాల్ని భరించాల్సి వస్తుందో ..అనుభవించిన నాకు తెలుసు !నన్ను పుట్టించిన ఆ దేవుడి కి తెలుసు !!
ఇదైనా నీకు ఎందుకు చెబున్నానంటే ...మన ఊళ్ళో ,మన తరవాత కుర్రాల్లైన చదువుకోకుండా ..నాలా ముందు చూపు లేకుండా అడ్డ దిడ్డం గా బ్రతికేస్తుంటే ..వాళ్ళ కి నా గురుంచి చెప్పైనా వాళ్ళకి నాలుగు చివాట్లు పెడతావని నాకు చిన్న ఆశ !
తరవాత వాళ్లైనా నాలా కాకుండా ఉంటారని ,ఉండాలని నా ఆరాటం !
సరేరా సూరి ..ఇంత సేపూ నేను చెప్పిన నా సోదంతా విసుగు లేకుండా చదివినందుకు చాలా సంతోషం !
వీలుంటే వారం లోగా మళ్లీ ఉత్తరం రాస్తాను ..నీవు వద్దన్నా ,కాదన్నా రాస్తాను !
నేను ఏమైనా తప్పులు రాస్తే మనసులో ఏమీ పెట్టుకోకు !

ఇట్లు .నీ ప్రియ మిత్రుడు,
చెవుడు బావుల వెంకటేశ్వరరావు (ముని మాణిక్యాల రావు ).

8 కామెంట్‌లు:

శిశిర చెప్పారు...

శ్రీను గారు,
మీ చెవుడు బావుల వెంకటేశ్వరరావు గారు మంచి రైటరని ఈ ఉత్తరం చూస్తుంటేనే తెలుస్తూంది. ఆయన్ని మరింత దృష్టి పెట్టమని చెప్పండి. :) బాగా రాశారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శిశిర గారు !మీరు అన్నమాట మా చెవుడు బావులోడి తో చెప్పాను !
నిజ్జం గా... వాడి కళ్ళల్లో ఉప్పొంగిన వరద గోదారిని చూసాను ..బాధ తో కాదు ,అనందం తో !!
మీ లాంటి వాళ్ళ ప్రోత్సహం ఉండాలేగానీ,వాడు ఎక్కడైనా మా రాజు లా బ్రతికేస్తాడండి.
మీకు నా ధన్యవాదాలు .

ఊకదంపుడు చెప్పారు...

చెవుడు బావుల ముని మాణిక్యాల రావు
ఉత్తరం పూర్తిచేశే లోపు పేరు మార్చుకున్నాడా అండీ లాతే మరిచి పోయాడా అండీ?
ఆయన్ని మరింత దృష్టి పెట్టమని చెప్పండి. :) బాగా రాశారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

మీరు చెప్పింది నిజమే సుమండీ ..!నేను గమనించనే లేదు. పని వత్తిడి లో పడి మా చెవుడు బావులోడు కొంచెం తిక మక అయినట్టున్నాడు !నిజానికి వాడి అసలు పేరు,వాడి అమ్మ నాన్న లు పెట్టిన పేరు ముని మాణిక్యాల రావే గానీ ...కొంచెం పాత గా ఉందని తెగ బాధ పడిపోయి ,తనకు తానే ఎంతో ఇష్టపడి మార్చుకున్న తన ఇష్ట దైవం పేరు "వెంకటేశ్వర్రావు".అనుకోకుండా అప్పుడప్పుడు అలా బయటికి వచ్చేస్తుందిట .తన పొరపాటు ని తెలియజెప్పినందుకు మీకు ధన్యవాదాలు చెప్పమన్నాడు .వాటి తో పాటు నా ధన్య వాదాలు.

భావన చెప్పారు...

చాలా బాగుందండి. మనసులోని సొద నంతా స్నేహితుడీ తో పంచిన తీరు బాగుంది. :-)

శ్రీను .కుడుపూడి చెప్పారు...

భావన గారు !చాలా సంతోషం అండీ.మీకు ధన్యవాదాలు .

మేఘన చెప్పారు...

చదువుకోమని చెప్పడానికి ఇంత సోది పెడితే భయపడిపోతారు కదండీ, కాస్త తగ్గించి చెప్పొచ్చు కదా

శ్రీను .కుడుపూడి చెప్పారు...

మేఘన గారు !మా చెవుడు బావులోడు మాములు గానే కొంచెం నస గాడండీ!మీ మాట గాని వాడు విన్నాడంటే ..కొంచెం పీలైపోతాడండి.వాడు చెప్పేది సోది కాదండి..వ్యధ!మనకి వధ (హ ..హ ) !!
మిమ్మల్ని కూడా "మీకే మండీ...ఎంచక్కా చదివేసుకుని గవర్నమెంటోడి ఉజ్జోగం చేసుకుంటూ గట్టు మీద ఉన్నోరు.ఎన్నైనా చెబుతారు ..నా బాధ నాకే తెలుసు .ఆ పై భగమంతుడికి తెలుసు "అనేస్తాడు .
మీకు మాత్రం నా ధన్యవాదాలండి ..

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...