23, మే 2010, ఆదివారం

వీధి సినిమా హంగామా !



అవి మా ఊరి మొత్తాని కి అరిగెల వెంకన్నాయుడు గారి లంకంత కొంపలో ,పెద్ద బి పి ఎల్' బ్లాక్ &వైట్ టివి మహా రాజు లా మహా దర్జా గా వెలిగిపోతున్న రోజులు !
ఊరి మొత్తానికి ఒకే ఒక్క టివి కదా ..ఆ మాత్రం దర్జా ఉంటుంది లెండి !
రాత్రి అయ్యేసరికి ఊళ్ళోని జనమంతా ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని టివి చూసేదానికి నాయుడు గారి అరుగు మీద తిష్ట వేసేవారు . వారం లో అయిదు రోజులు జనం కాస్తంత పలచగానే ఉన్నా ..మిగిలిన రెండు రోజులు అంటే శుక్రవారం "చిత్రలహరి "అప్పుడు ,ఆదివారం "సినిమా " వచ్చినపుడు మాత్రం వాళ్ళ హాలు మొత్తం రిలీజు సినిమా ధియేటర్ లా కిక్కిరిసిపోయి ,మిగిలిన జనం అరుగు మీద వేల్లాడుతూ ,చివరాఖరు కి రోడ్డు మీద కంటా నిలబడి నేరేడు కాయల్లాంటి కళ్ళని తాటి కాయలంత చేసి ఆత్రం గా చూసేవాళ్ళు .

అలాంటి కరువు రోజుల్లో (సినిమా కరువు లెండి )ఏ దేవి నవ రాత్రుల కో ,వినాయక ఉత్సవాల కో మా ఊళ్ళో తప్పని సరిగా వేసే 'తెర సినిమాల' హంగామా గురుంచి ఇంకేం చెప్పాలి ?!

అవి మా చీముడు ముక్కుల్ని మోచేత్తో తుడుచుకుంటూ ,కృష్ణ ,చిరంజీవులని పిచ్చిగా ఆరాదిస్తూ ..
మా పెద్ద వాళ్ళేమో ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమా రోజుల్ని నెమరు వేసుకుంటూ తాపీగా కాలం వెల్ల దీస్తున్న రోజులు.
అలాంటి రోజుల్లో ..ఉత్సవాల కి నెల రోజుల ముందునుంచే చందాల వసూళ్ళ హడావిడి మొదలయ్యేది .ముఖ్యం గా తెర సినిమాల్ని దృష్టి లో పెట్టుకుని చందాల వసూళ్ళు సాగేవి . ఉత్సవాల్లో మొదటి రెండు రోజులు ,ఏ హరి కథో ,బుర్ర కథా కాలక్షేపం తో నో సాఫీ గానే గడిచిపోయేవి కానీ ,మూడో రోజు నుంచి మాత్రం అసలు గొడవ మొదలయ్యేది .

మా పెద్ద వాళ్ళేమో ,ఏ న్టీ ఆర్ ,ఏ యన్నార్ సినిమాల్లో ఏదో ఒకటి అని సర్దుకుపోతే ,మా పిల్లకాయలు మాత్రం చిరంజీవి సినిమా ఒకడు ,కృష్ణ సినిమా అని ఇంకొకడు పట్టు బట్టడం తో రెండు గ్రూపులుగా విడిపోయేవాళ్ళం.
అక్కడితో పెద్దవాళ్ళ గ్రూపు తో కలిసి మూడు అయ్యేవి .ఇంక మూడు సినిమాలు తప్పనిసరి అయ్యేవి .
కానీ వసూలయిన చందా డబ్బులు మూడు సినిమాల కి సరిపోకపోవడం తో అభిమాన హీరో సినిమా కోసం ఆయా గ్రూపుల వాళ్ళు మిగిలిన డబ్బుల్ని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చేది .
పెద్ద వాళ్ళ సంగతి సరేసరి ,మేం పిల్లకాయలం డబ్బులు ఎక్కడ నుంచి తెస్తాం ?

ఒక అవిడియా !ఒక చిన్న రేకు డబ్బాకి చిన్న రంద్రం చేసి రెండు గ్రూపులు కాలవ గట్టు మీద కి వచ్చేవాళ్ళం .
కాలవ ఆవలి పక్కన ఒక గ్రూపు ,ఇవతల పక్కన ఒక గ్రూపు కాపు కాచి దారి లో వచ్చే ,పోయేవాల్లని ఆపి బ్రతిమాలో ,ఒక్కోసారి బలవంతం గానో "దేముడి చందాలు " వసూలు చేసేవాళ్ళం .
నేను మాత్రం చందాలు వసూలు చేసేదానికి వెళ్ళకుండా ఆ రోజంతా సినిమా ప్రచార కార్యక్రమం లో తల మునకలయ్యేవాడిని .
ఎలాగంటే ......మా గుడి లో మైకి సెట్టు లోంచి నిరంతరం గా వస్తున్న"దేవ దేవ ధవళాచల మందిర ...." పాటని మద్య మద్య లో ఆపేసి నా గొంతు ని కాస్తంత గంభీరం గా పెట్టి మైకు లో -
"భక్త మహాశయులారా !విజ్ఞప్తి -ఈ రోజు రాత్రి దేవి నవరాత్రుల సుభ సందర్భం గా మన ఊరి దుర్గమ్మ గుడి దగ్గర సూపర్ స్టార్ కృష్ణ నటించిన గొప్ప బ్రహ్మాండమైన కుటుంబ కథా చిత్రం 'పచ్చని కాపురం 'ప్రదర్శించబడుతుంది .కావున తామంతా విచ్చేసి మాయీ ప్రోగ్రాం ని జయ ప్రదం చెయ్యాలని కోరి ప్రార్దిస్తున్నాం "అంటూ పది నిముషాలకో సారి గొంతు చించుకునే వాణ్ణి .

మైకు సెట్టు లో నా గొంతు విన్న మా అమ్మ తెగ సంబర పడి పోతా ఉంటే,పండక్కి మా ఊరోచ్చిన మా అమ్మమ్మ "విజమ్మా!(మా అమ్మ పేరు విజయ లక్ష్మి ) నీ కొడకు ఎలా బ్రతుకుతాడోనని బాధ పడిపోతావు కదా ...చూడు ..ఎంత బాగా మైకు లో మాట్లాడుతున్నాడో !సినిమా బండి లాక్కోడానికైన పనికి రాడంటావా?"అని వేళాకోలమాడేది .

ఏమైతేనేం ...ఎలాగోలా సాయంత్రాని కి మా వీధి లో 'తెర సినిమా 'పడిపోయేది .సాయంత్రం అయ్యేసరికి మా పిల్లకోతులమంతా ఊళ్ళో మందార చెట్ల మీద పడేవాళ్ళం .ఎవరికి అందిన పూలని వాళ్ళు కోసుకుని వాటితో పాటే కాసిన్ని మందారాకుల్ని కోసి ,చిన్న చిన్న ముక్కల గా చేసి మా అభిమాన హీరో మీద చల్లేందుకు రెడీ గా పెట్టుకుని ఉండేవాళ్ళం .(రామ.. రామ !తప్పుగా అనుకునేరు ..నేను అన్నది తెర మీద హీరో మీద చల్లడానికి ).
రాత్రి కి మా పిల్లకాయలం అంతా తెర ముందు గోనే పట్టాలని పరుచుకుని కూచునేవాళ్ళం .
పెద్ద వాళ్ళ యితే ఏ కుర్చీ నో బల్ల మీదనో ,లేకుంటే అరుగుల మీదనో కూచుని సినిమా చూసేవారు.
ముందు వరసలో కూచున్న మేమంతా తెర మీద కి హీరో గారు వచ్చినప్పుడల్లా ..మేము రెడీ చేసి పెట్టుకున్న పువ్వుల్ని గట్టిగా అరుస్తూ తెర మీద కి విసిరేవాళ్ళం .పెద్దవాళ్ళు మందలించినా వినేవాళ్ళం కాదు .
సినిమా అయ్యేంత వరకూ కింద పడిన పువ్వుల్ని మళ్లీ ఏరుకుంటూ ,అరుచుకుంటూ ,అలసిపోతూ ఏ అర్ధరాత్రప్పుడో ఇళ్ళకు పోయి తృప్తి గా నిద్రపోయేవాళ్ళం .


**పాటల పూ తోట లో మన" వేటూరి పుష్పం " రాలిపోయింది .అయినా ఆ పరిమళం తెలుగు నేల పై నిత్యం గుబాళిస్తూనే ఉంటుంది .ఆ మహాను భావుడి కి కన్నీటి వీడ్కోలు .

8 కామెంట్‌లు:

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

"సినిమా బండి లాక్కోడానికైన పనికి రాడంటావా?"
హా..హ్హా...

వీధి సినిమాల్లో చూసినప్పుడు ఉన్న మాజా, దొరికిన ఆనందం మల్టీప్లెక్సుల్లో వందల కొలది టికెట్స్ కొని చూసినా రాదండీ..దటీజ్ వీధి సినిమా!!

చాలా బాగుంది మీ టపా..

సుభద్ర చెప్పారు...

చాలా బాగు౦ది..ముఖ్య౦గా మీ అమ్మమ్మ గారి వేళాకోల౦ ...మళ్ళి మళ్ళి చదివాను..
అయితే మీరు కిట్టిగాడి ఫ్యానా???మా ఉళ్ళో కృష్ణఫ్యాన్స్ ఇలానే అనేవారు మరి..
వేటురిగారి ఆత్మశా౦తి కలగాలని ప్రార్దిస్తూ..
సుభద్రా.

Rao S Lakkaraju చెప్పారు...

పాలకొల్లు టూరింగ్ టాకీస్లో చాపమీద కూర్చుని చూసిన "సంసారం" సినెమా గుర్తుకు వచ్చింది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

శేఖర్ గారు మీకు ధన్యవాదాలు .మీరు బ్లాగర్ల శ్రేయోభిలాషి అని ఎక్కడో చదివాను.మీరు నా బ్లాగులో కామెంట్ రాయడం నా అదృష్టం .

శ్రీను .కుడుపూడి చెప్పారు...

ధన్యవాదాలు సుభద్ర గారు !కిట్టి గాడు అనకండి ..నేను చాలా ఫీలయిపొతాను.కృష్ణ గారు అనండి .హ.. హ !

శ్రీను .కుడుపూడి చెప్పారు...

రావు గారు !నా టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు . నా టపా తో మీ పాత రోజులు గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషం .

Unknown చెప్పారు...

"తువ్వాయి" గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

Unknown చెప్పారు...

శ్రీను గారూ,
మీ బ్లాగు చాలా బాగుంది.
తువ్వాయి పేరు చూడగానే,ఎటో వెళ్ళిపోయింది మనసు....
మీ రాతలు చదువుతుంటే
తువ్వాయిని దువ్వుతూ,దాని గంగడోలు నిమురుతుంటే,
తువ్వయి మోర ఎత్తి కళ్ళుమూసుకుని అనందిస్తున్నట్టు గా ఉంది.
అందుకే ఈ మనసారా అభినందనలు......

ఉషాకిరణ్,
ముంబాయి.

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...