21, నవంబర్ 2010, ఆదివారం

అభిమాన సంఘాలు !




"ఒరేయ్ ..ఆడేం పార్టీ?"

"మన పార్టీనేరా..క్రిష్ణా పార్టీ .."

వేసవి సెలవుల కి మా ఊరోచ్చిన మా చిన్నమ్మ కొడుకు శీను ని మా జట్టు కుర్రోల్లకి పరిచయం చేసేవాడ్ని . "మరి ఆడో ..? "మాకు కాస్తంత దూరం లో నిలబడి నేల చూపులు చూస్తున్నమా మావయ్య కొడుకు యోగి గాడి గురుంచి కాస్తంత డౌటు గానే అడిగేవారు మా జట్టు వాళ్ళు . "మరే ..మరే ఆడు చిరంజీ{చిరంజీవి } పార్టీ రా .." నేను నీళ్ళు నమిలేవాడ్ని. "యోగ్గాడు మన ఆటలో వొద్దు .శీను గాడ్ని రమ్మను . " అనేసి ఆటల్లో నిమగ్నమై పోయేవాళ్ళు . యోగ్గాడు మాత్రం ముఖం మాడ్చుకుని ఓ మూలన కూచునేవాడు. వాళ్ళ ఊరికి వెళ్తే నా పరిస్థితి కూడా అంతే !ఎందుకంటే...వాళ్ళ ఊళ్ళో వాడి జట్టు కుర్రాల్లంత 'చిరంజీ 'పార్టీ మరి !
ఆ వయసులో ..ఆ పార్టీలు తప్ప ..ఓట్లు కోసం ,కోట్ల కోసం కొన్ని 'రాజకీయ పార్టీలు' ఉంటాయని ..నోటు తీసుకుని ఓటు వేసే జనాలు ఉంటారని మాకు నిజ్జం గా తెలీదు !
ఆ రోజుల్లో 'ఓట్లు ఎలక్షనంటే' మా స్కూలికి సెలవని మాత్రమే తెలుసు మాకు !
ఆ ఎలక్షన్ల లాగే ..మనోళ్ళకి కూడా ఎలక్షన్లు ఉంటే మనోడే నేగ్గేస్తాడు కదరా ..అని ఒకడంటే ,లేదు మావోడే నెగ్గుతాడని ఇంకొకడు ,అలా ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకునేవాళ్ళం .
ఒక్కోసారి కొట్టుకోడానికి కూడా రెడీ అయిపోయేవాళ్ళం .అది "చిన్నతనం " !

జనవరి పస్టుకి మా అభిమాన హీరోల్ల గ్రీటింగులనే కొనుకున్నేవాళ్ళం .ఎవరైనా మా 'ఎగస్పార్టీ ' హీరో గ్రీటింగు ఇస్తే ,అది వాళ్ళు చూడకుండా చించేసేవాళ్ళం.అంతటి అభిమానం(?)(దీనిని దురాభిమానం అనాలేమో :) ఉండేది మా లో !
ఆ అభిమానం మా వయసు తో పాటే కొంచెం పెద్దదవుతూ ..వచ్చింది .కానీ కొట్టుకోవడం ,తిట్టుకోవడాలు మాత్రం తగ్గినై .
కొన్ని రోజులకి ..మాలో కొంతమంది క్రిష్ణ ముసలాడైపోతున్నాడని ,మహేసు ఫ్యాన్సు కి మారిపోతే ,ఇంకొందరు వేరే హీరో ఫ్యాన్సుకి మారిపోయారు .చిరంజీ ఫ్యాన్సు లో కొంతమంది పవన్ కళ్యాణు వచ్చాక అటువైపు జారిపోయారు .
అలాగే ..బాలకృష్ణ ఫ్యాన్సు కొంతమంది ..నాగార్జున ఫ్యాన్సు ఇంకొంతమంది .
నేను మాత్రం 'చంటి' సినిమా చూసాక వేంకటేశు ఫ్యాన్సుకి మారిపోయాను .
మాది అసలే కోనసీమ కదా ..అభిమానాలు ,ఆప్యాయతలు కొంచెం ఎక్కువే !కానీ సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు మారిపోతాయి అంతే!:)

మాకు కొంచెం వయసొచ్చాక .. బజారు లో కి అడుగుపెట్టాక ఎవరికీ నచ్చిన' అభిమాన సంఘాల్లో'వాళ్ళు జాయినైపోయాము.ఆ అభిమానసంఘాల నేపధ్యం లో మా హీరోల పుట్టిన రోజులకి మాకు చేతనైనంత 'సమాజ సేవ' చేసే వాళ్ళం !మా అభిమానం ఈ రకం గా నైనా ఉపయోగపడుతున్నందుకు ..చాలా సంతోచించేవాన్ని నేను . మా అభిమాన హీరో సినిమా రిలీజు రోజైతే మాత్రం ..'ధియేటర్ 'లో హంగామా మొత్తం మా ఫ్యాన్స్ అసోషియేషన్ వాళ్ళదే !
ధియేటర్ మొత్తం రంగు రంగుల జండాల తో అలంకరించేవాళ్ళం."బెనిపిట్ "షో సినిమా టిక్కెట్లన్నీ మా చేతిలోనే ..! తెలిసిన వాళ్ళు మమ్మల్ని టిక్కెట్లు కోసం బ్రతిమాలుతుంటే ..తెగ కటింగులు యిచ్చెసేవాళ్ళం. 'వందరోజుల 'రోజుల పండగల్ని ఘనం గా చేసి ..'సితార' పేపరులో మా అసోషియేషన్ పేరు ,మా పేర్లు చూసుకుని తెగ మురిసిపోయేవాళ్ళం .అలా ఆ రోజుల్లో మా 'హవా' సాఫీగా సరదాగా నడిచిపోయింది .

రోజులు గడిచే కొద్దీ ..మా జట్టు లో కొంత మందిమి "బ్రతుకుతెరువు "కోసం నగర బాటలు పట్టాం!మిగిలిని వాళ్ళు ఊరిలోనే స్థిరపడిపోయారు .మా అభిమాన సంఘాలు పోయినా ..ఆ స్థానం ఇంకో కొత్త 'అభిమాన సంఘాలు' పుట్టుకొచ్చాయి .సినిమా హీరోలు కూడా పెరిగారు కదా !
మొన్నొక రోజు మా ఊరు నుండి మా చిన్న నాటి స్నేహితుడు సుబ్రహ్మణ్యం పోను చేసి "ఒరేయ్ !మొన్న మన గడియారం స్థంబం సెంటరు లో పెద్ద గొడవైపోయిందిరా.."అన్నాడు .'ఎందుకురా?!' అని ఆరా తీస్తే ..ఒక 'అభిమాన హీరో' కటౌట్ కి ఎవరో మట్టి కొట్టారట..ఆ కోపం తో వీళ్ళు అవతలి వాళ్ళ
'అభిమాన హీరో' సినిమా వాల్ పోస్టర్లు అన్నీ చించేసారట!ఎంత పిచ్చితనం !మేం చిన్నతనం లో ఏదో తెలియక కొట్టుకునేవాళ్ళం . కానీ వీళ్ళకి వయసొచ్చాక..జ్ఞానం తెలిసాక కూడా ఈ 'చిల్లర' పనులేమిటో?!వీళ్ళ పుట్టినరోజులు మానుకుని ఆ డబ్బులు తో ,వాళ్ళ అభిమాన హీరో ల పుట్టిన రోజులకి జెండాలు కొని 'పండగ' చేసే పిచ్చి జనాలు ఉన్నారు మా ఊళ్ళో !
ఈ అభిమానులు ఇలా కొట్టుకు చస్తున్నపుడైనా సదరు అభిమాన హీరోలు "మేమంతా ఒకటే ..మా కోసం మీరు కొట్టుకోవద్దు "అని చిన్న స్టేట్ మెంట్ ఇస్తే చాలా వరకు గొడవలు తగ్గొచ్చు .కానీ వాళ్ళకి ఇదంతా 'చిన్న విషయం' !

సరే ,ఆ సినీ అభిమానుల సంగతి కొంచెం పక్కన పెడితే ... నేను ఈ మద్య కొత్తగా చూసినవి(నేను చూడటం కొత్త తప్ప .ఇవి పాతవే ) "రాజకీయ అభిమాన సంఘాలు "!
ముఖ్యం గా హైదరాబాద్ లో ఐతే గల్లీకో నాయకుడు తయారై .చుట్టూ వందమంది తో ఓ 'అభిమాన సంఘాన్ని' పెట్టుకోవడం ..వాళ్ళ తో ఊరేగింపుగా వెళ్లి ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆర్భాటం గా చేరిపోవడం ఒక ఫ్యాషను అయిపొయింది .ఆ అభిమానుల్లో ఆ అభిమానం ఎక్కడినుండి పొంగుకోస్తుందో ..ఆ నాయకులకి ,ఆ అభిమానులకే తెలియాలి మరి !

నాకు మాత్రం ఒక్కటి అనిపించింది -ఈ రాజకీయ అభిమాన సంఘాలతో పోల్చుకుంటే ,ఏమీ ఆశించకుండా గుండె నిండా నిండైన ప్రేమని నింపుకునే ఈ 'సినీ అభిమానులు''వెయ్యి రెట్లు బెటర్ అని !కానీ ఆ అభిమానం కొంచెం శ్రుతి మించకుండా ఉంటే మంచిది .
హీరోలూ!ఈ పిచ్చి అభిమానులని కొంచెం గమనిస్తూ ఉండండీ ...వాళ్ళకి అదే పదివేలు !

14 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

బాగా రాశారు

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@కొత్తపాళీ గారు : మీరు నా టపా కి కామెంటు రాయడమే ..
నాకు వెయ్యి ఏనుగుల బలమండీ ..ధన్యవాదాలు .

మురళి చెప్పారు...

"మాది అసలే కోనసీమ కదా ..అభిమానాలు ,ఆప్యాయతలు కొంచెం ఎక్కువే !కానీ సమయాన్ని బట్టి కొంచెం అటు ఇటు మారిపోతాయి అంతే!:)"
.....ఆయ్ మరేనండి.. మన్సైడోల్లంతా అంతేనండి..

శిశిర చెప్పారు...

బాగుందండి.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాగుందండీ, నిజమే శ్రుతిమించనంత వరకూ బాగానే ఉంటాయి ఈ అభిమాన సంఘాలు.

నాకు "శ్రీకనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్" లో కృష్ణ ఫాన్స్ అసోషియేషన్ నరేష్ ను పెట్టే ఇబ్బందులు గుర్తొస్తాయి ఈ అభిమాన సంఘాల పేరు వినగానె.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@మురళి గారు :హ ..హ :) మురళి గారు...నిజమే కదండీ మరి !ధన్యవాదాలు .

@శిశిర గారు :శిశిర గారు ..ధన్యవాదాలండీ .

@వేణు శ్రీకాంత్ గారు :ధన్యవాదాలండీ :)

రాజేష్ జి చెప్పారు...

మంచిగా చెప్పారు.

$కానీ ఆ అభిమానం కొంచెం శ్రుతి మించకుండా ఉంటే మంచిది .

అవును. ఒక్కోసారి తలలు పగులకోట్టుకునే స్థితికి తీసుకువెళ్తుంటారు.

అజ్ఞాత చెప్పారు...

"హీరోలూ!ఈ పిచ్చి అభిమానులని కొంచెం గమనిస్తూ ఉందండీ ...వాళ్ళకి అదే పదివేలు !"
బాగా చెప్పారు. రవితేజ సినిమా 'నేనింతే' లో అభిమానుల అగచాట్ల గురించి చాలా బాగా చూపారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@RSReddy garu: నిజమే కదండీ ..ఆ హీరోలే తమ దేవుళ్ళు అనుకునే పిచ్చి అభిమానులున్నారు మరి!
మీ స్పందనకు ధన్యవాదాలు .

వాజసనేయ చెప్పారు...

అభిమానం దురభిమానం కాకుండా ఉన్నతకాలం పరవాలేదండి, కాని నేడు అది ఒక వ్యసనం లా తయారు ఐంది. పైగా ఈ అభిమాన సంఘాలలో కుడా కుల ప్రాతిపదికన ఏర్పదినవైతే మరీను .

Unknown చెప్పారు...

hai srinu mee abhimana sanghalu chaduvutunte naa chinnappati rojulu gurtuku vachindi..appatilo nenu ntr veerabhamanini..alage politics ..ela ippudu avi talachukunte navvukuntamu..aa age lo denikaina attract avvadam mana life lo oka part anukovadam sahajam..ade aa age amayakatvam..appudu adi andam..ippudu aa hero, player, politicians vaala pi penchukunna abhimanalu kosam alochiste manam ala vunnama anukuntamu..edi aina haddulalo vunte good..but mithimeerite chala kastam..mana abhimanalu mana varake vundali edutavarini kinchaparichedi eppudu tappu kada..mee article very nice..baga rasaru..keep it up..god bless u..inka mee daggara nundi inka manchi articles expect chestunnamu..bye......

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@వాజసనేయ :అవునండీ ..ఈ మద్య ఈ అభిమాన సంఘాలు 'కుల ప్రాతిపదికన ' ఏర్పడం వల్లే ఈ కుమ్ములాటలు !
మీ స్పందనకు నా ధన్యవాదాలు .

@సబిత గారు :ధన్యదాలండీ .నా ప్రతీ టపాని చదివి ఎంతో ఓపికగా కామెంట్లు రాస్తున్నందుకు చాల సంతోషం !

అజ్ఞాత చెప్పారు...

హీరోలు చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటున్నా అభిమానులు మాత్రం కులం పేరుతో కొట్టుకు చస్తున్నారు.

శ్రీను .కుడుపూడి చెప్పారు...

@bonagiri:నిజమేనండీ ..అందుకే వీళ్ళు "పిచ్చి జనాలు "!
మీ స్పందనకు నా ధన్యవాదాలు .

భోగిమంట- కథ (సాక్షి ఫన్ డే )

సంక్రాంతికి సొంతూరు అమలాపురం బయలుదేరాము హైదరాబాద్ నుండి. కూకట్ పల్లి బస్టాప్ లో నిలబడ్డాం బస్సుకోసం.పండగ సందడిని పొట్లం కట్టుకుని నింగికి దూ...